పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శతధన్వుఁడు మణి గొనిపోవుట

  •  
  •  
  •  

10.2-85-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హతుండు = చంపబడినవాడు; ఐన = అగు; తండ్రిన్ = తండ్రిని, నాన్నను; కని = చూసి; శోకించి = దుఃఖించి; సత్యభామ = సత్యభామ; అతనిన్ = అతనిని; తైల = నూనెల; ద్రోణిన్ = పాత్ర; అందున్ = లో; పెట్టించి = పెట్టించి; హస్తిపురంబున్ = హస్తినాపురమున; కున్ = కు; చని = వెళ్ళి; సర్వఙ్ఞుండు = సమస్తము తెలిసిన వాడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; సత్రాజిత్తు = సత్రాజిత్తు యొక్క; మరణంబున్ = చావును; విన్నవించిన = తెలుపగా; హరియును = కృష్ణుడు; బలభద్రుండు = బలరాముడు; ఈశ్వరులు = సర్వనియామకులు; అయ్యునున్ = అయినప్పటికి; మనుష్య = సామాన్య మానవుల; భావంబులన్ = స్వభావములతో; విలపించిరి = దుఃఖించిరి; అంతన్ = అంతట; బలభద్ర = బలరాముడు; సత్యభామా = సత్యభామలతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; మరలి = వెనుతిరిగి; వచ్చి = వచ్చి; శతధన్వున్ = శతధన్వుని; చంపెదను = చంపుతాను; అని = అని; తలంచినన్ = భావించగా, అనుకొనగా; ఎఱింగి = తెలిసి; శతధన్వుండు = శతధన్వుడు; ప్రాణ = ప్రాణముపోవును అను; భయంబునన్ = భయముతో; కృతవర్ముని = కృతవర్మ యొక్క; ఇల్లు = నివాసమున; కిన్ = కు; చని = వెళ్ళి; తన = అతని; కున్ = కి; సహాయుండవు = తోడుపడువాడవు; కమ్ము = అగుము; అని = అని; పలికినన్ = చెప్పగా; కృతవర్మ = కృతవర్మ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

సత్యభామ తండ్రి మరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణం విషయం చెప్పింది. బలరామకృష్ణులు భగవంతులై ఉండి కూడా మనుష్య భావంతో దుఃఖించారు. బలరామ, సత్యభామలతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయపడ మని కోరాడు. అప్పుడు, శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు