పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-299-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం
జొప్పఁడ గెల్చి "యీ గెలుపు సూడగ నాదియొ వానిదో జనుల్‌
ప్పక చెప్పుఁ" డన్న విదిధ్వనితో నశరీరవాణి తా
నిప్పటియాట రాముఁడె జయించె విదర్భుఁడె యోడె నావుడున్.

టీకా:

అప్పటి = ఎప్పటి; అట్ల = లాగానే; ఒడ్డి = పందెము కాసి; ముసలాయుధుడు = బలరాముడు {ముసలాయుధుడు - ముసలము (రోకలి) ఆయుధముగా కలవాడు, బలరాముడు}; ఏపునన్ = విజృంభణముతో; ఆడి = ఆడి; జూదమున్ = ద్యూతకేళి యందు; చొప్పడన్ = తగినట్లుగా; గెల్చి = గెలిచి; ఈ = ఈ; గెలుపు = జయము; చూడగన్ = విచారించి చూసినను; నాదియొ = నాదో; వానిదో = అతనిదో; జనుల్ = జనములార; తప్పక = న్యాయముగ; చెప్పుడు = చెప్పండి; అన్నన్ = అనగా; విదిత = స్పష్టమైన; ధ్వని = ధ్వని; తోన్ = తోటి; అశరీరవాణి = ఆకాశవాణి; తాను = ఇతనే; ఇప్పటి = ఇప్పటి; ఆటన్ = ఆటను; రాముడె = రాముడే; జయించెన్ = గెలిచెను; విదర్భుడె = రుక్మి; ఓడెన్ = ఓడిపోయెను; నావుడున్ = అనగా.

భావము:

బలరాముడు మళ్ళీ మరో ఆట ఆడి గెలిచాడు. “ఇప్పటి విజయం నాదా లేక ఇతనిదా చెప్పండి” అని అక్కడి వారిని మరల ప్రశ్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి “ఈ ఆటలో బలరాముడే గెల్చాడు. విదర్భరాజు రుక్మి ఓడిపోయాడు” అని స్పష్టంగా తెలిపింది