పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కన్యలం బదాఱువేలం దెచ్చుట

  •  
  •  
  •  

10.2-208-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి.

టీకా:

కని = చూసి; అతని = అతని; సౌందర్య = చక్కదనమునకు; గాంభీర్య = చలింపని స్వభావము; చాతుర్య = నేర్పరితనము; ఆది = మున్నగు; గుణంబుల్ = సుగుణముల; కున్ = వలన; మోహించి = మచ్చిక పుట్టి; తమకంబులన్ = త్వరపాటులు; జనియింపన్ = పుట్టగా; ధైర్యంబులు = తాలుములు; చాలించి = విడిచి; సిగ్గులు = లజ్జలను; వర్జించి = వదలివేసి; పంచశర = మన్మథుని బాణములచేత; సంచలిత = చలించిన; హృదయలు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దైవయోగంబునన్ = దైవ నిర్ణయానుసారము; పరాయత్తంబులు = పరవశము లైన; చిత్తంబులన్ = మనసులతో; ఆ = ఆ; మత్తకాశినులు = విలాసవంతురాళ్ళు {మత్తకాశిని - మదముచేత ప్రకాశించునామె, స్త్రీ}; తత్తఱంబునన్ = తొట్రుపాటుతో; మనోజుండు = మన్మథుడు; ఉత్తలపెట్టన్ = పరితాపపడ జేయగా; అతండు = అతను; తమ = వారల; కున్ = కి; ప్రాణవల్లభుండు = ప్రియమైన భర్త; అని = అని; వరియించి = కోరి.

భావము:

అలా చూసి శ్రీకృష్ణుని సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం మున్నగు సుగుణాలకు ఆకర్షితలై మోహించారు. వలపులు పొంగి ధైర్యం కోల్పోయి సిగ్గులు వదలి శృంగార భంగిమలతో సంచలించిన హృదయాలతో పంచబాణుడు తొందరపెట్టగా ఆ రాచకన్నెలు అతడే తమ ప్రాణవల్లభు డని వరించారు.