పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1779-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధం బయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదులందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుంబోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబు లందు ననుభవము నొందుచుండుఁ; గావున.

టీకా:

వినుము = శ్రద్ధగా వినుము; దైవమాయన్ = వైష్ణవమాయ {మాయ - భ్రమకారకము}; చేసి = వలన; దేహాభిమానులు = శరీరాభిమానులు {దేహాభిమానులు - దేహమే తానను అభిమానము కలవారు}; ఐన = అయిన; మానవుల్ = మనుషుల; కున్ = కు; పగవాడు = శత్రువు; బంధుండు = మిత్రుడు; ఉదాసీనుడు = సంబంధములేనివాడు; అను = అనెడి; భేదంబు = తేడా; మోహంబునన్ = మాయామోహమువలన; సిద్ధంబు = తప్పక కలుగునవి; అయి = ఐ; ఉండున్ = ఉండును; జల = నీళ్ళు (అద్దము); ఆదుల = మున్నగువాని; అందున్ = లో; చంద్ర = చంద్రబింబము; సూర్య = సూర్యబింబము; ఆదులున్ = మున్నగునవి; ఘటా = కుండ; ఆదులున్ = మున్నగువాని; అందున్ = లో; గగనంబును = ఆకాశము; పెక్కులు = అనేకములు; ఐ = అయి; కానంబడు = కనబడెడు; భంగిన్ = విధముగ; దేహధారుల్ = సకలజీవుల {దేహధారులు - శరీరముధరించి ఉండువారు, జీవులు}; కున్ = కు; అందఱ = అందరి; కున్ = కి; ఆత్మ = పరమాత్మ {పరమాత్మ - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ}; ఒక్కండు = ఒక్కడే; అయ్యున్ = అయినప్పటికి; పెక్కండ్రు = అనేకులు; ఐ = అయినట్లు; తోచున్ = అనిపించును; ఆద్యంతంబులు = జన్మనాశనములు; కల = ఉన్నట్టి; ఈ = ఈ యొక్క; దేహంబు = శరీరము; ద్రవ్య = నవద్రవ్యములు {నవద్రవ్యములు - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; ప్రాణ = పంచప్రాణములును {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; గుణ = పంచభూతగుణములు {పంచభూతగుణములు - శబ్దాది, 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ఆత్మకంబు = స్వరూపమునకలది; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; అందున్ = అందు; అవిద్య = అజ్ఞానము; చేతన్ = వలన; కల్పితంబు = లేనివి కలుగజేయబడినవి; ఐ = అయ్యి; దేహిని = జీవుని; సంసారంబునన్ = సంసారమునందు; త్రిప్పున్ = తిప్పుచుండును; సూర్యుండు = సూర్యుడు; తటస్థుండు = సాక్షి {తటస్థుడు - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి}; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ప్రకాశమానంబులు = కనబడునవి; ఐన = అయినట్టి; దృష్టి = నేత్రములు; రూపంబులున్ = ఆకృతులను; బోలెన్ = వలె; ఆత్మ = పరమాత్మ; తటస్థుండు = సాక్షీభూతుడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; దేహ = దేహములు {దేహములు - స్థూల సూక్ష్మ కారణ దేహములు}; ఇంద్రియంబులు = చతుర్దశేంద్రియములు {చతుర్దశేంద్రియములు - ఙ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మరియు అంతఃకరణ చతుష్టయము (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) నాలుగు}; ప్రకాశమానంబులు = తెలియబడునవి; అగున్ = అగును; ఆత్మ = పరమాత్మ; కున్ = కు; వేఱొక్కటి = మరియొక దాని; తోడన్ = తోటి; సంయోగ = కూడుట; వియోగంబులు = ఎడబాయుటలు; లేవు = కలుగవు; వృద్ధి = పెరుగుట; క్షయంబులున్ = తరుగుటలు; చంద్రకళలు = షోడశచంద్రకళల {షోడశచంద్రకళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; కున్ = కు; కాని = తప్పించి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; లేని = లేనట్టి; కైవడిన్ = విధముగ; జన్మ = ఆది; నాశంబులు = అంతములు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; కాని = తప్పించి; ఆత్మ = పరమాత్మ; కలుగన్ = కలుగ; నేరవు = చాలవు; నిద్రపోయినవాడు = నిద్రించినవాడు; ఆత్మను = తనయందు; విషయ = ఇంద్రియార్థముల; ఫల = మేలుకీడుల; అనుభవంబులున్ = భోగములను; చేయించు = కలిగించు; తెఱంగునన్ = విధముగ; ఎఱుక = ఆత్మజ్ఞానము; లేనివాడు = లేనివాడు; నిజము = సత్యము; కాని = కానట్టి; అర్థంబుల్ = విషయముల; అందున్ = లో; అనుభవమున్ = అనుభవమును; ఒందుచుండున్ = పొందుచుండును; కావున = కనుక.

భావము:

రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ధి కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారు లందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణా లైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత.