పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్యభామ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-177-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సౌవర్ణ కంకణ ణఝణ నినదంబు-
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ గధగ దీప్తులు-
గండమండలరుచిఁ ప్పికొనఁగ
వళతరాపాంగ ళధళ రోచులు-
బాణజాలప్రభాటలి నడఁప
రపాత ఘుమఘుమబ్దంబు పరిపంథి-
సైనిక కలకల స్వనము నుడుప

10.2-177.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
లసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.

టీకా:

సౌవర్ణ = బంగారు; కంకణ = చేతి కడియములు; ఝణఝణ = ఝణఝణ అను; నినదంబు = శబ్దము; శింజినీ = అల్లెతాటి; రవము = చప్పుళ్ళ; తోన్ = తేటి; చెలిమి = స్నేహము; చేయన్ = చేయగా; తాటంక = చెవి దుద్దుల యొక్క; మణి = రత్నముల; గణ = సమూహము యొక్క; ధగధగ = ధగధగమనెడి; దీప్తులు = కాంతులు; గండమండల = చెక్కిటి ప్రదేశమునందలి; రుచిన్ = మెరుపును; కప్పికొనగ = కప్పివేయగా; ధవళతర = మిక్కిలి తెల్లనైన {ధవళము - ధవళతరము - ధవళతమము}; అపాంగ = కడకంటి; ధళధళ = తళతళమనెడి; రోచులున్ = కాంతులు; బాణ = అమ్ముల; జాల = సమూహముల యొక్క; ప్రభా = కాంతుల; పటలిన్ = సమూహమును; అడపన్ = అణచగా; శర = బాణములు; పాత = పడెడి; ఘమఘమ = ఘమఘమ అనెడి (ఉరుముల ధ్వని , శరపాతము నకు, వర్షధార లనే అర్థము కూడా స్ఫురిస్తుంది); శబ్దంబున్ = ధ్వని; పరిపంథి = శత్రుపక్షపు; సైనిక = సేనల యొక్క; కలకల = కలకల అనెడి; స్వనమున్ = ధ్వని; ఉడుపన్ = అణచగా; వీర = వీరము; శృంగార = శృంగారము; భయ = భయానకము; రౌద్ర = రౌద్రము; విస్మయములున్ = అద్భుత రసములు; కలిసి = కలిసిపోయి; భామిని = స్త్రీ రూపముగా; అయ్యెనో = అయినదో; కాక = ఏమో; అనగన్ = అన్నట్లుగా; ఇషువున్ = బాణమును; తొడుగుట = సంధించుట; తివుచుట = లాగుట; ఏయుట = ప్రయోగించుట; ఎల్లన్ = అంతయు; ఎఱుగరాకుండన్ = తెలియరాకుండగా; అనిన్ = యుద్ధమునందు; చేసెన్ = చేసెను; ఇందువదన = అందగత్తె {ఇందువదన - చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ}.

భావము:

బంగారుకంకణాల ఝణఝణ ధ్వనులు, వింటినారీధ్వనితో కలసిపోగా; చెవికమ్మలకు పొదగిన మణుల ధగధగ కాంతులు, చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా; అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు, బాణాల కాంతులను కప్పివేయగా; శరములు ప్రయోగించుట వలన కలిగిన ఘుమఘుమ శబ్దం, శత్రుసైన్యాల కలకల ధ్వనులను అణచివేయగా; వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం గూడ గుర్తించరానంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది.