పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1729-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పోఁ"ను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
"రాఁ" ను;"నింకఁ బోయి హరి మ్మని చీరెడి యిష్టబంధుడున్
"లేఁ" ను;"రుక్మికిం దగవు లే, దిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" ను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.

టీకా:

పోడు = వెళ్ళి ఉండడు; అనున్ = అనును; బ్రాహ్మణుండు = విప్రుడు; యదుపుంగవు = కృష్ణుని {యదుపుంగవుడు - యాదవ వంశస్థులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వీటి = నగరమున; కిన్ = కు; వాసుదేవుడున్ = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; ఇంకన్ = ఇంకను; పోయి = వెళ్ళి; హరిన్ = కృష్ణుని; రమ్ము = రావలసినది; అని = అని; చీరెడు = పిలిచెడు; ఇష్ట = ఆప్తుడైన; బంధుడున్ = మేలుకోరువాడు; లేడు = ఎవడు లేడు; అనున్ = అనును; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి పెద్దన్న}; కిన్ = కి; తగవు = న్యాయము; లేదు = లేదు; ఇటనే = ఇక్కడ; చైద్యున్ = శిశుపాలుని; కిన్ = కి; ఇత్తున్ = ఇస్తాను; అంచున్ = అనుచు; ఉన్నాడు = ఎంచి ఉన్నాడు; అనున్ = అనును; గౌరి = పార్వతీదేవి {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; కిన్ = కి; ఈశ్వరి = పరమేశ్వరి; కిన్ = కి; నా = నా; వలనన్ = ఎడల; కృప = దయ; లేదు = లేదు; నేడు = ఇవాళ; అనున్ = అనును.

భావము:

“మాధవుని ద్వారకకు బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మథనపడుతోంది.