పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-300-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్న మానసులైరి; కుటిలస్వభావులయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిందన్ను నెఱుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని "యిప్పటి యాటయు నేన గెల్చియుండ వృథాజల్పకల్పనుండ వయి ‘గెల్చితి’ నని పల్కెద; వక్షవిద్యా నైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే" యని క్రొవ్వున నవ్వుచుం బలికిన, నప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపితమానసుండై పెటపెటం బండ్లుగొఱకుచుం గన్నులనిప్పు లుప్పతిల్లం గినుకం దోఁకత్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితంబయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండ బాహుదండంబులు సాఁచి పరిఘం బందుకొని పరిపంథి యైన రుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె; నయ్యవసరంబున.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; సకల = ఎల్ల; జనంబులున్ = వారును; అద్భుత = ఆశ్చర్యము నందు; ఆనంద = ఆనందము నందు; నిమగ్న = మునిగిన; మానసులు = మనస్సులు కలవారు; ఐరి = అయ్యారు; కుటిల = కపట; స్వభావులు = స్వభావము కలవారు; అయిన = ఐన; భూవరులున్ = రాజులు; రుక్మిన్ = రుక్మిని; కైకొల్పినన్ = పక్షము వహించగా; అతండు = అతను; తన = అతని యొక్క; తొల్లింటి = మునుపటి; పరాభవమున్ = అవమానమును; తలచి = గుర్తుపెట్టుకొని; ఎదిరిని = ఎదుటివాని శక్తిని; తన్నున్ = తన శక్తిని; ఎఱుంగక = తెలిసికొనలేక; బల = బలములు; అబల = బలహీనతల; వివేకంబున్ = విమర్శనములు; చేయనేరక = చేయలేక; విధివశ = దైవనిర్ణయమును; అనుగతుండు = అనుసరించువాడు; ఐ = అయ్యి; చలంబునన్ = పట్టుదలతో; బలునిన్ = బలరాముని; కని = చూసి; ఇప్పటి = ఇప్పటి; ఆటయున్ = ఆటకూడ; నేన = నేనే; గెల్చి = జయించి; ఉండన్ = ఉండగా; వృథా = అనవసరపు; జల్ప = పొసగని మాటలు; కల్పనుండవు = కల్పించువాడవు; అయ = అయ్యి; గెల్చితిని = జయించాను; అని = అని; పల్కెదు = అంటున్నావు; అక్షవిద్యా = ద్యూత మాడు విద్య యందు; నైపుణ్యంబు = మిక్కిలి నేర్పు; కల = కలిగిన; భూపకుమారుల = రాకుమారుల; తోన్ = తోటి; పసులకాపరులు = గొల్లలు; ఎత్తువత్తురే = సాటిరాగలరా, లేరు; అని = అని; కొవ్వునన్ = మదముతో; నవ్వుచున్ = నవ్వుతు; పలికినన్ = అనగా; ఆ = ఆ; పలుకులు = మాటలు; చెవులు = చెవుల; కున్ = కు; ములుకుల = బాణముకొనల; క్రియన్ = వలె; తాకినన్ = సోకగా; కోప = కోపముచేత; ఉద్దీపిత = ఉద్రేకించిన; మానసుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; పెటపెటన్ = పెటపెట మను ధ్వని కలుగ {పెటపెట - పళ్ళు కొరుకుట యందలి ధన్వనుకరణ}; పండ్లు = దంతములు; కొఱుకుచున్ = కొరుకుతు; కన్నులన్ = కళ్ళమ్మట; నిప్పుల = నిప్పులు; ఉప్పతిల్లన్ = ఉబుకుచుండగా; కినుకన్ = కోపముతో; తోక = తోకను; తొక్కిన = కాలితో తొక్కబడిన; మహా = గొప్ప; ఉరగంబున్ = పాము; ఓజన్ = వలె; రోజుచున్ = రొప్పుతు, బుసకొడుతు; దండ = కఱ్ఱతో; తాడితంబు = కొట్టబడినది; అయిన = ఐన; పుండరీకంబు = పెద్దపులి; లీలన్ = వలె; హుమ్ము = హుం; అని = అని; మ్రోయుచున్ = గాండ్రించుచున్; ప్రచండ = మిక్కిలి భయంకరమైన; బాహు = చేతులను; దండంబులున్ = కఱ్ఱలను; చాచి = చాపి; పరిఘంబున్ = దుడ్డుకఱ్ఱను, గుదియను; అందుకొని = తీసుకొని; పరిపంథి = శత్రువు; ఐన = అయిన; రుక్మినిన్ = రుక్మిని; అతని = అతని; కిన్ = కి; అనుకూలంబు = అనుకూలురు; ఐన = అయిన; రాజ = రాజుల; లోకంబును = సమూహమును; పడలుపడన్ = కుప్పకూలునట్లు; అడిచెన్ = కొట్టెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు;

భావము:

ఆ మాటలువిని అక్కడి జనులంతా ఆనందించారు. కానీ కొందరు దుష్ట రాజులు ప్రేరేపించగా, రుక్మి పూర్వం జరిగిన పరాభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని, బలాబలాలు తెలుసుకోలేక, విధివశాన బలరాముడిని చూసి పట్టుదలగా ఇలా అన్నాడు “ఈ ఆట గూడా నేనే గెల్చాను. వ్యర్థ ప్రలాపాలతో నేనే గెల్చానని చెప్పుకుంటున్నావు. జూదంలో ప్రావీణ్యం కల రాజకుమారులతో పశుల కాపరులు జూదమాడి గెలవగలరా?” అని అహంకారంతో నవ్వుతూ అవహేళన చేసాడు. ఈ పలుకులు బలరాముడి చెవులకు ములుకులుగా తగిలాయి. దానితో ఆయన కోపంగా పండ్లు పటపటా కొరుకుతూ, తోకత్రొక్కిన త్రాచులాగా బుసలుకొడుతూ, కఱ్ఱదెబ్బ తగిలిన పెద్దపులివలె గాండ్రించి, ఒక ఇనుపగుదియను తన చేతిలోకి తీసుకుని రుక్మినీ అతని పక్షం వారయిన రాజలు అందరినీ చావచితకబాదాడు.