పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసుర వధ కేగుట

  •  
  •  
  •  

10.2-160-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిది నొప్పు నమ్మహా ధ్వని విని పంచశిరుం డైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం పంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలంబగు శూలంబున గరుడుని వైచి భూనభోంతరంబులు నిండ నార్చుచు.

టీకా:

అంతన్ = అంతట; లయకాల = ప్రళయకాలము నందలి; కాల = నల్లని; అభ్ర = మేఘముల యొక్క; గర్జనంబు = ఉరుముల; పగిదిన్ = వలె; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ యొక్క; మహా = గొప్ప; ధ్వనిన్ = శబ్దమును; విని = విని; పంచశిరుండు = ఐదుతలలు కలవాడు; ఐన = అయిన; ముర = ముర అను; అసురుండు = రాక్షసుడు; నిదుర = నిద్రను; చాలించి = మేల్కొని; ఆవులించి = ఆవులించి; నీల్గి = ఒళ్ళువిరచికొని; లేచి = లేచి; జలంబులు = నీళ్ళనుండి; వెడలి = బయటకు; వచ్చి = వచ్చి; హరిన్ = కృష్ణుని; కని = చూసి; ప్రళయ = ప్రళయము; కాల = కాలమునందలి; కీలి = అగ్ని; కైవడిన్ = వలె; మండుచున్ = మండిపడుతు; దుర్నిరీక్ష్యుండు = చూడశక్యము కానివాడు; ఐ = అయ్యి; కరాళించుచున్ = బొబ్బరించుచు, గర్జించుచు; తన = తన యొక్క; పంచ = ఐదు; ముఖంబులన్ = నోళ్ళతోను; పంచభూత = పంచభూతములతో {పంచభూతములు - పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అను ఐదు భూతములు}; మయంబు = నిండినవి; అయిన = అగు; లోకంబులన్ = లోకములను; మ్రింగన్ = మ్రింగివేయుటకు; అప్పళించు = ప్రయత్నించు; చందంబునన్ = విధముగా; కదిసి = సమీపించి; ఆభీల = భయంకరమైన; కీలా = మంటల; జటాలంబున్ = జటలు గలది; అగు = ఐన; శూలంబునన్ = శూలముచేత; గరుడుని = గరుత్మంతుని; వైచి = కొట్టి; భూ = భూమికి; నభః = ఆకాశము; అంతరంబులన్ = మధ్యప్రదేశము లందు; నిండన్ = నిండిపోవునట్లు; ఆర్చుచున్ = బొబ్బలు పెడుతు.

భావము:

ప్రళయకాలం నాటి కాలమేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వనిని విని, అయిదు తలలు గల ఆ మురాసురుడు నిద్రమేల్కొన్నాడు. ఆవులించి లేచి, నీటిలో నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూసాడు. ప్రళయకాలం నాటి అగ్నిజ్వాలలాగ మండుతూ చూడశక్యం కానివాడై పెడబొబ్బలు పెడుతూ, పంచభూతాలతో కూడిన అన్ని లోకాలను తన ఐదు నోళ్ళతో మ్రింగబోతున్నాడా అన్నట్లు నోళ్ళు తెరుచుకుని, శ్రీకృష్ణుడిని సమీపించాడు. మురాసురుడు భయంకరమైన అగ్నిజ్వాలల వంటి జడలతో కూడిన తన శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు.