పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణ కుమా రోత్పత్తి

 •  
 •  
 •  

10.2-275-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహార పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును.
^ శ్రీకృష్ణుని సంతానం.

టీకా:

మఱియున్ = ఇంకను; అనేక = నానా; విధ = విధముల; విచిత్ర = అద్భుతమైన, చిత్రించిన; మణి = రత్నాల; వితాన = సమూహములచేత; అభిశోభిత = ప్రకాశిస్తున్నట్టి; ప్రాసాద = మేడల; ఉపరి = మీది; భాగంబులను = ప్రదేశము లందు; లాలిత = మనోజ్ఞములైన; నీలకంఠ = నెమళ్ళ; కలకంఠ = కోయిలలల; కలవింక = ఊర పిచ్చుకల; శుక = చిలుకల; కలాప = సమూహములుతో; కలిత = కూడుకొన్న; తీరంబులన్ = చెరువుల గట్ల పైన; మకరంద = పూదేనెలను; పాన = తాగుటచేత; మద = మదించిన, బలిసిన; ఇందిందిర = తుమ్మెదల; ఝంకార = ఝుమ్మనెడు; సంకుల = సందడి కల; కమల = తామరల చేత; కహ్లార = ఎఱ్ఱ కలువల చేత; సుధాసార = అమృత వర్షమును పోలిన; నీహార = మంచుబిందువులతో; పూరిత = నిండిన; కాసారంబులును = సరస్సులవద్ద; ధాతు = ఎఱ్ఱ మణిసిలమీది {ధాతువు - ఒక రకమైన మణిసిల (కొండ మీది ఒక రకమైన ఎఱ్ఱమన్ను}; నిర్ఝర = సెలయేళ్ళచేత; రంజిత = ఎఱ్ఱనైన; సానుదేశ = చరియలు కల; గిరి = కొండల యొక్క; కుంజ = పొదరిళ్ళ; పుంజంబులను = సమూహము లందు; కృతక = క్రీడా, కృత్రిమమైన {కృతకము - స్వతసిద్ధం కాక మానవులచే చేయబడినది, కృత్రిమమైనది}; శైలంబులనున్ = గిరు లందు; క్రీడా = కేళికా; గృహంబులనున్ = గృహము లందు; చెలంగి = చెలరేగి; నందనందనుండు = కృష్ణుడు {నంద నందనుడు - నందుని కొడుకు, కృష్ణుడు}; విదర్భరాజనందనన్ = రుక్మిణిని; తగిలి = మోహించి; కందర్ప = మన్మథ; కేళీ = క్రీడా; లోలాత్ముండు = ఆసక్తి కలవాడు; అయ్యెన్ = అయ్యెను; అనంతరంబు = తరువాత; ఆ = ఆ; సుందరీ = అందగత్తెలలో; లలామంబు = ఉత్తమురాలు; వలన = వలన; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; చారుధేష్ణుండు = చారుధేష్ణుడు; చారుదేవుండు = చారుదేవుడు; సుధేష్ణుండు = సుధేష్ణుడు; సుచారువు = సుచారువు; చారుగుప్తుండు = చారుగుప్తుడు; భద్రచారువు = భద్రచారువు; చారుభద్రుండు = చారుభద్రుడు; విచారువు = విచారువు; చారువున్ = చారువు; అనియెడు = అను; పదుగురు = పదిమంది (10); తనయులన్ = పుత్రులను; పడసెన్ = పొందెను; అట్లు = అలాగే; సత్యభామా = సత్యభామ; జాంబవతీ = జాంబవతి; నాగ్నజితీ = నాగ్నజితి; కాళిందీ = కాళింది; మాద్రి = మాద్రి; మిత్రవిందా = మిత్రవింద; భద్రల్ = భద్రల; కున్ = కు; వేఱువేఱ = విడివిడిగా; పదుగురేసి = పదిమంది (10) చొప్పున; భద్ర = అందమైన; మూర్తులు = రూపములు కలవారు; ఐన = అయిన; కుమారులున్ = పుత్రులు; ఉదయించిరి = పుట్టిరి; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మఱియును = ఇంకను.

భావము:

నానావిధములైన విచిత్రమణులతో శోభించే చాందినీలతో విలసిల్లె ప్రాసాదాలలోనూ; పెంపుడు నెమళ్ళతో, కోకిలలతో, పిచ్చుకలతో, చిలుకల పలుకులతో నిండినది; మకరందపానము చేసి మదించిన తుమ్మెదల ఝంకారములు నిండిన తెల్లని పద్మాలు, చల్లని మధుర జలాలతో కూడిన కమనీయ సరోవరతీరాలలో; ఖనిజాలపై ప్రవహించే జలప్రవాహాలతో ఎఱ్ఱనైన కొండచరియల పొదరిండ్లలో; లీలాపర్వతాలలో; క్రీడాగృహాలలో ఆ నందుని కుమారుడు శ్రీకృష్ణుడు, విదర్భరాకుమారి రుక్మిణీదేవితో కలిసి మన్మథవిలాసాలలో మునిగితేలాడు. అంతట, రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది చొప్పున అందమైన కుమారులు ఉదయించారు.

10.2-276-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
న్నెయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
ర్ధమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.

