పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కన్యలం బదాఱువేలం దెచ్చుట

  •  
  •  
  •  

10.2-214-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకుల సంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.

టీకా:

ఇట్లు = ఈ విధమగా; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; తమతమ = వారలకు కలుగబోవు; మన్ననలు = సన్మానముల; కున్ = కు; ఉవ్విళ్ళూరు = వేడుకపడెడి; కన్నియన్ = కన్యకలను; పదాఱువేలన్ = పదహారువేలమందిని (16000); ధవళ = తెల్లని, చక్కని; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములు; మాల్య = పూలమాలలు; అనులేపనంబులున్ = మైపూతలు; ఒసంగి = ఇచ్చి; అందలంబులన్ = పల్లకీలలో {అందలము - పార్శ్వముల మఱుగులేని పల్లకి}; ఇడి = కూర్చుండబెట్టి; వారలను = వారిని; నరకాసుర = నరకాసురుని; భాండాగారంబులన్ = కోశాగారంలో, బొక్కసంలో; కల = ఉన్నట్టి; నానా = అనేక; విధంబులు = రకములు; అయిన = ఐనట్టి; మహా = గొప్ప; ధనంబులను = సంపదలను; రథంబులను = రథములను; తురంగంబులను = గుఱ్ఱములను; ధవళంబులు = తెల్లటివి; ఐ = అయ్యి; వేగవంతంబులు = వడిగలవి; ఐ = అయ్యి; ఐరావత = ఐరావతము; కుల = జాతి యందు; సంభవంబులు = పుట్టినవి; ఐన = అయిన; చతుర్దంత = నాలుగు దంతములున్న; దంతావళంబులను = పెద్ద ఏనుగులను {దంతావళము - ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు}; ద్వారకానగరంబున్ = ద్వారక; కున్ = కు; పనిచి = పంపించి; దేవేంద్రునిపురంబు = అమరావతి {దేవేంద్రునిపురము - ఇంద్రుని యొక్క పట్టణము, స్వర్గమునకు ముఖ్యపట్టణము, అమరావతి}; కున్ = కి; చని = వెళ్ళి; అదితిదేవి = అదితి యొక్క; మందిరంబున్ = గృహమును; చొచ్చి = ప్రవేశించి; ఆ = ఆ; పెద్దమ్మ = వృద్ధమాత; కున్ = కు; ముద్దు = ఆదరమును; చూపి = కనబరచి; మణి = రత్నాల; కిరణ = కిరణముల; పటల = సమూహముచే; పరిభావిత = భంగపరచబడిన; భానుమండలంబులు = సూర్యబింబములు కలవి; ఐన = అయిన; కుండలంబులు = చెవికుండలములు; ఒసంగి = ఇచ్చి; శచీ = శచీదేవితో; సమేతుండు = కూడినవాడు; ఐన = అయిన; మహేంద్రున్ = దేవేంద్రుని; చేతన్ = చేత; సత్యభామ = సత్యభామ; తోడన్ = తోటి; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; పిదపన్ = పిమ్మట; సత్యభామ = సత్యభామ; కోరినన్ = కోరగా; నందనవనంబున్ = నందనవనమును {నందనవనము - స్వర్గములోని ఇంద్రుని ఉద్యానవనము}; చొచ్చి = ప్రవేశించి.

భావము:

ఈ మాదిరిగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్యలు అందరకూ తెల్లని చీరలను, ఆభరణాలనూ, పూమాలలనూ, సుగంధ మైపూతలనూ శ్రీకృష్ణుడు ఇచ్చాడు; నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలనూ, రథాలనూ, అశ్వాలనూ, అమితమైన వేగం కలిగిన ఐరావత కులంలో ఉద్భవించిన తెల్లని నాలుగు దంతాల ఏనుగులనూ, ద్వారకానగరానికి పంపించాడు. ఆ పదారువేలమంది స్త్రీలనూ పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణ మైన అమరావతికి వెళ్ళాడు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్ళి ఆమె ప్రేమను చూరగొని తమ కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికుండలాలను ఆమెకు సమర్పించాడు. శచీదేవీ దేవేంద్రుల చేత సత్యభామ సమేతంగా పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందనవనం వెళ్దామని కోరింది. ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు.