పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణిదేవి స్తుతించుట

  •  
  •  
  •  

10.2-249-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి; భవత్పాదారవింద మకరందరసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా; దట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమిసెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు; దేవా! నీవకించనుఁడవైతేని బలిభోక్తలయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్ను లైన వారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు; రదియునుంగాక.

టీకా:

శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శము; రూప = రూపము; రస = రసము; గంధంబులు = గంధములు; అనియెడు = అనెడి; గుణంబుల = పంచభూతగుణముల; చేతన్ = చేత; పరిగ్రహింపబడిన = అంగీకరింపబడినట్టి; మంగళ = శుభప్రదమైన; సుందర = చక్కటి; విగ్రహుండవు = రూపము కలవాడవు; ఐ = అయ్యి; అఙ్ఞాన = అఙ్ఞానము అను; అంధకార = చీకటిని; నివారకంబు = తొలగించునది; ఐన = అయినట్టి; రూపంబున్ = ఙ్ఞానరూపమును; కైకొని = పరిగ్రహించి; భవదీయులు = నీవారు; ఐన = అయిన; సేవకులు = భక్తుల; కున్ = కు; అనుభావ్యుండవు = అనుభవింపబడు వాడవు {భగవదనుభవ ప్రకారములు - 1శ్రవణము 2మననము 3నిదిధ్యాసనము (మఱి మఱి తలచుట)}; ఐతి = అయినావు; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; మకరందరస = పూదేనెలను; ఆస్వాద = తాగుట యందు; లోల = సక్తమైన; ఆత్ములు = మనసు కలవారు; ఐన = అయిన; యోగ = యోగులలో; ఇంద్రుల = శ్రేష్ఠులు; కున్ = కు; ఐననున్ = అయినను; భవత్ = నీ యొక్క; మార్గంబు = పద్ధతి; స్ఫుటంబు = స్పష్టము; కాదు = కాదు; అట్లు = అలా; అగుటన్ = అగుట; చేసి = చేత; ఈ = ఈ సర్వ; మనుజ = మానవులు అను; పశువులు = జంతువుల; కున్ = కు; దుర్విభావ్యంబు = తెలిసికొన శక్యము కానిది; అగుటన్ = అగుటను; ఏమిచెప్పన్ = చెప్పేది ఏముంది; ఇట్టి = ఇటువంటి; ఈశ్వరుండవు = ప్రభువవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; ఇచ్ఛ = చిత్తము, అభీష్టము; స్వతంత్రము = సర్వస్వతంత్ర మైనవి; కావున = అయి ఉండుటచేత; అదియును = అదే; నా = నా; కున్ = కుకూడ; అభిమతంబున్ = సమ్మతమైనది; కావున = కాబట్టి; నిన్నున్ = నిన్ను; నేన్ = నేను; అనుసరింతున్ = అనసరించెదను; దేవా = భగవంతుడా; నీవు = నీవు; అకించనుడవు = ఏమీ లేనివాడవు; ఐతేని = అయినట్లైతే; బలిన్ = బలిగా సమర్పించిన వాటిని {బలి - కోరికలు తీర్చుటకు పెట్టునవి}; భోక్తలు = భుజించువారు; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవరి; కొఱకున్ = కోసము; బలిన్ = బలులను; సమర్పణంబు = పెట్టుట; చేసిరి = చేస్తారు; నీవు = నీవు; సమస్త = అఖిల; పురుషార్థ = చతుర్విధ పురుషార్థములు {చతుర్విధ పురుషార్థములు - 1ధర్మము 2అర్థము 3కామము 4మోక్షము}; మయుండవు = స్వరూపముగా గలవాడవు; అనియును = అని; ఫల = యోగయాగాదుల ఫలము; స్వరూపివి = స్వరూపమైన వాడవు; అనియును = అని; నీ = నీ; అందలి = ఎడల గల; ప్రేమా = నవవిధభక్తి {నవవిధభక్తి - 1శ్రవణము 2కీర్తనము 3స్మరణము 4పాదసేవనము 5అర్చనము 6వందనము 7దాస్యము 8సఖ్యము 9ఆత్మనివేదనము}; అతిశయంబులన్ = సంపన్నముల; చేసి = వలన; విఙ్ఞాన = విఙ్ఞానము అను; దీప = దీపము యొక్క; అంకురంబునన్ = మొలక చేత; నిరస్త = పోయిన; సమస్త = ఎల్ల; దోష = పాపములు అను; అంధకారులు = చీకట్లు కలవారు; ఐ = అయ్యి; ఇహ = ఈ లోకపు; సౌఖ్యంబులున్ = సుఖములు; విడిచి = వదలిపెట్టి; సుమతులు = మంచి బుద్ధి గలవారు; భవదీయ = నీ యొక్క; దాస = భక్తులతోడి; సంగంబున్ = సాంగత్యమును; కోరుచుందురు = కోరుకొనెదరు; అట్లు = ఆ విధముగ; చేయనేరక = చేయలేక; నిజ = తమ; అధికార = అధికారస్థానము అను; అంధకార = చీకట్లులో; మగ్నులు = అణగినవారు; ఐన = అయిన; వారు = వారు; భవత్ = నీ యొక్క; తత్వంబున = స్వరూపమును; తెలిసి = తెలిసికొని; బలిప్రక్షేపంబులున్ = బలులు ఇచ్చుటలు; చేయంజాలక = చేయలేక; మూఢులు = తెలివిమాలినవారు; ఐ = అయ్యి; సంసార = సంసారము అను; చక్రంబున్ = వలయము నందు; భ్రమింతురు = తిరుగుచుందురు; అదియునున్ = అంతే; కాక = కాకుండా.

భావము:

దేవా! శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే గుణాలచేత పరిగ్రహింబడిన మంగళాకారుడవు నీవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే రూపాన్ని పొంది నీభక్తులచే సేవింపబడుతున్నావు. నీ పాదపద్మ మకరందరసాన్ని ఆస్వాదించే యోగీంద్రులకు కూడా నీ మార్గం అంతుపట్టదు. ఇంక ఈ మానవ పశువులకు ఊహింపను కూడా రానిది కావడంలో ఆశ్చర్యము ఏముంది? ఇట్టి పరమేశ్వరుడైన నీవు స్వతంత్రుడవు. నిన్ను నేను అనుసరిస్తున్నాను. నీవు దరిద్రుడవైతే పూజాద్రవ్యాలను స్వీకరించే బ్రహ్మేంద్రాది దేవతలు పూజాద్రవ్యాలను ఎవరికి సమర్పిస్తున్నారు. నీవు సమస్త పురుషార్థ మయుడవనీ, ఫలస్వరూపివనీ భావించి నీ మీది ప్రేమచేత సమస్తదోషాలనే అంధకారాన్ని విజ్ఞాన మనే దీప కళికతో అణచివేసి, ఇహలోక సౌఖ్యాలను వదలివేసి, సత్పురుషులు నీ సన్నిధిని కోరుతున్నారు. అలా కాకుండా అధికార మనే అంధకారంలో మునిగి నీ తత్వం తెలుసుకోలేక, నిన్ను పూజించని వారు సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు.