పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ఇంద్రప్రస్థంబున కరుగుట

  •  
  •  
  •  

10.2-103-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రప్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులంగనిన యింద్రియంబులభంగి వారఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని; కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగహాసవిభాసితం బైన ముకుంద ముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి; గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మ్రొక్కిన గ్రుచ్చియెత్తి, యుత్తమ పీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు.

టీకా:

అంతన్ = ఆ తరువాత; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; పాండవులన్ = పాండవులను; చూడన్ = చూడవలెనని; నిశ్చయించి = కోరి; సాత్యకి = సాత్యకి; ప్రముఖ = మొదలగు; యాదవులున్ = యాదవులు; కొలువ = సేవించుచుండగా; పురుషోత్తముండు = శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థ = ఇంద్రప్రస్థము అను; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనినన్ = వెళ్ళగా; ప్రాణంబులన్ = ప్రాణములను; కనిన = పొందిన; ఇంద్రియంబుల = సర్వేంద్రియముల; భంగిన్ = వలె; వారు = వారు; అఖిల = నిఖిల సృష్టికి; ఈశ్వరుండు = నియమించువాడు; ఐన = అయిన; హరిన్ = కృష్ణుని; కని = చూసి; కౌగలించుకొని = ఆలింగనముచేసికొని; కృష్ణుని = కృష్ణుని; దివ్య = దివ్యమైన; దేహ = శరీరమును; సంగమంబునన్ = తాకుటచేత; నిర్ధూత = పోగొట్టబడిన; కల్మషులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; అనురాగ = ఆత్మీయతతోటి; హాస = నవ్వులతోటి; విభాసితంబు = మిక్కిలి ప్రకాశించునది; ఐన = అగు; ముకుంద = కృష్ణుని; ముఖ = మోము అను; అరవిందంబు = పద్మమును; దర్శించి = చూసి; ఆనందంబున్ = సంతోషమును; ఒందిరి = పొందిరి; గోవిందుండును = కృష్ణుడు; యుధిష్ఠిర = ధర్మరాజు యొక్క; భీమసేనుల = భీముని యొక్క; చరణంబుల్ = కాళ్ళ; కున్ = కు; అభివందనంబులు = నమస్కారములు; చేసి = చేసి; అర్జునున్ = అర్జునుడిని; ఆలింగనంబునన్ = కౌగలింతతో; సత్కరించి = గౌరవించి; నకుల = నకులుడు; సహదేవులు = సహదేవుడు; మ్రొక్కినన్ = నమస్కరించగా; గ్రుచ్చి = పొదవిపట్టుకొని; ఎత్తి = పైకిలేపి; ఉత్తమ = శ్రేష్ఠమైన; పీఠంబునన్ = ఆసనముపై; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; అప్పుడు = ఆ సమయము నందు;

భావము:

అటుపిమ్మట, ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలి అనుకున్నాడు. సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ఇంద్రప్రస్థనగరానికి వెళ్ళాడు. పాండవులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల వలె, సర్వేశ్వరు డైన శ్రీకృష్ణుడిని దర్శించి, కౌగలించుకున్నారు. విష్ణుదేవుని దివ్యశరీరము యొక్క స్పర్శ వలన వారి పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి. అనురాగపూరిత మైన చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని దర్శించి, వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు, భీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల, సహదేవులను ఆదరించాడు. ఒక ఉన్నతపీఠం పైన ఆసీనుడయ్యాడు. అప్పుడు.....

10.2-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చంద్ఘనకుచభారా
కుంచితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం
చించుక సిగ్గు జనింపఁగఁ
బాంచాలతనూజ మ్రొక్కెఁ ద్మాక్షునకున్.

