పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసుర వధ కేగుట

  •  
  •  
  •  

10.2-165-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన.
^ సప్త వాయువులు

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శిరంబులు = తలలు; చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించు వాడు, కృష్ణుడు}; చక్రా = చక్రాయుధము యొక్క; ధారా = పదునులతో; ఛిన్నంబులు = నరకబడినవి; అయిన = కాగా; వజ్రి = ఇంద్రుని; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారా = అంచులచే; దళిత = నరకబడిన; శిఖరంబు = శిఖరములు కలది; ఐ = అయ్యి; కూలెడి = పడిపోయెడి; శిఖరి = పర్వతము; చందంబునన్ = వలె; ముర = ముర అను; అసురుండు = రాక్షసుడు; జలంబుల్ = నీటి; అందున్ = లో; కూలినన్ = పడిపోగా; వాని = అతని; సూనులు = కొడుకులు; జనక = తండ్రిని; వధ = చంపుట వలన; జనిత = కలిగిన; శోక = దుఃఖముచేత; ఆతురులు = పీడింపబడినవారు; ఐ = అయ్యి; జనార్దనున్ = కృష్ణుని; మర్దింతుము = చంపుదుము; అని = అని; రణ = యుద్ధ మనెడు; కుర్దనంబునన్ = క్రీడలో; తామ్రుండు = తామ్రుడు; అంతరిక్షుండు = అంతరిక్షుడు; శ్రవణుండు = శ్రవణుడు; విభావసుండు = విభావసుడు; వసుండు = వసుడు; నభస్వంతుండు = నభస్వంతుడు; అరుణుండు = అరుణుడు; అనన్ = అనెడి; ఏడ్వురు = ఏడుగురు (7); యోధులు = వీరులు; సక్రోధులు = కోపము కలవారు; ఐ = అయ్యి; కాలాంతక = ప్రళయకాల యమునిచే; చోదితంబు = ప్రేరేపింపబడినవి; ఐన = అగు; ప్రళయ = ప్రళయకాల; పవనసప్తకంబున్ = సప్తవాయువులు (7) {సప్తవాయువులు - 1ప్రవహము 2వివహము 3ఆవహము 4ప్రతివహము 5ఉద్వహము 6సంవహము 7పరివహము, మరియొక విధమున, 1గగనము 2స్పర్శనము 3వాయువు 4అనిలము 5ప్రాణము 6ప్రాణేశ్వరము 7జీవము}; భంగిన్ = వలె; నరక = నరకుడు అను; అసుర = రాక్షసునిచే; ప్రేరితులు = ప్రేరేపింపబడినవారు; ఐ = అయ్యి; రయంబునన్ = శీఘ్రముగా; పీఠుండు = పీఠుడు; అనియెడు = అనెడి; దండనాథున్ = సేనానాయకుని; పురస్కరించుకొని = ముందుంచుకొని; పఱతెంచి = పరుగెత్తివచ్చి; హరిన్ = కృష్ణుని; తాకి = ఎదిరించి; శర = బాణములు; శక్తి = శక్తి ఆయుధము {శక్తి - పలుచేతులు వంటి ప్రక్క యలుగులును నిడుపాటి మొనయును కలిగిన ఆయుధ విశేషము}; గదా = గదాయుధము {గద - చేత పట్టుకొన వీలైన పొడవైన కడ్డీ దాని చివర పెద్ద బరువైన గుండ్రటి తల కలిగిన ఆయుధవిశేషము, గుదియ}; ఖడ్గ = కత్తి; కరవాల = పొడవైన కత్తి, చేకత్తి; శూల = శూలము {శూలము - బాగా పొడవైన సన్నని కడ్డీ చివరన కొన బాగా సూదిగా ఉండెడి దళసరిగా నున్న ఆకు రూపు ఆయుధవిశేషము}; ఆది = మున్నగు; సాధనంబులు = ఆయుధములు; ప్రయోగించినన్ = ప్రయోగించగా.

భావము:

దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతం మాదిరి, శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని ఏడుగురు కుమారులు శోకోద్రిక్తులై జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడిని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవనసప్తకం (ప్రవహము, ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, ప్రతివహము, పరావహము అను ఈ ఏడూ సప్తవాయువులు అనబడును) లాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడుగురు యోధులు; పీఠుడు అనే సేనానాయకుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చి బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు.