పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మి యనువాని భంగంబు

  •  
  •  
  •  

10.1-1766-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ?-
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి?-
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; ర్యాదయును లేదు-
మాయఁ గైకొని కాని లయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు-
సుధీశుఁడవు గావు వావి లేదు;

10.1-1766.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
ర్వ మెల్లఁ గొందుఁ లహమందు."

టీకా:

మా = మాతో; సరివాడవా = సమానుడవా; మా = మా యొక్క; పాపన్ = బాలికను; కొనిపోవన్ = తీసుకుపోవుటకు; ఏపాటి = ఏమాత్రము; కలవాడవు = అర్హతలు కలవాడవు; ఏది = ఏది; వంశము = నీ వంశము; ఎందున్ = ఎక్కడ; జన్మించితివి = పుట్టితివి; ఎక్కడ = ఎక్కడ; పెరిగితివి = పెద్దవాడవైతివి; ఎయ్యది = ఎలాంటి; నడవడిన్ = నడవడికలవాడవు; ఎవ్వడు = ఎవరు; ఎఱుగున్ = తెలియును; మాన = శీలము; హీనుడవు = లేనివాడవు; ఈవు = నీవు; మర్యాదయును = గౌరవముకూడ; లేదు = లేనివాడవు; మాయన్ = మాయమార్గములు; కైకొని = చేపట్టి; కాని = తప్పించి; మలయన్ = సంచరింప; రావు = చాలవు; నిజ = స్వ; రూపమునన్ = స్వరూపముతో; శత్రు = శత్రువుల; నివహంబు = సమూహము; పైన్ = మీదికి; పోవు = యుద్ధమునకు వెళ్ళవు; వసుధీశుడవు = రాజువు; కావు = కావు; వావి = బంధుత్వము, పద్ధతి; లేదు = లేదు.
కొమ్మన్ = ఇంతిని; ఇమ్ము = ఇచ్చివేయుము; నీవు = నీవు; గుణ = సుగుణములు; రహితుండవు = లేనివాడవు; విడువు = వదలిపెట్టుము; విడువవేని = వదలిపెట్టనిచో; విలయకాల = ప్రళయకాలపు; శిఖి = అగ్ని; శిఖా = మంటలకు; సమాన = సమానమైన; శిత = తీక్ష్ణమైన; శిలీముఖములన్ = బాణములచేత {శిలీముఖము - ఉక్కుముఖములు కల బాణము}; గర్వమున్ = మదము; ఎల్లన్ = సర్వమును; కొందు = అపహరింతును; కలహము = యుద్ధము; అందున్ = లో.

భావము:

నువ్వు మాతో సమానుడవా ఏమిటి (భగవంతుడు కదా మాకన్న అధికుడవు). ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు). వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు). ఎక్కడ పెరిగావు (వికారరహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు). ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు). వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు). అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు). అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”