టీకా:

అనఘ = పుణ్యా, పరీక్షిన్మహారాజా; పదాఱువేల = పదహారువేల (16000); సతులు = భార్యలు; అందున్ = అందు; జనించిరి = పుట్టిరి; వేఱువేఱ = విడివిడిగా; నందన = పుత్రుల; దశకంబున్ = పదేసిమంది; తత్ = ఆ; సుత = కొడుకుల; వితానమున్ = సమూహము; కాంచిరి = పొందిరి; అనేత = పెక్కుమంది; సూనులన్ = కుమారులను; ఎనయంగన్ = పొందికగా; ఇట్లు = ఈ విధముగ; పిల్లచెఱుకు = చెరుకునకు పిలకలు; ఈనిన = పుట్టిన; కైవడిన్ = విధముగా; పుత్ర = కొడుకులు; పౌత్ర = మనుమలు; వర్ధనమునన్ = వృద్ధిచెందుటచేత; ఒప్పెన్ = ఒప్పి యుండెను; ముదంబునన్ = సంతోషముతో; తామరతంపర = తామరతీగ లల్లకొన్నట్లు; భువిన్ = భూలోకము నందు.

భావము:

శ్రీకృష్ణుడికి పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది వంతున పుత్రులు ఉద్భవించారు ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు.

10.2-277-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ
నామధేయాంతరముల నెన్నంగ నూట
యొక్కటై చాల వర్ధిల్లె క్కులంబు
నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.

టీకా:

అట్లు = అలా; యదు = యాదవులు; వృష్ణి = వృష్ణులు; భోజ = భోజులు; అంధక = అంధకులు; ఆది = మొదలగు; వివిధ = నానా విధమైన; నామధేయా = పేర్ల; అంతరములన్ = తేడాలతో; ఎన్నంగన్ = లెక్కకు; నూటయొక్కటి = నూటొకటి (101); ఐ = అయ్యి; చాలన్ = మిక్కిలి; వర్ధిల్లెన్ = వృద్ధినొందెను; ఆ = ఆ; కులంబు = వంశము; నృపకుమారులన్ = రాకుమారులను; చదివించు = చదివించెడి; నేర్పు = సామర్థ్యము; కలుగు = ఉన్నట్టి.

భావము:

ఈవిధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే....

10.2-278-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద
నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు
న్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె
శూలికైనను దామరచూలికైన?

టీకా:

గురు = ఉపాధ్యాయులైన; జనంబులు = వారు; విను = వినుము; మూడుకోట్లమీద నెనుబదెనిమిదివేల పైనెసగన్నూర్వురు = మూడుకోట్ల ఎనభైఎనిమిదివేల వందమంది (300,88,100); అన్నన్ = అంటే; తత్ = ఆ; బాలకా = పిల్లల; ఆవలి = సమూహమును; ఎన్నన్ = లెక్కించ; తరమె = శక్యమేనా, కాదు; శూలి = శివునికైనా {శూలి - శూలాయుదము కలవాడు, శివుడు}; తామరచూలి = బ్రహ్మదేవుని {తామరచూలి - పద్మసంభవుడు, బ్రహ్మ}; కైన = కి అయినను.

భావము:

గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.

10.2-279-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అందు గోవిందనందనుండయిన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతు వలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె.
^ ప్రద్యుమ్న అనిరుద్ధులు

టీకా:

అందున్ = వారిలో; గోవింద = కృష్ణుని; నందనుండు = కొడుకు; అయిన = అగు; ప్రద్యుమ్నున్ = ప్రద్యుమ్నుడి; కున్ = కి; రుక్మి = రుక్మి యొక్క {రుక్మి - రుక్మిణి వివాహసమయమున అవమానం చెందిన ఆమె అన్న}; కూతున్ = కూతురు; వలనన్ = అందు; అనిరుద్ధుండు = అనిరుద్ధుడు; సంభవించెను = పుట్టెను; అనినన్ = అని చెప్పగా; ముని = మునులలో; వరున్ = ఉత్తముని; కున్ = కి; భూవరుండు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

వారిలో గోవిందుని కుమారుడు ప్రద్యుమ్నుడికి రుక్మి కుమార్తె రుక్మవతి వలన అనిరుద్ధుడు ఉద్భవించాడు.” అని చెప్పగా రాజేంద్రుడు మునీంద్రునితో ఇలా అన్నాడు.

10.2-280-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

“బరమునఁ గృష్ణుచే ము
న్నమానము నొంది రుక్మి చ్యుతు గెలువం
దివురుచుఁ దన సుత నరిసం
వునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ లుకు మునీంద్రా!”

టీకా:

బవరమున = యుద్ధము నందు; కృష్ణు = కృష్ణుని; చేన్ = చేత; మున్ను = మునుపు; అవమానము = అవమానము; ఒంది = పొంది; రుక్మి = రుక్మి; అచ్యుతున్ = కృష్ణుని; గెలువన్ = జయింపవలె నని; తివురుచున్ = ప్రయత్నించుచు; తన = తన యొక్క; సుతన్ = కూతురును; అరి = శత్రువుకు; సంభవున్ = పుట్టినవాని; కున్ = కి; ఎట్లు = ఎలా; ఇచ్చెన్ = ఇచ్చెను; ఎఱుగన్ = తెలియ; పలుకు = చెప్పుము; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

“ఓ శుకయోగీంద్రా! యుద్ధంలో శ్రీకృష్ణుడిచేత అవమానం పొందిన రుక్మి, ఎలాగైనా శ్రీకృష్ణుడి మీద పగతీర్చుకోవాలని చూస్తున్నాడు కదా. అటువంటివాడు, తన శత్రువు కుమారుడికి తన కూతురును ఇచ్చి ఎలా వివాహం చేసాడు. ఈ సంగతి నాకు తెలియ చేయండి.”