పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బాణాసురునితో యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-393-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మల మణివినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదువృష్టిభోజాంధక వీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుంజేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధు వృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షుని చేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ; దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి; తానును గట్టాయితంబయ్యె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; చనుదెందిన = వచ్చినట్టి; ఆ = ఆ; దివ్య = దేవతా; ముని = ఋషి; కిన్ = కి; నిర్మల = స్వచ్ఛమైన; మణి = రత్నాలచే; వినిర్మిత = బాగా చక్కగా తయారుచేసిన; సుధర్మ = సుధర్మసభ {సుధర్మసభ - ఇంద్రుడు కృష్ణునికి గోవర్ధనగిరి ధరించిన పిమ్మట బహూకరించిన దేవ సభ}; అభ్యంతరమునన్ = లోపల; యదు = యాదవ; వృష్ణి = వృష్ణిక; భోజ = భోజ; అంధక = అంధక; వీరులున్ = యోధులు; కొలువన్ = సేవించుచుండగా; కొలువున్న = కొలువుతీరి ఉన్నట్టి; కమలలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ప్రత్యుత్థానంబు = ఎదురేగుట; చేసి = చేసి; అర్ఘ్య = పూజకు తగినది ఇచ్చుట {అర్ఘ్యము – పూజ కొఱకైనది, అష్టార్ఘ్యములు - 1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భలు 8పుష్పము అను పూజకొరకైనది}; పాద్య = కాళ్ళకై జలాదిక మిచ్చుట; ఆది = మొదలగు; విధులన్ = మర్యాదలచేత; పూజించి = గౌరవించి; సముచిత = తగినట్టి; కనక = బంగారు; ఆసన = పీఠముపై; ఆసీనున్ = కూర్చున్నవానిగా; చేసినన్ = చేయగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; తాపస = మునులలో; ఉత్తముండు = గొప్పవాడు; పురుషోత్తమునున్ = కృష్ణుని; ఉదాత్త = ఉన్నతమైన; తేజస్ = తేజస్సునకు; నిధిన్ = ఉనికిపట్టైనవానిని; పొగిడి = స్తుతించి; అనిరుద్ధు = అనిరుద్ధుని; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = అంతటిని; తేటపడన్ = విశద మగునట్లు; ఎఱింగించి = తెలిపి; ఆ = ఆ; పుండరీకాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; చేత = వలన; ఆమత్రణంబు = అనుమతి; పడసి = పొంది; అంతర్దానంబున్ = అదృశ్యము అగుట; ఒందెన్ = పొందెను; తదనంతరంబ = అటుపిమ్మట; కృష్ణుండు = కృష్ణుడు; శుభ = మంచి; ముహూర్తంబునన్ = ముహూర్తము నందు; దండయాత్ర = యుద్ధమునకై తరలెడి; అభిముఖుండు = సిద్ధ మగువాడు; ఐ = అయ్యి; ప్రయాణ = ప్రయాణమును తెలుపు; భేరి = పెద్దనగారా; వ్రేయించి = వాయింపించి; బలంబులన్ = సైన్యమును; వెడలింపన్ = బయలుదేరుటకు; బ్రద్దలవారిన్ = బెత్తాలు పట్టుకొను వారిని; పనిచినన్ = ఆఙ్ఞాపించగా; తానునున్ = అతను కూడ; కట్టాయితంబు = సిద్ధమగుట; అయ్యెను = చేసెను; అంత = పిమ్మట.

భావము:

అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మసభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేసాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహుర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి, తాను చతురంగబలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.