పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1781-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుండై, విడువంబడి తన విరూపభావంబునకు నెరియుచు "హరిం గెలిచికాని కుండినపురంబుఁ జొర" నని ప్రతిజ్ఞ చేసి, తత్సమీపంబున నుండె; నివ్విధంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బలభద్రుని = బలరాముని; చేతన్ = చేత; తెలుపంబడి = జ్ఞానము కలుగజేయబడి; రుక్మిణీదేవి = రుక్మిణి; దుఃఖంబున్ = దుఃఖమును; మాని = విడిచి; ఉండెన్ = ఉండెను; అట = అక్కడ; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; ప్రాణ = ప్రాణములు మాత్రము; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐ = అయ్యి; విడువంబడి = బంధవిముక్తుడై; తన = అతని; విరూపభావంబున్ = రూపవికారత్వమున; కున్ = కు; ఎరియుచున్ = తపించుచు; హరిన్ = కృష్ణుని; గెలిచి = జయించి; కాని = కాని; కుండినపురంబున్ = కుండిననగరమును; చొరను = ప్రవేశించను; అని = అని; ప్రతిజ్ఞ = శపథము; చేసి = చేసి; తత్ = దాని; సమీపంబునన్ = దగ్గరలో; ఉండెన్ = ఉండెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగ.

భావము:

ఇలా బలరామునిచేత ప్రబోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.