పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-404-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున.

టీకా:

ఇఇట్లు = ఈ విధముగా; వెడలి = బయలుదేరి; సమర = యుద్ధ; సన్నాహ = ప్రయత్నమునందలి; సముల్లాసంబున్ = ఉత్సాహమును; మొగంబుల్ = ముఖముల; కున్ = కు; వికాసంబు = తేటదనము; సంపాదింపన్ = కలుగజేయగా; ప్రతిపక్ష = శత్రువుల యొక్క; బలంబుల్ = సైన్యముల; తోడన్ = తోటి; తలపడినన్ = ఎదిరించగా, తాకిన; ద్వంద్వయుద్ధము = జతజతగా చేసే యుద్ధము; అయ్యెన్ = జరిగెను; అప్పుడున్ = అప్పుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; పురాతన = పురాతనమైన; యోధుల = శూరుల; ఆ = ఆ యొక్క; యోధనంబున్ = పోరును; చూచున్ = చూసెడి; వేడ్కన్ = కుతూహలముతో; చనుదెంచిన = వచ్చిన; సరసిజసంభవ = బ్రహ్మదేవుడు; శక్ర = ఇంద్రుడు; సుర = దేవతలు; యక్ష = యక్షులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; గరుడ = గరుడులు; ఉరగ = నాగులు; ఆదులు = మున్నగువారు; నిజ = తమ; విమాన = విమానములందు; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; వియత్తలంబునన్ = ఆకాశ ప్రదేశమునందు; నిలిచిరి = నిలుచుండిరి; అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు; కృష్ణుండును = కృష్ణుడు; హరుండునున్ = శివుడులు; మారుండును = ప్రద్యుమ్నుడు; కుమారుండును = కుమారస్వామి లు; కూపకర్ణ = కుపకర్ణ; కుంభాండులును = కుంభాండులుతో; కామపాలుండును = బలరాముడును; బాణ = బాణుని; పుత్రుండు = కొడుకు; అగు = ఐన; బలుండును = బలుడు తో; సాంబుండును = సాంబుడును {సాంబుడు - కృష్ణుని కొడుకు}; సాత్యకియునున్ = సాత్యకి {సాత్యకి - కృష్ణుని రథ సారథి}; బాణుండును = బాణుడు లు; రథికులున్ = రథికులు; రథికులును = రథికులతో; ఆశ్వికులున్ = గుఱ్ఱపురౌతులు; ఆశ్వికులునున్ = గుఱ్ఱపురౌతులతో; గజారోహకులున్ = ఏనుగులపైనియోధులు; గజారోహకులున్ = గజారోహకులతో; పదాతులున్ = కాలిబంట్లు; పదాతులునున్ = కాలిబంట్లతో; తలపడి = తాకి; ఇతరేతర = ఒకరినొకరు; హేతి = ఆయుధములతో; ఘట్టనంబులన్ = కొట్టుటలతో; మిణుగుఱులు = నిప్పురవ్వలు; చెదరన్ = ఎగయగా; పరస్పర = ఒకరినొకరు; ఆహ్వాన = పిలుచుటలు; బిరుదా = బిరుదులతో; అంకిత = గుర్తులతో; సింహనాద = బొబ్బలు; హుంకార = హుం అను ధ్వనులతోను; శింజినా = వింటితాడు యొక్క; టంకార = టం అను శబ్దములతో; వారణ = ఏనుగు; ఘీంకార = ఘీం అను శబ్దములతో; వాజి = గుఱ్ఱముల; హేషా = సకిలింతల; రవంబులనున్ = శబ్దములతో; పటహ = యుద్ధవాద్యాలుతప్పెటలు; కాహళ = ఊదెడి వాద్యవిశేషము, బాకా; భేరీ = పెద్దనగారాలు; మృదంగ = మద్దెలలు; శంఖ = శంఖములు; తూర్య = యుద్ధ వాద్యముల; ఘోషంబులను = ధ్వనులు; బ్రహ్మాండ = బ్రహ్మాండము అనెడి; కోటరంబు = తొఱ్ఱ; పరిస్పోటితంబు = బద్దలైనది; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;

భావము:

పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.