పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసురుని వధించుట

  •  
  •  
  •  

10.2-197-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటం జూచి, నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతి శక్తిం గొని గరుడుని వైచె; నతండును విరులదండ వ్రేటునఁ జలింపని మదోద్దండ వేదండంబునుంబోలె విలసిల్లె; నయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున

టీకా:

మఱియును = ఇంకను; విహగరాజ = గరుత్మంతుని; పక్ష = రెక్కలచే; విక్షేపణ = ఆడించుటచేత; సంజాత = పుట్టిన; వాతంబు = గాలిని; సైరింపంజాలక = సహింపలేక; హత = చనిపోగా; శేషంబు = మిగిలినది; ఐన = అగు; సైన్యంబు = సైన్యము, దండు; పురంబున్ = నగరములోనికి; చొచ్చుటన్ = దూరుటను; చూచి = చూసి; నరక = నరకుడు అను; అసురుండు = రాక్షసుడు; మున్ను = మునుపు; వజ్రాయుధంబున్ = వజ్రాయుధమును; తిరస్కరించిన = అలక్ష్యముచేసిన; తన = అతని యొక్క; చేతి = చేతనున్న; శక్తిన్ = శక్తి అను ఆయుధముతో; కొని = పూని; గరుడుని = గరుత్మంతుని; వైచెన్ = కొట్టెను; అతండును = అతను; విరుల = పూల; దండ = మాల యొక్క; వ్రేటునన్ = దెబ్బకు; చలింపని = చలించనట్టి; మద = మదముచేత; ఉద్దండ = అతిశయించిన; వేదండంబునున్ = ఏనుగును; పోలెన్ = వలె; విలసిల్లెన్ = విరాజిల్లెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; గజ = ఏనుగను; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; కలహ = యుద్ధ; రంగంబునన్ = క్షేత్రమున.

భావము:

గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలివేగానికి నిలువలేక, చావగా మిగిలిన నరకుడి సైనికులు పట్టణంలోనికి పాఱిపోయారు. అది చూసి నరకాసురుడు దేవేంద్రుని వజ్రాయుధాన్ని తిరస్కరించిన తన చేతిలోని శక్తి అనే ఆయుధాన్ని, గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. అంతటి దెబ్బకూ, పూలదండ దెబ్బకు చలించని మదపుటేనుగులాగ గరుత్మంతుడు ఏమాత్రం చెక్కుచెదరక భాసిల్లాడు. ఆ సమయంలో యుద్ధరంగంలో ఓ మదగజాన్ని ఎక్కి.....