పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణీదేవి విప్రలంభంబు

  •  
  •  
  •  

10.2-235-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు-
చెలఁగి నన్ వీక్షించి యుచుండ
ది గాక రుక్మి నీ న్నయు గర్వించి-
వీర్యమదాంధుఁ డై వెలయుచున్న
వారి గర్వంబులు వారింపఁగాఁ గోరి-
చెలువ! నిన్నొడిచి తెచ్చితిమి; గాని
కాంతా తనూజార్థ కాముకులము గాము-
కామమోహాదులఁ గ్రందుకొనము;

10.2-235.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను; ముదాసీనులము; క్రియావిరహితులము
పూర్ణులము మేము; నిత్యాత్మబుద్ధితోడ
వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి;
వలతాతన్వి! మాతోడ వయ వలదు."

టీకా:

సాల్వ = సాల్వుడు; జరాసంధ = జరాసంధుడు; చైద్య = శిశుపాలుడు; ఆది = మున్నగు; రాజులు = రాజులు; చెలగినన్ = చెలరేగి; నన్ = నన్ను; వీక్షించి = చూసి; మలయుచుండన్ = ద్వేషించుచుండగా; అదిగాక = వీరేకాక, ఇంతేకాక; రుక్మి = రుక్మి; నీ = నీ యొక్క; అన్నయున్ = సోదరుడు; గర్వించి = మదించి; వీర్య = వీరత్వముచేత; మద = కొవ్వెక్కి; అంధుడు = కళ్ళుకనిపించనివాడు; ఐ = అయ్యి; వెలయుచున్న = ప్రకాశించుచుండగా; వారిన్ = వారి యొక్క; గర్వంబులున్ = అహంకారములను; వారింపగాన్ = అణచివేయవలెనని; కోరి = తలచి; చెలువ = సుందరి; నిన్నున్ = నిన్ను; ఒడిచి = పట్టుకొని; తెచ్చితిమి = తీసుకొని వచ్చాము; కాని = అంతే తప్పించి; కాంతా = స్త్రీల; తనూజ = సంతానము; అర్థ = ధనము లందు; కాముకులము = లాలస కలవారము; కాము = కాదు; కామమోహాదులన్ = అరిషడ్వర్గములచేత {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు అను ఆరు శత్రువుల వలె నాశము చేయునవి}; క్రందుకొనము = చిక్కుపడము; వినుము = వినుము; ఉదాసీనులము = దేనినంటక ఉండువారము; క్రియారహితులము = కర్మలంటనివారము; పూర్ణులము = అంతట నిండి యుండువారము; మేము = మేము; నిత్య = శాశ్వతమైన; ఆత్మ = ఆత్మలము అను; బుద్ధి = ఙ్ఞానము; తోడన్ = కలిగి; వెలుగుచుందుము = ప్రకాశించుచుందుము; గృహ = ఇంటిలోని; దీప = దీపము; విధమున్ = వలె; మెఱసి = కాంతివంతమై; నవలతాతన్వి = రుక్మిణీదేవి {నవలతాతన్వి - నవ (లేత) లత వంటి తన్వి (దేహము కలామె), అందమైన స్త్రీ}; మా = మా; తోడన్ = తోటి; నవయ = శ్రమపడ; వలదు = వద్దు.

భావము:

ఓ లతాంగీ! సాల్వభూపతి జరాసంధుడు, చేది రాజు శిశుపాలుడు మున్నగు రాజులు చెలరేగి ద్వేషంతో నా వెనుక పడుతున్నారు. నీ సోదరుడైన రుక్మి బలగర్వంతో మిడిసిపడుతున్నాడు. వారి అహంకారాన్ని అణచటానికి మాత్రమే, ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చాను. అంతేకాని, కాంతల పట్ల, సంతానం పట్ల, ఐశ్వర్యంపట్ల ఆసక్తి కలిగి కాదు. కామ మోహములకు మేము లోనుకాము. ఉదాసీనులము. క్రియారహితులము. పరిపూర్ణులము. నాలుగు గోడల మధ్య వున్న దీపం లాగ నిత్యాత్మ బుద్ధితో వెలుగుతుంటాము. అటువంటి మమ్మల్ని కట్టుకొని ఎందుకు బాధపడతావు.”