పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము

  •  
  •  
  •  

10.2-95-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె; నక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికిం జని; రక్రూరుండు లేమిం జేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి.

టీకా:

అట = అక్కడ; కృష్ణుండును = కృష్ణుడు; ద్వారకా = ద్వారకా అను; నగరంబున్ = నగరమున; కున్ = కు; చని = వెళ్ళి; శతధన్వుని = శతధన్వుని; మరణంబును = చావును; మణి = రత్నము; లేకుండుటయునున్ = లేకపోవుట; సత్యభామ = సత్యభామ; కున్ = కు; చెప్పి = తెలియజెప్పి; సత్యభామా = సత్యభామకు; ప్రియ = ఇష్టమైనదానిని; కరుండు = చేయువాడు; కావునన్ = కనుక; సత్రాజిత్తున్ = సత్రాజిత్తున; కున్ = కు; పరలోకక్రియలు = ఉత్తరక్రియలు {పరలోకక్రియలు - మరణానంతరము జీవి పై లోకములకేగుటకు చేసెడి విధులు, కార్యక్రమము, ఉత్తరక్రియలు}; చేయించెన్ = చేయించెను; అక్రూర = అక్రూరుడు; కృతవర్మలు = కృతవర్మలు; శతధన్వు = శతధన్వుని; మరణంబున్ = చావును; విని = తెలిసికొని; వెఱచి = భయపడి; ద్వారకా = ద్వారకా అను; నగరంబున్ = నగరమును; వెడలి = బయటికిపోయి; బహు = అనేక; యోజన = ఆమడల; దూర = దూరము నుండెడి; భూమి = ప్రదేశమున; కిన్ = కు; చనిరి = వెళ్ళిరి; అక్రూరుండు = అక్రూరుడు; లేమిన్ = లేకపోవుట; చేసి = చేత; వానలు = వర్షములు; లేక = పడక; మహా = గొప్పగొప్ప; ఉత్పాతంబులును = అపశకునములు {ఉత్పాతము - దుఃఖరోగప్రదములు, 1దివ్యము (అపూర్వ గ్రహ నక్షత్రములు పుట్టుట) 2అంతరిక్షము (పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట కొఱవియు పిడుగును పడుట) 3భౌమము (అపూర్వములైన చరాచర వస్తువులు కలుగుట)}; శరీర = దేహమునకు సంబంధించిన; మానస = మనసునకు సంబంధించిన; తాపంబులును = బాధలు; ద్వారకా = ద్వారకానగర; వాసుల = పౌరుల; కున్ = కు; సంభవించినన్ = కలుగగా; అందులన్ = వారిలో; వృద్ధజనులు = పెద్దవారు; బెగడి = భయపడి; హరి = కృష్ణుని; కిన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుడిని సంహరించిన సంగతి, అతడి దగ్గర మణి కానరాని విషయము తెలిపి, సత్రాజిత్తునకు ఉత్తరక్రియలు జరిపించాడు. శతధన్వుడి మరణ వార్త వినిన అక్రూర, కృతవర్మలు భయపడిపోయి, ద్వారకాపట్టణం వదలి ఎన్నో యోజనాల దూర ప్రాంతానికి పాఱిపోయారు. అక్రూరుడు దేశంలో లేకపోవడంతో, అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియ లేదు. ద్వారకలోని ప్రజలకు శారీరక మానసిక, తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరం లోని వయోవృద్ధులు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు.