పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-120-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని ధనంజయుఁ డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె.

టీకా:

అనినన్ = అని చెప్పగా; విని = విని; ధనంజయుండు = అర్జునుడు; ఆ = ఆ యొక్క; నీలవేణి = సుందరి యొక్క {నీలవేణి - నల్లని శిరోజములు కలామె, స్త్రీ}; పలుకులు = మాటలు; హరి = కృష్ణుని; కిన్ = కి; చెప్పినన్ = చెప్పగా; విని = విని; సర్వఙ్ఞుండు = సర్వము తెలిసినవాడు; ఐన = అయిన; హరియున్ = కృష్ణుడు; హరిమధ్యను = వనితను {హరిమధ్య - సింహమువంటి నడుము కలామె, స్త్రీ}; రథంబు = రథము; మీదన్ = పైన; ఇడుకొని = పెట్టుకొని; ధర్మరాజు = ధర్మరాజు; కడ = దగ్గర; కున్ = కి; చని = వెళ్ళి; వారలు = వారు; కోరిన = అపేక్షించగా; విశ్వకర్మను = విశ్వకర్మను; రావించి = రప్పించి; వారి = వారల యొక్క; పురంబు = నగరమును; అతి = మిక్కిలి; విచిత్రంబు = అద్భుతమైనదిగా; చేయించె = చేయించెను.

భావము:

అలా చెప్పిన కాళింది మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆ సన్నని నడుము కల కాళింది సుందరిని రథముపై ఎక్కించుకుని, ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్రవిచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు.