దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీకల్యాణ కథారంభము
- ఉపకరణాలు:
ఆ వనజగర్భు పంపున
రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్
రేవతి యనియెడు కన్యను
భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్.
టీకా:
ఆ = ఆ ప్రసిద్ధుడైన; వనజగర్భు = బ్రహ్మదేవుని; పంపునన్ = ఆజ్ఞచేత; రైవతుడు = రైవతుడు; అను = అనెడి; రాజున్ = రాజు; తెచ్చి = తీసుకొని వచ్చి; రామున్ = బలరాముని; కిన్ = కి; ఇచ్చెన్ = భార్యగా ఇచ్చెను; రేవతి = రేవతి; అనియెడి = అనెడి; కన్యను = అవివాహితను; భూవర = రాజా; మును = ఇంతకు ముందు; వింటి = విన్నావు; కాదె = కదా; బుద్ధిన్ = మనసునకు; తెలియన్ = తెలియునట్లుగా.
భావము:
శుకుడు “పరీక్షిన్మహారాజా! పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకొని వచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం.
- ఉపకరణాలు:
తదనంతరంబ.
టీకా:
తదనంతరంబ = ఆ తరువాత.
భావము:
అలా రేవతీ బలరాముల వివాహం జరిగిన తరువాత
- ఉపకరణాలు:
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
టీకా:
ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజులను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షము నందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మొదలగువారిని; గెల్చి = జయించి; భద్రగుడు = శుభమును పొందువాడు; ఐ = అయ్యి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; వరించెన్ = వివాహమాడెను; భీష్మక = భీష్మకుని యొక్క; సుతన్ = కుమార్తెను; రాజీవ = పద్మములవంటి; గంధిన్ = సువాసన కలామెను; రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి - షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశ = అంశతో; భవన్ = పుట్టిన ఆమెను; మహా = గొప్ప; గుణ = సుగుణము లనెడి {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; మణిన్ = రత్నములు కలామెను; బాలా = కన్యక లందు; మణిన్ = శ్రేష్ఠురాలను; రుక్మిణిన్ = రుక్మిణిని.
భావము:
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించి నట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజు లందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.
- ఉపకరణాలు:
అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; నదియునుం గాక.
^ అష్టవిధ వివాహములు
టీకా:
అనినన్ = అనగా; రాజు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మున్ను = ఇంతకు ముందు; రాక్షస = రాక్షసము అనెడి {రాక్షసము - బలాత్కారమున కన్యను అపహరించి వివాహమాడు పద్ధతి}; వివాహంబునన్ = వివాహ పద్ధతిని {అష్టవిధవివాహములు - 1బ్రాహ్మము 2దైవము 3ఆర్షము 4ప్రాజాపత్యము 5ఆసురము 6గాంధర్వము 7రాక్షసము 8పైశాచము}; స్వయంవరంబున్ = స్వయంవరమున {స్వయంవరము - క్షత్రియ కన్య ఇష్టానుసారము భర్తను ఎంచుకొని వరించుట}; కున్ = కు; వచ్చిన = వచ్చినట్టి; హరి = కృష్ణుడు; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనిపోయెన్ = తీసుకొనివెళ్ళెను; అని = అని; పలికితివి = చెప్పితివి; కృష్ణుండు = కృష్ణుడు; ఒక్కరుండున్ = ఒక్కడు; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మున్నగువారిని; జయించి = గెల్చి; తన = తన యొక్క; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:
అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. .
- ఉపకరణాలు:
కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై
కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.
టీకా:
కల్యాణాత్మకము = శుభములు కలది; ఐన = అయిన; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; కథలున్ = కథలను; ఆకర్ణించుచున్ = వినుచు; ముక్త = విడువబడిన; వైకల్యుండు = వికలత్వము కలవాడు; ఎవ్వడు = ఎవరు మాత్రము; తృప్తుడు = తృప్తిచెందినవాడు; ఔన్ = అగును; అవి = వాటిని; వినంగన్ = వినుచుండగా; క్రొత్తలు = అపూర్వమైనవిగా; ఔచుండున్ = అనిపించును; సాకల్యంబు = సమస్తము; ఏర్పడన్ = విశద మగునట్లు; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుడా; ఎఱుంగన్ = తెలియ; పల్కవే = చెప్పుము; రుక్మణీ = రుక్మిణీ దేవి యొక్క; కల్యాణంబున్ = కల్యాణ కథనమును; వినంగన్ = వినవలెనని; నా = నా; కున్ = కు; మది = మనసు; లోన్ = అందు; కౌతూహలంబు = కుతూహలము కలుగుట; అయ్యెడిన్ = పుట్టుచున్నది.
భావము:
శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. వాటిని విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా. రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.
- ఉపకరణాలు:
భూషణములు చెవులకు బుధ
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."
టీకా:
భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = జ్ఞానులకు; తోషణముల్ = సంతోషమును ఇచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కిలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకరమైన; ఘోషణములు = పలుకులు; గరుడగమను = విష్ణుమూర్తి యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.
భావము:
గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."
- ఉపకరణాలు:
అని రా జడిగిన శుకుం డిట్లనియె.
టీకా:
అని = అని; రాజు = రాజు; అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.