పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట

  •  
  •  
  •  

10.2-379-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలుముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయు సింగంబు విధంబున లంఘించుచు, భీకర కరవాలంబు గేలందాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని.

టీకా:

అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; దానవేంద్రుడు = బాణాసురుడు; రోష = కోపముచేత; భీషణ = భయంకరమైన; ఆకారుండు = ఆకారము కలవాడు; ఐ = అయ్యి; కటములు = చెక్కిళ్ళు; అదరన్ = అదురుతుండగా; బొమలు = కనుబొమలు; ముడివడన్ = ముడిపడగా; కను = కళ్ళు; గవలన్ = రెంటినుండి; అనల = నిప్పు; కణములు = రవ్వలు; ఉప్పతిల్లన్ = పుట్టగా; సటలు = జూలు వెంట్రుకలను; పెఱికినన్ = పీకగా; చటుల = భయంకరమైన; గతిన్ = విధముగా; ఎగయు = ఎగిరెడి; సింగంబున్ = సింహము; విధంబునన్ = వలె; లంఘించుచున్ = దాటుతూ; భీకర = భయంకరమైన; కరవాలంబున్ = కత్తిని; కేలన్ = చేతిలో; తాల్చి = ధరించి; సమ = మిక్కిలి; ఉద్దండ = అధికమైన; గతిన్ = వేగముతో; కన్యా = ఉషాకన్య యొక్క; సౌధ = మేడ; అంతరంబున్ = లోపలికి; చని = వెళ్ళి;

భావము:

రోషభీషణాకారుడైన ఆ బాణ రాక్షసేంద్రుడి చెక్కిళ్ళు అదిరాయి; కనుబొమలు ముడిపడ్డాయి; కళ్ళవెంట నిప్పులు రాలాయి; జూలుపట్టి లాగగా విజృంభించిన సింహంలాగ ముందుకు లంఘించి, భయంకరమైన కరవాలాన్ని ధరించి ఆగ్రహావేశాలతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్ళాడు.