టీకా:

చంచత్ = చలించుచున్న; ఘన = పెద్ద; కుచ = స్థనముల; భార = బరువుచేత; ఆకుంచిత = మిక్కిలి వంపబడినది; ఐ = అయ్యి; క్రొత్త = కొత్తగా; పెండ్లికూతురు = పెళ్ళయిన ఇల్లాలు; అగుటన్ = అగుటచేత; ఇంచించుక = కొంచెము; సిగ్గు = సిగ్గు; జనింపగన్ = పడుతుండగా; పాంచాలతనూజ = కృష్ణ {పాంచాల తనూజ - పాంచాలదేశము నేలెడి ద్రుపదమహారాజు కుమార్తె, ద్రౌపది}; మ్రొక్కెన్ = నమస్కరించెను; పద్మాక్షున్ = కృష్ణున; కున్ = కు.

భావము:

స్తనభారంతో అవనత అయి, క్రొత్త పెళ్ళికూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాలరాజపుత్రి ద్రౌపది పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడికి నమస్కరించింది.

10.2-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెఁ; దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి; హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె.

టీకా:

అంత = అప్పుడు; సాత్యకి = సాత్యకి; పాండవుల = పాండవుల; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒకానొక; పీఠంబునన్ = ఆసనముపై; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; తక్కిన = తతిమా, మిగిలిన; అనుచరులును = పరిజనులు కూడ; వారి = వారల; చేతన్ = చేత; పూజితులు = గౌరవింపబడినవారు; ఐ = అయ్యి; కొలిచి = కొలువుదీరి; ఉండిరి = ఉన్నారు; హరియున్ = కృష్ణుడు; కుంతీదేవి = కుంతీదేవి; కడ = దగ్గర; కున్ = కు; చని = వెళ్ళి; నమస్కరించి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అప్పుడు, పాండవులు సాత్యకిని గౌరవించారు. అతను కూడ ఒక ఆసనం పై ఆసీనుడు అయ్యాడు. తక్కిన యాదవులను కూడా పాండవులు చక్కగా సన్మానించారు. వారు కూడ కొలువుదీరారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు.

10.2-106-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అత్తా! కొడుకులుఁ గోడలుఁ
జిత్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా
త్తానుగవై యాజ్ఞా
త్తాదులు గలిగి మనుదె మ్మోదమునన్? "

టీకా:

అత్తా = అత్తా {అత్త - తండ్రి సోదరి}; కొడుకులున్ = కుమారులు; కోడలున్ = కోడళ్ళు {కోడలు - కొడుకు పెండ్లాము}; చిత్త = మనసునకు; ఆనందము = సంతోషము; కన్ = కలుగునట్లు; పనులు = పనులు; చేయగన్ = చేస్తుండగా; ఆత్మా = మనసునకు; ఆయత్త = వచ్చినట్లు, నచ్చినట్లు; అనుగవ = వర్తించుదానవు; ఐ = అయ్యి; ఆఙ్ఞా = ఆఙ్ఞాపించు; సత్త = సామర్థ్యము కలుగుట; ఆదులు = మున్నగునవి; కలిగి = ఉండి; మనుదె = జీవించుచున్నావా; సమ్మోదమునన్ = సంతోషముతో.

భావము:

“అత్త! నీ కొడుకులూ, కోడలు ద్రౌపదీ నీ మనసునకు ఆనందం కల్గిస్తుండగా సమ్మోదంతో జీవితం గడుపుతున్నావా.”

10.2-107-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడుఁ బ్రేమ విహ్వలత నందుచు గద్గదభాషణంబులం
నుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే
సి యపచారముం దలఁచి చెందిన దుఃఖములెల్లఁ జెప్పి యా
నుజవిరోధి కిట్లనియెఁ ద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్.

టీకా:

అనవుడు = అని అడుగగా; ప్రేమ = ప్రేమవలని; విహ్వలతన్ = చొక్కుట; అందుచున్ = పొందుతు; గద్గద = బొంగురుపోయిన; భాషణంబులన్ = పలుకులతో; కను = కళ్ళ; కవన్ = జంటనందు; అశ్రుతోయములున్ = కన్నీరు; కమ్మగన్ = నిండిపోగా; కుంతి = కుంతీదేవి; సుయోధనుండు = దుర్యోధనుడు; చేసిన = చేసినట్టి; అపచారమున్ = కీడు; తలచి = తలచుకొని; చెందిన = పొందిన; దుఃఖములు = బాధలు; ఎల్లన్ = అన్నిటిని; చెప్పి = చెప్పి; ఆ = ఆ; దనుజవిరోధి = కృష్ణుని {దనుజవిరోధి - రాక్షసుల శత్రువు, విష్ణువు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; తద్దయున్ = మిక్కిలి; పెద్దఱికంబు = గౌరవము; చేయుచున్ = చేస్తూ.

భావము:

ఇలాగ శ్రీకృష్ణుడు అడుగగా, కుంతీదేవి ప్రేమ విహ్వలతతో డగ్గుత్తికతో కనుల నీరు కమ్ముతుండగా, దుర్యోధనుడు చేసిన అపకారాలు, తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి, శ్రీకృష్ణునకు పెద్దరిక మిచ్చి ఇలా అన్నది.

10.2-108-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్న! నీ చుట్టాల రయుదు! మఱవవు-
నీవు పుత్తెంచిన నెమ్మితోడ
మా యన్న యేతెంచి ముఁ జూచి పోయెను-
నిల్చి యున్నారము నీ బలమున;
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు-
నేఁ డాదిగా నింక నీవె కాక?
ఖిల జంతువుల కీ వాత్మవు గావునఁ-
రులు నా వారని భ్రాంతి సేయ;

10.2-108.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్య! నా భాగ్యమెట్టిదో? నవరతముఁ
జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లఁ
వాపుచుందువు గాదె! యో! రమపుణ్య!
దుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! ."

టీకా:

అన్న = నాయనా; నీ = నీ యొక్క; చుట్టాలున్ = బంధువులను; అరయుదు = విచారింతువు; మఱవవు = మరచిపోవు; నీవు = నీవు; పుత్తెంచిన = పంపించగా; నెమ్మి = ప్రీతి; తోడన్ = తోటి; మా = మా యొక్క; అన్న = సోదరుడు; ఏతెంచి = వచ్చి; మమున్ = మమ్ము; చూచి = చూసి; పోయెను = వెళ్ళెను; నిల్చి = ఇలానిల్చి; ఉన్నారము = ఉన్నాము; నీ = నీ యొక్క; బలమునన్ = దన్నుతో, తోడువలన; నా = నా యొక్క; పిన్నవాండ్ర = పిల్లల; కున్ = కు; నా = నా; కున్ = కు; దిక్కు = రక్షకులు; ఎవ్వరు = ఎవరు; నేడు = ఈవేళ; ఆదిగాన్ = మొదలు పెట్టి; ఇంకన్ = ఇక; నీవె = నీవే; కాక = తప్పించి; అఖిల = సర్వ; జంతువుల = జీవుల; కిన్ = కు; ఈవు = నీవు; ఆత్మవు = జీవమువు; కావున = కాబట్టి; పరులు = ఇతరులు; నావారు = నాకు కావసిన వారు; అని = అని; భ్రాంతి = భ్రమచెందుట; చేయవు = చెయ్యవు; అయ్య = తండ్రి; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎంత మంచిదో; అనవరతము = ఎల్లప్పుడు; చిత్తమున = మనసులో; ఉండి = ఉండి; కరుణనన్ = దయతో; మా = మా యొక్క; చిక్కులు = ఆపదలు; ఎల్లన్ = అన్నిటిని; పాపుచుందువు = తొలగింతువు; కాదె = కదా, అవును; ఓ = ఓ; పరమపుణ్య = శ్రీకృష్ణా {పరమపుణ్యుడు - ఉత్కృష్టమైన పుణ్యవంతుడు, విష్ణువు}; యదుకుమారవరేణ్య = శ్రీకృష్ణా {యదుకుమారవరేణ్యుడు - యదువంశపు వారిలో వరేణ్యుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు}; బుధాగ్రగణ్య = శ్రీకృష్ణా {బుధాగ్రగణ్యుడు - బుధ (ఙ్ఞానులలో) అగ్రగణ్య (మొదటి లెక్కించ బడువాడు, శ్రేష్ఠుడు), కృష్ణుడు}.

భావము:

“ఓ పుణ్యాత్మా! యదుకులతిలకా! పురుషోత్తమా! కృష్ణా! నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపించగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని పలకరించి వెళ్ళాడు. నీ అండ వలననే మేము జీవించి ఉన్నాము. నా పిల్లలకు, నాకు నీవు కాక మరెవరు దిక్కు. సర్వప్రాణులకు నీవే ఆత్మవు కనుక, పరులు నా వారు అని నీకు భేదంలేదు. మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులు అన్నింటినీ తొలగిస్తున్నావు. ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి.”

10.2-109-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన యుధిష్ఠిరుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని పలుకగా; యుధిష్ఠిరుండు = ధర్మరాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

పిమ్మట, ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు,

10.2-110-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు సనందనాదు లే
ట్టుననైన, నట్టి గుణద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా
చుట్టమ వంచు వచ్చెదవు; చూచెద వల్పులమైన మమ్ము; నే
మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్? "

టీకా:

పట్టగలేరు = ఎరుగలేరు, గ్రహింపలేరు; నిన్నున్ = నిన్ను; తమ = వారి యొక్క; భావములు = మనసుల; అందున్ = లో; సనందాదులున్ = సనకాదిబ్రహ్మవేత్తలును {సనకాదులు - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాత అను నులుగు దేవర్షులు}; ఏ = ఎలాంటి; పట్టునన్ = ప్రయత్నములతో; ఐనను = అయినప్పటికి; అట్టి = అటువంటి; గుణ = సద్గుణముల చేత {భగవంతుని సద్గుణములు - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వాంతర్యామిత్వ సర్వస్రష్టృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వాది సుగుణములు}; భద్ర = మంగళ మగు; చరిత్రుడవు = వర్తన కలవాడవు; ఈవు = నీవు; నేడు = ఇవాళ; మా = మా యొక్క; చుట్టమవు = బంధువవు; అంచున్ = అని; వచ్చెదవు = వస్తున్నావు; చూచెదవు = చూస్తున్నావు; అల్పులము = అల్పఙ్ఞానులము; ఐన = అయిన; మమ్మున్ = మమ్ము; నేము = మేము; ఎట్టి = ఎటువంటి; తపంబున్ = తపస్సు; చేసితిమి = చేసామో; అధీశ్వరా = భగవంతుడా {అధీశ్వరుడు - పంచకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుల సృష్టి స్థితి లయములను నియామించువాడు, పరమాత్మ}; పూర్వశరీర = పూర్వజన్మ; వేళలన్ = కాలము నందు.

భావము:

“ప్రభూ! సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించి కూడా, నిన్ను తెలియలేరు. నీవు అంతటి సద్గుణ సచ్చరిత్రలు గల మహానుభవుడవు. ఇవాళ నీవు మా బంధువు అయ్యావు. అల్పుల మైన మమ్మల్ని చూడటానకి వచ్చావు. పూర్వజన్మలో మేము ఎంతటి తపస్సు చేసామో!”

10.2-111-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె; నందొక్కనాఁడు.

టీకా:

అని = అని; ధర్మజుండు = ధర్మరాజు; తన్ను = తనను; ప్రార్థించిన = వేడుకొనగా; ఇంద్రప్రస్థ = ఇంద్రప్రస్థము అను; పురంబు = పట్టణపు; వారలు = పౌరుల; కున్ = కు; నయనానందంబు = కన్నులపండువు; చేయుచున్ = చేస్తూ; హరి = కృష్ణుడు; కొన్ని = కొన్ని; నెలలు = మాసములు; వసియించి = ఉండి; ఉండెన్ = ఉండెను; అందు = అట్లు న్నప్పుడు; ఒక్క = ఒకానొక; నాడు = రోజు;

భావము:

అని ఈవిధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడుని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ అక్కడే కొన్ని నెలలపాటు ఉన్నాడు. అప్పుడు ఒకరోజు....