పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బాణాసురునితో యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-395-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచన పూతుండును, మహితదుర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయకలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంకీర్తనా నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు నవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; రథా = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; భూసుర = విప్రుల; ఆశీర్వచన = దీవెనలచే; పూతుండును = పవిత్రుండును; మహిత = పూజనీయమైన; దుర్వాంకుర = గఱికపోచలచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడును; లలిత = మనోజ్ఞమైన; పుణ్యాంగనా = పునిస్త్రీల యొక్క; కర = చేతులు అను; కిసలయ = చిగుళ్ళ అందు; కలిత = కలిగిన; శుభ = శుభసూచకములైన; అక్షత = అక్షంతలు; విన్యాస = ఉంచబడిన; భాసుర = ప్రకాశించుచున్న; మస్తకుండును = తల కలవాడు; మాగధ = స్తుతిపాఠకుల యొక్క; మంజుల = రమణీయమైన; గానా = పాటలచేత; అనుమోదితుండును = సంతోషించినవాడు; వందిజన = బిరుదు లుగ్గడించువారి; సంకీర్తనా = పొగడ్తలచేత; ఆనందితుండును = సంతోషించినవాడు; పాఠక = వేదపాఠకుని; పఠన = చదివెడి; రవ = నాదములచేత; వికాసిత = తేటబారిన; హృదయుండును = మనస్సు కలవాడు; అయి = అయ్యి; వెడలు = బయలుదేరెడి; అవసరంబునన్ = సమయము నందు;

భావము:

అలా రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొందాడు; పుణ్యాంగనలు తలమీద శుభాక్షతలు చల్లారు; వందిమాగధులు కైవారాలు చేసారు; స్తోత్ర పాఠకులు స్తుతించారు ఈవిధంగా ముకుందుడు ఆనందంగా ముందుకు సాగాడు; అప్పుడు....