పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-141-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వృషభంబులన్ = ఆంబోతులను; అన్నిటినిన్ = అన్నింటిని; కట్టి = కట్టేసి; ఈడ్చినన్ = లాగివేయగా; చూచి = చూసి; హరి = కృష్ణుని; కిన్ = కి; నగ్నజిత్తు = నగ్నజిత్తు; నాగ్నజిత్తిన్ = నాగ్నజిత్తిని; ఇచ్చినన్ = ఇవ్వగా; విధివత్ = పద్దతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పెండ్లియయ్యెన్ = పెండ్లాడెను; ఆ = ఆ యొక్క; రాజ = రాజు యొక్క; సుందరులున్ = భార్యలు; ఆనందంబునున్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ఆ = ఆ; సమయంబునన్ = సమయము నందు; బ్రాహ్మణ = విప్రుల; ఆశీర్వాదంబులును = దీవెనలను; గీత = పాటలను; పటహ = తప్పెటలు; శంఖ = శంఖములు; కాహళ = బాకాలు; భేరీ = పెద్దనగారాలు; మృదంగ = మద్దెలలు యొక్క; నినదంబులును = పెద్ద శబ్దములు; చెలంగెన్ = చెలరేగెను; అంతన్ = పిమ్మట; ఆ = ఆ యొక్క; కోసలేంద్రుండు = నగ్నజిత్తు {కోసలేంద్రుడు - కోసలదేశ రాజు, నగ్నజిత్తు}; దంపతులన్ = భార్యాభర్తలను; రథ = రథముపై; ఆరోహణంబు = ఎక్కుట; చేయించి = చేయించి; పదివేల = పదివేలు (10000); ధేనువులును = ఆవులు; విచిత్ర = చిత్రముగ నేసిన; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములచే; భూషితలు = అలంకరింపబడినవారు; ఐన = అయిన; యువతులు = యౌవనస్త్రీలు; మూడువేలును = మూడువేలమందిని (3000); తొమ్మిదివేల = తొమ్మిదివేలు (9000); గజంబులును = ఏనుగులు; గజంబుల్ = ఏనుగుల; కున్ = కు; శత = నూరు (100); గుణంబులు = రెట్లు; ఐన = అయిన; రథంబులును = రథములు; రథంబుల్ = రథముల; కున్ = కు; శత = నూరు (100); గుణంబులు = రెట్లు; ఐన = అయిన; హయంబులును = గుఱ్ఱములు; హయంబుల్ = గుఱ్ఱముల; కున్ = కు; శత = వంద (100); గుణ = రెట్లు కన్నా; అధికంబు = ఎక్కువ; ఐన = అయిన; భట = సైనికుల; సమూహంబునున్ = సమూహము; ఇచ్చి = ఇచ్చి; పుత్తెంచినన్ = పంపించగా; వచ్చున్ = వచ్చెడి; అప్పుడు = సమయమునందు;

భావము:

ఈవిధంగా శ్రీకృష్ణుడు ఏడువృషభాలను కట్టి ఈడ్వగా, నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; మంగళగీతాలు భేరీమృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి; కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను, వస్త్రాభరణాలంకృతలైన మూడువేలమంది కన్యలనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, అంతకు వందరెట్లు రథాలనూ, అంతకు వందరెట్లు గుఱ్ఱాలనూ, అంతకు వందరెట్లు సైనికులనూ కానుకగా ఆ రాజు, కృష్ణుడికి ఇచ్చాడు.