పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బాణున కీశ్వర ప్రసాద లబ్ధి

  •  
  •  
  •  

10.2-318-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబుల తోడ బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ; బదంపడి యొక్కనాఁడ బ్బలినందనుండు.

టీకా:

అని = అని; అభ్యర్థించినన్ = కోరగా; ప్రసన్నుండు = అనుగ్రహము కలవాడు; ఐ = అయ్యి; భక్త = భక్తుల; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; పురాంతకుండు = శివుడు {పురాంతకుడు - పురములను నాశముచేసిన వాడు, శివుడు}; గౌరీ = పార్వతీదేవితో {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; తారకాంతక = కుమారస్వామి; గజానన = వినాయకుడు; ఆది = మున్నగువారు; భూత = ప్రమథుల; గణంబుల్ = సమూహము; తోడన్ = తోటి; బాణ = బాణుని; నివాసంబు = ఉండు ప్రదేశము; అగు = ఐన; శోణపురంబున్ = శోణపురమును {శోణపురము - బాణుని పట్టణము}; వాకిటన్ = కోటగుమ్మం వద్ద; కాపుండెన్ = కాపలా ఉండెను; పదంపడి = అటుపిమ్మట; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; ఆ = ఆ; బలినందనుండు = బాణాసురుని {బలి నందనుడు - బలిచక్రవర్తి యొక్క కొడుకు, బాణుడు}.

భావము:

బాణాసురుడు ఇలా ప్రార్థంచగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుడి పట్టణం శోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసిన శంకరుడు కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. అటుపిమ్మట, ఒకసారి ఆ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు....