పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసురుని వధించుట

  •  
  •  
  •  

10.2-203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు, పరుండవు, నీవ; నేనును, వారియు, ననిలుండు, వహ్నియు, నాకాశంబుఁ, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీ యంద సంభవింతుము.

టీకా:

దేవా = భగవంతుడా; నీవు = నీవు; లోకంబులన్ = సర్వలోకములను; సృజియించుట = సృష్టించుట; కున్ = కోసము; రజోగుణంబును = రజోగుణమును (బ్రహ్మ); రక్షించుట = కాపాడుట; కున్ = కు; సత్త్వగుణంబును = సత్త్వగుణము (విష్ణు); సంహరించుట = నాశముచేయుట; కున్ = కు; తమోగుణంబున్ = తమోగుణము (శివుడు); ధరియింతువు = స్వీకరింతువు; కాల = కాలము; మూర్తివి = స్వరూపమైనవాడవు; ప్రధానపూరుషుండవు = ప్రకృతి పురుషుడు రూపముగా కలవాడవు; పరుండవు = సర్వాతీతమైనవాడవు; నీవ = నీవే; నేనును = నేను (భూమి); వారియున్ = జలము; అనిలుండు = వాయువు; వహ్నియున్ = అగ్ని; ఆకాశంబున్ = ఆకాశము; భూత = జీవుడు {పంచభూతము - 1భూమి 2జలము 3వాయువు 4అగ్ని 5ఆకాశము}; తన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; దేవతలును = ఇంద్రియాధిదేవతలు; మనంబును = మనస్సు; కర్తయును = అహంకారము; మహత్త్త్వంబును = బుద్ధి; చరా = చరించగలిగినవి; అచర = చరించలేనివి; ఐన = అయిన; విశ్వంబునున్ = ప్రపంచము; అద్వితీయుండవు = రెండవది లేనివాడు; ఐన = అయిన; నీ = నీ; అందున్ = అందే; సంభవింతుము = పుట్టుదుము.

భావము:

ఓ దేవా! నీవు ప్రపంచాన్ని సృష్టించడం కోసం రజోగుణాన్ని రక్షించడం కోసం సత్త్వగుణాన్ని నశింపజేయడం కోసం తమోగుణాన్ని ధరిస్తావు. నీవు కాలమూర్తివి; ప్రధానవ్యక్తివి; నరుడవు; నేను (భూమి), నీరు, అగ్ని, వాయువు, ఆకాశము; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; అనగా పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు; దేవతలు; మనస్సు; కర్త; మహాత్తత్వం; ఈ చరాచరమయమైన సమస్త ప్రపంచం; అద్వితీయుడవైన నీ యందే ఉద్భవిస్తాము.