పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణీదేవి నూరడించుట

  •  
  •  
  •  

10.2-263-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం
లఁగఁగ నేల? వేఁటలను య్యములన్ రతులందు నొవ్వఁగాఁ
లికినమాట లెగ్గు లని ట్టుదురే? భవదీయ చిత్తముం
దెలియఁగఁ గోరి యేఁ బలికితిన్ మదిలో నిటు గుంద నేఁటికిన్?

టీకా:

అలికులవేణి = రుక్మిణీదేవి {అలి కుల వేణి - తుమ్మెదల బారు వంటి జడ కలామె, స్త్రీ}; నవ్వుల = వేడుక, వేళాకోళమున; కున్ = కు; ఆడిన = పలికిన; మాటల = మాటల; కున్ = కు; ఇంత = ఇంత ఎక్కువగా; నీ = నీ యొక్క; మదిన్ = మనస్సు నందు; కలగన్ = కలత చెందుట; ఏల = ఎందుకు; వేటలన్ = వేటాడు నప్పుడు; కయ్యములన్ = పోరు లందు; రతులన్ = రతిక్రీడ యందు; నొవ్వగాన్ = నొచ్చునట్లుగా; పలికిన = అనెడి; మాటలు = మాటలు; ఎగ్గులు = దూషణములు; అని = అని; పట్టుదురే = గ్రహింతురా, గ్రహించరు; భవదీయ = నీ యొక్క; చిత్తమున్ = మనస్సును; తెలియగన్ = తెలిసికొనుట; కోరి = అపేక్షించి; యేన్ = నేను; పలికితిన్ = అంటిని; మది = మనస్సు; లోన్ = అందు; కుందన్ = దుఃఖించుట; ఏటికిన్ = ఎందుకు.

భావము:

“తుమ్మెదల బారు వంటి శిరోజాలు గల సుందరీ! రుక్మిణీ! నేను నవ్వులాటకు అన్న మాటలకు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. వేట, రణరంగం, రతి సమయాలలో, సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు. నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను. ఈ పాటిదానికి నీవు బాధచెంద వద్దు.