పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శతధన్వుఁడు మణి గొనిపోవుట

  •  
  •  
  •  

10.2-86-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా
నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై
చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్‌
దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే? "

టీకా:

అక్కట = అయ్యయ్యో; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడు; మహాత్ములు = గొప్పవారు; వారల = వారి; కిన్ = కి; ఎగ్గు = కీడు; చేయగాన్ = చేయుటకు; ఇక్కడ = ఇక్కడ; ఎవ్వడు = ఎవరు; ఓపున్ = సమర్థుడు; వినుము = వినుము; ఏర్పడన్ = విశద మగునట్లు; కంసుడు = కంసుడు; బంధు = బంధువులతో; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; చిక్కడె = చిక్కుకుపోలేదా; మున్ను = మునుపు; మాగధుడు = జరాసంధుడు {మాగధుడు - మగధదేశము ప్రభువు, జరాసంధుడు}; సేనల = సైన్యముల; తోన్ = తోటి; పదియేడు = పదిహేడు (17); తోయముల్ = మార్లు, పర్యాయములు; దిక్కులన్ = దిక్కు లమ్మట; పాఱడే = పారిపోలేదా; మన = మన; కున్ = కు; దృష్టము = దృష్టాంతము, కనబడినది; వారల = వారి; లావు = బలము; వింతయే = కొత్తదా, కాదు.

భావము:

“అయ్యో! ఎంత పనిచేశావు. బలరామకృష్ణులు మహానుభావులు. వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్ధులు ఇక్కడ ఎవరు లేరు. కంసుడు బంధు మిత్ర సమేతంగా నేలకూలలేదా? జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమాలు మనకు క్రొత్త ఏమీ కాదు కదా.”