పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : చల్దులు గుడుచుట

  •  
  •  
  •  

10.1-455-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నొక్కనాఁడు రామకృష్ణులు కాంతారంబున బంతిచల్దులు గుడువ నుద్యోగించి ప్రొద్దున లేచి, గ్రద్దనం దమ యింటి లేఁగకదుపులం గదలించి, సురంగంబులగు శృంగంబులు పూరించిన విని, మేలుకని, సంరంభంబున గోపడింభకులు చలిది కావడులు మూఁపున వహించి, సజ్జంబులగు కజ్జంబులు గట్టుకొని పదత్రాణ వేత్రదండంధరులయి, లెక్కకు వెక్కసంబైన తమతమ క్రేపుకదుపులం జప్పుడించి రొప్పుకొనుచు, గాననంబు జొచ్చి, కాంచనమణి పుంజగుంజాది భూషణ భూషితులయ్యును, ఫల కుసుమ కోరక పల్లవ వల్లరులు తొడవులుగా నిడుకొని, కొమ్ములి మ్ముగఁ బూరించుచు వేణువు లూఁదుచుఁ, దుమ్మెదలం గూడి పాడుచు, మయూరంబులతోడం గూడి యాడుచుఁ, బికంబులం గలసి కూయుచు, శుకంబులం జేరి రొదలు జేయుచుఁ, బులుగుల నీడలం బాఱుచుఁ, బొదరిండ్లం దూఱుచు సరాళంబులగు వాఁగులు గడచుచు, మరాళంబుల చెంత నడచుచు, బకమ్ములం గని నిలుచుచు, సారసంబులం జోపి యలంచుచు, నదీజలంబులం దోఁగుచుఁ, దీగె యుయ్యెలల నూఁగుచు, బల్లంబులం డాఁగుచు, దూరంబుల కేగుచుఁ, గపుల సంగడిఁ దరువులెక్కుచు ఫలంబులు మెక్కుచు రసంబులకుంజొక్కుచు నింగికి న్నిక్కుచు నీడలు చూచి నవ్వుచుఁ, గయ్యంబులకుం గాలుదువ్వుచు, చెలంగుచు, మెలంగుచు, వ్రాలుచు, సోలుచు బహుప్రకారంబుల శరీర వికారంబులు జేయుచు మఱియును.

టీకా:

