పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ప్రద్యుమ్న జన్మంబు

  •  
  •  
  •  

10.2-13-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము.

టీకా:

అనినన్ = అని పలుకగా; రతి = మాయాదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నీవు = నీవు; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; నందనుండవు = పుత్రుడవు; ఐన = అయిన; కందర్పుండవు = మన్మథుడవు {కందర్పుడు - కం (ఆనందముచేత) దర్పించువాడు (అతిశయించువాడు), మన్మథుడు}; పూర్వ = తొల్లిటి; కాలంబునన్ = కాలము నందు; నేను = నేను; నీవు = నీ; కున్ = కు; భార్యను = భార్యను; ఐన = అయిన; రతిని = రతీదేవిని; నీవు = నీవు; శిశువు = చంటిబిడ్డవు; ఐ = అయ్యి; ఉండున్ = ఉన్న; ఎడన్ = అప్పుడు; నిర్దయుండు = దయలేనివాడు; ఐ = అయ్యి; దొంగిలి = దొంగతనము చేసి; తల్లిన్ = నీ తల్లినుంచి; తొఱంగజేసి = తప్పించి; శంబరుండు = శంబరుడు; కొని = తీసుకొని; వచ్చి = వచ్చి; నిన్ను = నిన్ను; నీరధి = సముద్రము {నీరధి - నీరు కి నిధి, కడలి}; లోన్ = లోపల; వైచినన్ = పడవేయగా; ఒక్క = ఒకానొక; మీనంబు = చేప; మ్రింగెన్ = మింగెను; మీన = చేప; ఉదరంబు = కడుపునుండి; వెడలితి = బడటకి వచ్చితివి; ఈవు = నీవు; మీదటి = ఇకమీద చేయవలసిన; కార్యమున్ = పనిని; ఆకర్ణింపుము = వినుము.

భావము:

ఈలాగ పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది. “నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి, సముద్రంలో పారేసాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను.