పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ జననంబు

  •  
  •  
  •  

10.1-1687-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం
ను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం
ఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
నుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.

టీకా:

వినుము = వినుము; విదర్భ = విదర్భ అను; దేశమునన్ = దేశమునందు; వీరుడు = యోధుడు; కుండిన = కుండిన పట్టణమునకు; భర్త = రాజు; భీష్మకుండు = భీష్మకుడు; అను = అనెడి; ఒక = ఒక; దొడ్డ = గొప్ప; రాజు = రాజు; కలడు = ఉన్నాడు; అతని = అతని; కిన్ = కి; ఏవురు = ఐదుగురు (5); పుత్రుల్ = కొడుకులు; అగ్రజుడు = పెద్దవాడు {అగ్రజుడు - ముందు పుట్టినవాడు, పెద్దవాడు}; అనయుడు = చెడ్డవాడు; రుక్మినాన్ = రుక్మి అను పేరుతో; పరగున్ = ప్రసిద్ధుడై ఉండెను; అందఱ = అందరిలో; కున్ = కి; కడగొట్టు = కడపటి; చెల్లెలు = చెల్లెలు; ఐ = అయ్యి; మనుజవరేణ్య = రాజా; పుట్టెను = పుట్టెను; ఒక = ఒక; మానిని = స్త్రీ; రుక్మిణినాన్ = రుక్మిణి అనుపేరుతో {రుక్మిణి - రుక్మమస్యాసీతి రుక్మిణి (వ్యుత్పత్తి), సువర్ణి}; ప్రసిద్ధ = ప్రసిద్ధురాలు; ఐ = అయ్యి.

భావము:

“విను. విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.