అంతన్ = అటుపిమ్మట; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణులు; కాంతారంబునన్ = అడవిలో; బంతి = సామూహిక; చల్దులు = చద్దితినుటలు; కుడువన్ = తినవలెనని; ఉద్యోగించి = అనుకొని; ప్రొద్దునన్ = ఉదయమే; లేచి = నిద్రలేచి; క్రద్దనన్ = శ్రీఘ్రముగా; తమ = వారి; ఇంటి = ఇంటికి చెందిన; లేగ = ఆవుదూడల; కదుపులన్ = గుంపులను; కదలించి = వెడలదోలి; సురంగంబులు = మనోహరము లైనవి, సొరంగము వంటివి; అగు = ఐన; శృంగంబులున్ = కొమ్ముబూరాలను; పూరించినన్ = ఊదగా; విని = విని; మేలుకని = నిద్రలు లేచి; సంరంభంబునన్ = సంబరముగా; గోప = యాదవుల; డింభకులు = పిల్లలు; చలిది = చద్ది; కావిడులున్ = కావిళ్ళను {కావిడి - రెండు కొసలలోను వస్తువు లుంచుకొనెడి చిక్కములు కల భుజమున మోపుకొన వీలగు అడ్డకఱ్ఱ ఉండే పరికరము}; మూపునన = భుజము లందు; వహించి = ధరించి; సజ్జంబులు = మంచి రుచి గలవి; అగు = ఐన; కజ్జంబులు = భక్ష్యములను; కట్టుకొని = కట్టలు కట్టుకొని; పదత్రాణ = చెప్పులు; వేత్రదండ = బెత్తములు; ధరులు = ధరించినవారు; అయి = ఐ; లెక్క = లెక్కపెట్టుట; కున్ = కు; వెక్కసంబు = వీలుకానివి; ఐన = అయిన; తమతమ = వారివారి; క్రేపు = ఆవుదూడల; కదుపులన్ = గుంపులను; చప్పుడించి = అరచుచు; రొప్పుకొనుచు = తోలుకొనుచు; కాననంబున్ = అడవిని; చొచ్చి = చేరి; కాంచన = బంగారు; మణి = రత్నాల; పుంజ = సమూహముల; గుంజ = గురువింద; ఆది = మున్నగువాని; భూషణ = ఆభరణములచే; భూషితులు = అలంకరింపబడినవారు; అయ్యును = అయినప్పటికిని; ఫల = పళ్ళు; కుసుమ = పూలు; కోరక = మొగ్గలు; పల్లవ = చిగుళ్ళు; వల్లరులు = గుత్తులను; తొడవులు = అలంకారములు; కాన్ = అగునట్లు; ఇడుకొని = పెట్టుకొని; కొమ్ములు = కొమ్ముబూరాలను; ఇమ్ముగా = గట్టిగా; పూరించుచున్ = ఊదుతూ; వేణువులున్ = పిల్లనగ్రోవులను; ఊదుచున్ = ఊదుతూ; తుమ్మెదలన్ = తుమ్మెదలతో; కూడి = పాటు; పాడుచున్ = పాడుతు; మయూరంబుల్ = నెమళ్ళ; తోడన్ = తోటి; కూడి = కలిసి; ఆడుచున్ = నాట్యములాడుతూ; పికంబులన్ = కోయలలతో; కలసి = కూడి; కూయుచు = కూయచు; శుకంబులన్ = చిలుకలతో; చేరి = పాటు; రొదలుజేయుచు = అరచుచు; పులుగుల = (ఎగురుతున్న) పక్షుల; నీడలన్ = నీడలతోపాటు; పాఱుచున్ = పరుగెడుతు; పొదరిండ్ల = పొదరిళ్ళలో; దూఱుచున్ = చొరబడుతూ; సరాళంబులు = దారాళమైనవి, తిన్ననివి; అగు = ఐన; వాగులున్ = ఏరులను; కడచుచున్ = దాటుతూ; మరాళంబుల = హంసల; చెంతన్ = పక్కలను; నడచుచున్ = నడుస్తూ; బకమ్ములన్ = కొంగలను; కని = చూసి; నిలుచుచున్ = నిలబడుతు; సారసంబులన్ = బెగ్గురుపక్షులను; జోపి = తరమి; అలంచుచు = బెదరించుచు; నదీ = ఏరులలోని; జలంబులన్ = నీటిలో; తోగుచున్ = మునుగుతూ; తీగె = లతల; ఉయ్యెలలన్ = ఉయ్యాల లందు; ఊగుచున్ = ఊగుతూ; పల్లంబులన్ = గోతులలో; డాగుచున్ = దాగికొనుచు; దూరంబులు = ఎక్కువ దూరములు; ఏగుచున్ = వెళ్ళుతు; కపుల = కోతుల; సంగడిన్ = తోపాటు; తరువులు = చెట్లు; ఎక్కుచున్ = ఎక్కుతు; ఫలంబులున్ = పళ్ళు; మెక్కుచు = ఎక్కువగా తినుచు; రసంబులు = రుచుల; కున్ = కు; చొక్కుచున్ = పరవశించిపోతూ; నింగి = ఆకాశమున; కున్ = కు; నిక్కుచు = గెంతుతు; నీడలున్ = నీడలను; చూచి = చూసి; నవ్వుచున్ = నవ్వుతు; కయ్యంబులు = కలహముల; కున్ = కు; కాలుదువ్వుచు = ఉరుకుచు; చెలంగుచున్ = చెలరేగిపోతూ; మెలంగుచున్ = తిరుగుతూ; వ్రాలుచు = వంగుతూ; సోలుచున్ = తూగుతూ; బహు = అనేక; ప్రకారంబులన్ = రీతుల; శరీర = అవయవములు; వికారంబులున్ = తిప్పుటలు; చేయుచున్ = చేస్తూ; మఱియును = అంతేకాకుండా.

భావము:

ఒకరోజు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబ తమ ఇంటి లేగదూడలను బయటకి తొలుకుని వచ్చారు. అందమైన కొమ్మూబూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులు అందరూ మేల్కొన్నారు. చల్దిఅన్నం కావడులను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు చేతికి కఱ్ఱలు ధరించారు. లెక్కపెట్టడానికికూడా కష్టం అనిపించే తమతమ లేగల మందలను “హెహెయ్” అనే కేకలతో తోలుకుంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్నా పూలను చివుళ్ళను చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. కొమ్ముబూరాలు పూరిస్తూ; పిల్లనగ్రోవులు ఊదుతూ; తుమ్మెదల తోపాటు ఝమ్మని పాడుతూ; నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ; కోకిలలను మిగిలిన పక్షులను అనుకరిస్తూ; చిలుకల తోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు; పైన పక్షులు ఎగురుతుంటే వాటి నీడల తోపాటు తామూ పరిగెత్తారు; జలజలపారే సెలయేళ్ళను చెంగున దూకారు; హంసలను అనుసరిస్తూ వెళ్ళారు; కొంగల తోపాటు ఒంటికాలిపై నిలపడ్డారు; బెగ్గురు పక్షులను తరమితరిమి కొట్టారు; గోతులలో దాక్కున్నారు; తీగల ఊయలు లూగేరు; దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు; కోతులతో చెట్లు ఎక్కారు; పండ్లుతిని వాటి రసాలకు పరవశించిపోయారు; కుప్పించి దూకి తమ నీడలను చూసి నవ్వుకున్నారు; ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు; అలా కేరింతలు కొడుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నారు.