పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ప్రద్యుమ్న జన్మంబు

  •  
  •  
  •  

10.2-8-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.

టీకా:

అంతన్ = ఆ సమయము నందు; నారదుండు = నారదుడు; వచ్చి = వచ్చి; బాలకుని = పిల్లవాని యొక్క; జన్మంబును = పుట్టుక; శంబర = శంబరుడు; ఉద్యోగంబును = చేసిన పని; మీన = చేప; ఉదర = కడుపులో; ప్రవేశంబునున్ = చేరుట; చెప్పినన్ = చెప్పగా; విని = విని; ఆ = ఆ యొక్క; రతి = రతీదేవి; మాయావతి = మాయావతి; అను = అనెడి; పేరన్ = పేరుతో; శంబరుని = శంబరాసురుని; ఇంటన్ = ఇంటిలో; పాతివ్రత్యంబున్ = పతివ్రతాధర్మము; సలుపుచు = జరుపుచు; దహన = అగ్ని చేత; దగ్ధుండు = కాలిపోయినవాడు; అయిన = ఐన; తన = తన యొక్క; పెనిమిటి = భర్త; శరీర = దేహము (ఇంకొకటి); ధారణంబు = ధరించుట; చేయుట = చేయుట; కున్ = కు; ఎదురుచూచున్నయది = ఎదురు చూస్తున్నది; కావున = కాబట్టి; ఆ = ఆ యొక్క; అర్భకుండు = పిల్లవాడు; దర్పకుండు = మన్మథుడు; అని = అని; తెలిసి = తెలిసికొని; మెల్లన = అల్లన; పుత్ర = పిల్లలు; అర్థిని = కోరునామె; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; శంబరుని = శంబరాసురుని; అనుమతి = అంగీకారము; పడసి = పొంది; సూపకారుల = వంటవారి; ఒద్దన్ = దగ్గర; ఉన్న = ఉన్నట్టి; పాపనిన్ = శిశువును; తెచ్చి = తీసుకువచ్చి; పోషించుచుండెన్ = పెంచుతుండెను; ఆ = ఆ; కుమారుండును = పిల్లవాడు; శీఘ్రకాలంబునన్ = తొందరలోనే; ఆరూఢ = ఎక్కిన; యౌవనుడు = యౌవనము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

అంతకు ముందే నారదమహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మ్రింగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో, ఆ శిశు రూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు