పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్యభామ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-175-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం న్వంగి దైత్యాంగనా
గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.

టీకా:

ఆ = ఆ; విల్లున్ = ధనుస్సును; అంది = అందుకొని; బలంబున్ = బలము; ఒంది = పొంది; తత్ = దాని వలన; అగణ్యా = ఎంచరాని; అనంత = అంతులేని; తేజః = తేజస్సు యొక్క; విశేష = అతిశయముచే; ఆవిర్భూత = పుట్టిన; మహా = గొప్ప; ప్రతాపమునన్ = పరాక్రమముతో; వీర = వీరులు; ఆలోక = చూచుటకు; దుర్లోక్యము = చూడశక్యముగానిది; ఐ = అయ్యి; తాన్ = ఆమె; వేగన్ = వడిగా; సగుణంబున్ = అల్లెతాడు కలదిగా; చేసెన్ = చేసెను; ధనువున్ = విల్లును; తన్వంగి = సుందరి {తన్వంగి - తనువు (సన్నని) అంగి (దేహము కలది), స్త్రీ}; దైత్య = రాక్షస; అంగనా = స్తీల యొక్క; గ్రీవా = మెడల; సంఘమున్ = సమూహము; నిర్గుణంబు = తాడులేనివి; కన్ = అగునట్లు; రణ = పోరు అను; క్రీడా = ఆట అందలి; మహా = మిక్కిలి; ఉత్కంఠ = తహతహ; తోన్ = తోటి.

భావము:

సత్యభామాదేవి కృష్ణభగవాను డిచ్చిన ఆ ధనుస్సు అందుకుంది. దానితో ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజోవిశేషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరిచూడరాని రీతిలో విలసిల్లింది. యుద్ధోత్సాహంతో ఆ నారీమణి రాక్షసస్త్రీల కంఠాలలోని మంగళసూత్రాలు తెగేలాగ నారి బిగించి, ధనుష్టంకారం చేసింది.