పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణీదేవి విప్రలంభంబు

  •  
  •  
  •  

10.2-240-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్ష విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

టీకా:

ప్రణతామ్నాయుడు = కృష్ణుడు {ప్రణతామ్నాయుడు - నమస్కరించిన వేదములు కలవాడు, కృష్ణుడు}; కృష్ణుడు = కృష్ణుడు; అంతన్ = అంతట; కదిసెన్ = సమీపించెను; బాష్పా = కన్నీటిచే; అవరుద్ధ = ఆవరింపబడుటచేత; అరుణ = ఎఱ్ఱబారిన; ఈక్షణన్ = కన్నులు కలామెను; విస్రస్త = వీడిపడిన; వినూత్న = సరికొత్త; భూషణన్ = ఆభరణములు కలామెను; దురుక్త = చెడ్డమాటలు అను; క్రూర = భీకరమైన; నారాచ = బాణములచే; శోషణన్ = శోషిల్లి నామెను; ఆలంగితధారుణిన్ = నేలపై పడిపోయి నామెను {ఆలంగిత ధారుణి - ఆలింగనము చేసికొన్న నేల కలామె, నేలపై పడిపోయినామె}; నిజ = తన; కుల = వంశ; ఆచార = ఆచరము లందు; ఏకన్ = నిష్ఠ కలామెను; సత్ = మంచి; ధర్మ = ధర్మమున; చారిణిన్ = మెలగు నామె; విశ్లేషిణిన్ = విశ్లేషించు నేర్పరిని; వీత = పోయిన; తోషిణిన్ = సంతోషము కలామెను; పురంధ్రీ = ఇల్లాండ్రలో; గ్రామణిన్ = ఉత్తమురాలిని; రుక్మిణిన్ = రుక్మిణిని.

భావము:

వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు కన్నీటితో నిండి ఎఱ్ఱపడ్డ నేత్రాలతో చెదరిన భూషణాలతో ఆ కఠోరపు పలుకుల ములుకుల వలన కలిగిన అలజడితో నేలపై పడి పోయిన ఆ సద్వంశ సంభూతురాలూ, శోకసంతప్తురాలూ, సహధర్మచారిణి, సాధ్వీశిరోమణీ అయిన రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళాడు.