పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-296-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిన యాట లెల్లను హలాయుధుఁ డోడిన రుక్మి గెల్చుడున్
దోడి నృపాల కోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం
"డోడె బలుం" డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా
నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్.

టీకా:

ఆడిన = ఆడినట్టి; ఆటలు = ఆటలు; ఎల్లనున్ = అన్నిటిని; హలాయుధుడు = బలరాముడు; ఓడినన్ = ఓడిపోగా {హలాయుధుడు - నాగలి ఆయుధము ధరించినవాడు, బలరాముడు}; రుక్మి = రుక్మి; గెల్చుడున్ = గెలుచుటతో; తోడి = తోటి; నృపాల = రాజుల; కోటి = సమూహము; పరితోషము = సంతోషము; చెందన్ = పొందగా; కళింగ = కళింగదేశపు; భూవిభుండు = రాజు; ఓడెన్ = ఓడిపోయెను; బలుండు = బలరాముడు; అటంచున్ = అనుచు; ప్రహస = ఎగతాళి; ఉక్తులన్ = మాటలతో; ఎంతయున్ = మిక్కిలి; రామున్ = బలరాముని; చుల్కగాన్ = చులకనగా, అలక్ష్యముగా; ఆడెను = పలికెను; దంత = నోటిలోని పల్లు; పంక్తి = వరుస; వెలి = బయటపడునవి; ఐ = అయ్యి; కనుపట్టగన్ = కనిపించునట్లుగా; చాల = ఎక్కువగా; నవ్వుచున్ = నవ్వుతు.

భావము:

ఆడిన ప్రతీ ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి గెలిచాడు. అక్కడి రాజు లందరికీ సంతోషం కలిగేలా, కళింగరాజు “బలరాముడు ఓడిపోయా” డని ఎగతాళి చేస్తూ పండ్లు బయటపడేలా ఇకిలించాడు.