పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దావాగ్ని తాగుట

  •  
  •  
  •  

10.1-748-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధుజనంబుచేత నిటు ప్రార్థితుఁడై హరి విశ్వరూపు “డో
బంధువులార! మీ నయనపంకజముల్ ముకుళింపుఁ డగ్నినీ
సంధి నడంతు నే” ననినఁ క్కన వారలు నట్ల చేయుఁడున్,
బంధురదావపావకముఁ ట్టి ముఖంబునఁ ద్రావె లీలతోన్.

టీకా:

బంధు = చుట్టముల; జనంబు = సమూహము; చేత = చేత; ఇటున్ = ఇలా; ప్రార్థితుడు = వేడుకొనబడినవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; విశ్వరూపుడు = కృష్ణుడు {విశ్వరూపుడు - సమస్తమైన విశ్వము తన రూపమైన వాడు, విరాట్ పురుషుడు, విష్ణువు}; ఓ = ఓ; బంధువులారా = ఓహో చుట్టములు; మీ = మీ యొక్క; నయన = కన్నులు అనెడి; పంకజముల్ = పద్మములను; ముకుళింపుడు = మూయుడు; అగ్ని = కార్చిచ్చును; ఈ = ఈ; సంధిన్ = లోపున; అడంతున్ = అణచివేసెదను; నేను = నేను; అనినన్ = అని చెప్పగా; చక్కనన్ = చక్కగా; వారలు = వారు; అట్ల = అలానే; చేయుడున్ = చేయగా; బంధుర = ఆవరించినట్టి; దావపావకమున్ = కార్చిచ్చును; పట్టి = పట్టుకొని; ముఖంబునన్ = నోటితో; త్రావెన్ = తాగెను; లీల = ఒక విలాసము; తోన్ = తోటి.

భావము:

గోపకులూ బంధువులూ ఇట్లా వేడుకోగా విశ్వరూపు డైన శ్రీకృష్ణుడు వారితో “బంధుమిత్రులారా! మీరు కళ్ళు మూసుకోండి. ఇంతలో నేను అగ్గిని అణచేస్తాను” అన్నాడు. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. వెంటనే కృష్ణుడు దారుణ మైన దావానలాన్నిఅలవోకగా నోటిలోకి పీల్చుకుని త్రాగేశాడు.