పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బాణాసురునితో యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-401-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి సమర సన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మ వర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్త్రాణ కిరీట కోటిఘటిత వినూత్న రత్నప్రభాపటలంబులును, గనకకుండల గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధభూషణవ్రాత రుచి నిచయంబులును, బ్రచండబాహుదండ సహస్రంబున వెలుంగుచు శర శరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర భిందిపాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచలశృంగ సముత్తుంగం బగు రథంబెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికివెడలె; నయ్యవసరంబున.

టీకా:

అట్టి = అలాంటి; సమర = యుద్ధ; సన్నాహంబున్ = ప్రయత్నమున; కున్ = కు; కట్టాయితంబు = సిద్ధపడినది; ఐ = అయ్యి; మణి = రత్నాలు; ఖచిత = పొదగబడిన; భర్మ = బంగారు; వర్మ = కవచముల; నిర్మల = స్వచ్ఛమైన; అంశు = కిరణముల; జాలంబులును = సమూహములు; శిరస్ త్రాణ = తలపాగాల; కిరీట = కిరీటముల; కోటి = సమూహము లందు; ఘటిత = కూర్చబడిన; వినూత్న = సరికొత్త; రత్న = రత్నముల యొక్క; ప్రభా = కాంతుల; పటలంబులును = సమూహములు; కనక = బంగారపు; కుండల = చెవికుండలములు; గ్రైవేయ = కంఠాభరణములు; హార = దండలు; కంకణ = చేతి కంకణములు; తులాకోటి = కాలి అందెలు; వివిధ = అనేకరకములైన; భూషణ = అలంకారముల; వ్రాత = సమూహముల; రుచి = కాంతుల; నిచయంబులును = సమూహములు; ప్రచండ = మిక్కిలి చురుకైన; బాహు = చేతులు అను; దండ = కఱ్ఱల; సహస్రంబును = వెయ్యితో; వెలుంగుచు = ప్రకాశించుచు; శర = అమ్ములు; శరాసన = విల్లులు; శక్తి = శక్తి అను ఆయుధములు {శక్తి - పలుచేతులు వంటి ప్రక్క యలుగులును నిడుపాటి మొనయును కలిగిన ఆయుధ విశేషము, ఇంకోలా గంటలు కట్టిన ఒక లాంటి బాణము, ఇంకోలా చర్నాకోల}; ప్రాస = బల్లెములు; తోమర = చర్నాకోలలు, సర్వలలు; గదా = గదలు; కుంత = ఈటెలు; ముసల = రోకళ్ళు; ముద్గర = ఇనుప గుదియలు; భిందిపాల = విడిచివాటు గుదియలు; కరవాల = కత్తులు; పట్టిస = అడ్డకత్తి; శూల = శూలము; క్షురికా = చురకత్తి; పరశు = గొడ్డలి; పరిఘ = ఇనపకట్ల గుదియ; ఆది = మున్నగు; నిశాత = మిక్కిలి వాడియైన; హేతి = ఆయుధముల; వ్రాత = సమూహముల; దీధితులును = కాంతులు; వియత్ = ఆకాశము నందు; చర = తిరుగుచున్నవారికి; కోటి = ఎల్లర; నేత్రంబుల్ = కళ్ళ; కున్ = కి; మిఱుమిట్లుగొలుపన్ = చీకట్లు కమ్ముచుండగా {మిఱుమిట్లు కొలుపు - మిక్కిలి అధికమైన కాంతిని చూచుటాదులచేత కన్నులందు చీకట్లు కమ్ముట}; కనకాచల = మేరుపర్వత; శృంగ = శిఖరములకు; సమ = సమనమైన; ఉత్తుంగంబు = ఎత్తైనవి; అగు = ఐన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; అరాతి = శత్రువుల యొక్క; వాహినీ = సేనల; సందోహంబున్ = సమూహముల; కున్ = కు; తుల్యంబు = సాటివచ్చునవి; ఐన = అయినట్టి; నిజ = తన యొక్క; సేనా = సైన్యముల; సమూహంబులు = సమూహములు; ఇరుగడలన్ = రెండువైపుల; నడవన్ = వస్తుండగా; బాణుండు = బాణుడు; అక్షీణ = తగ్గని, అధికమైన; ప్రతాపంబున్ = పరాక్రమము; దీపింపన్ = ప్రకాశించగా; వెడలెన్ = బయలుదేరెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.

భావము:

అంతటి భీకరంగా యుద్ధానికి సిద్ధపడిన బాణాసురుడు మేరుపర్వత శిఖరంవలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు; మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు; రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది; కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి; బాణ, కుంత, తోమర, ముసల, గదా, కరవాలం మున్నగు అనేక ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొల్పాయి; ఈవిధంగా ఆ రాక్షసేంద్రుడు శత్రుసైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్కులా నడవగా అమిత పరాక్రమంతో రణరంగానికి బయలుదేరాడు.