పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట

  •  
  •  
  •  

10.2-373-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంత ర్నిమగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; అతి = మిక్కిలి; మనోహర = అందమైన; విభవ = వైభవములచేత; అభిరామంబులు = చక్కటివి; అగు = ఐన; దివ్య = గొప్ప; అంబరా = వస్త్రములు; ఆభరణ = అలంకారములు; మాల్య = పూలమాలలు; అనులేపనంబులును = మైపూతలు; కర్పూర = పచ్చకర్పూరము వేసిన; తాంబూలంబులున్ = కిళ్ళీలు, తాంబూలములు; వివిధ = బహువిధమైన; అన్న = అన్నములు; పానంబులనున్ = పానీయములుచేత; సు = మిక్కిలి; రుచిర = కాంతివంతమైన; మణి = రత్నాల; దీప = దీపములచేత; నీరాజనంబులన్ = హారతులచేత; సుగంధ = మంచిగంధము; బంధుర = మేలైన; అగరుధూపంబులను = ఆగరుధూపములచేత; ఆట = నృత్యములు; పాటలన్ = పాటలచేత; వీణా = వీణావాయిద్యముల; వినోదంబులన్ = వేడుకలచేత; పరితుష్టిన్ = సంతృప్తిని; పొంది = పొంది; కన్యా = ఉషాకన్య; కుమారకులు = అనిరుద్ధకుమారుడు; ఆనంద = సంతోషము అను; సాగర = సముద్రము; అంతర్ = లోపల; నిమగ్న = మునిగిన; మానసులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఉదయ = సూర్యోదయము; అస్తమయ = సూర్యాస్తమయములను; నిరూపణంబు = నిర్ణయించుకొనుట; చేయనేరక = చేయలేక; ప్రాణంబులు = ప్రాణములు; ఒక్కటి = ఒకటిగా కలసినవి; ఐన = అయినట్టి; తలంపులన్ = భావములతో; కదిసి = కూడి; ఇష్ట = ఇచ్చవచ్చిన; ఉపభోగంబులన్ = సుఖానుభవములచేత; సుఖియించుచున్ = అనుభవిస్తూ; ఉండిరి = ఉన్నారు; అంత = అటుపిమ్మట.

భావము:

ఆ విధంగా అత్యంత మనోహరములు వైభవోపేతములు అయిన వస్త్రాభరణాలు, పూలదండలు, మైపూతలు, కర్పూరతాంబూలాలు, రకరకాల అన్నపానాలు, ఆటపాటలు, వీణావినోదములు, అగరధూపాలు, మణిదీపాలు మొదలైన సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనందసాగరంలో మునిగితేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో సుఖించారు.