పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట

  •  
  •  
  •  

10.1-558-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో
డువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై
డఁగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
డుపులోనిదె గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్?

టీకా:

కడుపు = గర్భము; లోపలన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; పాపడు = శిశువు; కాలన్ = కాలితో; తన్నినన్ = తన్నినప్పటికిని; కిన్క = కోపముతో; తోన్ = తోటి; అడువబోలునే = అణచివేయవచ్చా; క్రాగి = మండిపడి; తల్లి = మాతృమూర్తి; కిన్ = కి; నాథ = ప్రభువా; సన్నము = చిన్నది; దొడ్డు = పెద్దది; ఐ = అనబడుతు; అడగి = ఒకదానికొకటి అణగి; కారణకార్యరూపము = కార్యకారణ సంబంధమే {కార్యకారణ సంబంధము - సృష్టిలో కార్యము కారణములకు అవినాభావ (విడదీయరాని) సంబంధము కలదు అన్నది ప్రమాణము}; రూపమున్ = స్వరూపముగా గలది; ఐన = అయినట్టి; ఈ = ఈ; సకలంబున్ = సమస్తము; నీ = నీ; కడుపు = గర్భము, అంతర్భాగము; లోనిదె = లోపలిదే; కాదె = కదా; పాపడన్ = శిశువును (గర్భంలోని); కాక = కాకపోతే; నేన్ = నేను; మఱి = ఇక; ఎవ్వడన్ = ఎవరిని.

భావము:

ఓ కృష్ణ ప్రభూ! కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధపెట్టినా తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము, స్థూలము, అయి కారణరూపము కార్యరూపము అయిన ఈసృష్టి సమస్తం నీ కడుపులోనిదే కదా. మరి నేను నీ పాపడనుకాక మరెవ్వడను?