పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసుర వధ కేగుట

  •  
  •  
  •  

10.2-167-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు హరి శరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱంగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకు సేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుండయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని.

టీకా:

మఱియున్ = ఇంకను; హరి = కృష్ణుని; శర = బాణముల; జాల = సమూహముచేత; చక్ర = చక్రముచేత; నిహతులు = నరకబడినవారు; ఐ = అయ్యి; తన = అతని; వారలు = పక్షము వారు; మడియుట = చచ్చుట; కున్ = కు; వెఱంగుపడి = ఆశ్చర్యపోయి; రోషించి = కోపించి; గరుడగమనుని = కృష్ణుని {గరుడ గమనుడు - గరుడ వాహనం పై గమనుడు తిరుగుచున్నవాడు, కృష్ణుడు}; దూషించి = తిట్టి; తన్ను = తనను; భూషించుకొని = పొగడుకొని; సరకుచేయక = లక్ష్యపెట్టక; నరకుండు = నరకుడు; వర = శ్రేష్ఠములైన; కుండల = చెవికుండలములు; ప్రముఖ = మొదలైన; ఆభరణ = సొమ్ములు చేత; భూషితుండు = అలంకరింపబడినవాడు; అయి = అయ్యి; దాన = మద; సలిల = నీటిచే; సిక్త = తడసిన; గండంబులును = చెక్కిళ్ళు కలవి; మహా = మిక్కిలి; ఉద్దండ = పొడవైనవి ఐన; శుండా = తొండములు అను; దండంబులున్ = కఱ్ఱలవంటివి కలిగినవి; ఐన = అయిన; వేదండంబులు = ఏనుగులు; తండంబులు = గుంపులు గుంపులు; ఐ = అయ్యి; నడువన్ = రాగా; వెడలి = బయలుదేరి; భండనంబున్ = యుద్ధభూమి; కున్ = కి; చని = వెళ్ళి.

భావము:

యుద్ధంలో తన పక్షం వారంతా శ్రీకృష్ణుడి చక్రానికి బాణాలకు బలి అయిపోవడంతో నరకాసురుడు ఆశ్చర్యపోయి; రోషంతో శ్రీహరిని దూషించాడు; తనను తాను పొగడుకున్నాడు; కృష్ణుడి పరాక్రమాన్ని తిరస్కరించాడు; కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించి, దానజలంతో తడిసిన గండస్థలాలు గొప్ప తొండాలూ గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు.