పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1731-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్.

టీకా:

తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చెలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచెము కూడ; కుడువదు = తినదు; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుకను; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలను మీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.

భావము:

తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చెలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకు వెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.