పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ముచికుందుడు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-1666-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు గలిగి, బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుఁ జేరెద” వని వీడ్కొలిపిన హరికిఁ బ్రదక్షింబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్య పశు వృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తం బగు నని తలంచి యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు సంశయంబులు విడిచి, సంగంబులు పరిహరించి విష్ణుని యందుఁ జిత్తంబు చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మఱియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె, నిట్లు ముచికుందుని వీడ్కొని.

టీకా:

నరేంద్రా = రాజా; నీవు = నీవు; తొల్లి = పూర్వము; క్షత్రధర్మంబున = రాజధర్మమునందు; నిలిచి = ఉండి; మృగయావినోదంబుల = వేట లందు; జంతువులన్ = అనేక జంతువులను; వధియించినాడవు = చంపితివి; తపంబునన్ = తపస్సు చేయుట ద్వారా; తత్ = ఆయా; కర్మ = కర్మములనుండి; విముక్తుండవు = విడువబడినవాడవు; ఐ = అయ్యి; తర్వాతి = తరువాత; జన్మంబునన్ = పుట్టుక యందు; సర్వ = ఎల్ల; భూత = జీవుల యందలి; సఖిత్వంబు = మైత్రి; కలిగి = ఉండి; బ్రాహ్మణ = విప్ర; శ్రేష్ఠుండవు = ఉత్తముడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; చేరెదవు = పొందగలవు; అని = అని; వీడ్కొలిపిన = పోవ ననుమతివ్వగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు; వచ్చి = చేసి; నమస్కరించి = నమస్కారము చేసి; గుహన్ = కొండగుహనుండి; వెడలి = బయటకు వచ్చి; సూక్ష్మ = కురచ, పొట్టి; ప్రమాణ = కొలతలు గల; దేహంబుల = దేహముల; తోన్ = తో; ఉన్న = ఉన్నట్టి; మనుష్య = మానవులు; పశు = జంతువులు; వృక్ష = చెట్లు; లత = లతలు; ఆదులన్ = మున్నగువానిని; కని = చూసి; కలియుగంబు = కలియుగము; ప్రాప్తంబగును = వచ్చి ఉండును; అని = అని; తలంచి = ఎంచుకొని; ఉత్తరా = ఉత్తర దిక్కు వైపునకు; అభిముఖుండు = పోవువాడు; ఐ = అయ్యి; తపః = తపస్సు నందు; నిష్ఠుండు = నిష్ఠ కలవాడు; అగుచు = అగుచు; సంశయంబులు = సందేహములు; విడిచి = వదలిపెట్టి; సంగంబులు = బంధాలు; పరిహరించి = తొలగించి; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసును; చేర్చి = లగ్నముచేసి; గంధమాదనంబున్ = గంధమాదనపర్వతము; ప్రవేశించి = ప్రవేశించి; మఱియున్ = తరువాత; నరనారాయణ = నరుడు నారాయణ మునుల; నివాసంబు = ఉనికిపట్టు; ఐన = అయిన; బదరికాశ్రమంబున్ = బదరికాశ్రమమును; చేరి = చేరి; శాంతుడు = శాంతివహించినవాడు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; ఆరాధించుచున్ = పూజించుతు; ఉండెన్ = ఉండెను; ఇట్లు = ఈ విధముగ; ముచికుందుని = ముచికుందుని; వీడ్కొని = పంపించి.

భావము:

ఓ రాజోత్తమా! పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేటమొదలైన వేడుకలతో జంతువులను చంపావు. కనుక, తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు.” అని శ్రీహరి అతనికి సెలవు ఇచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణంచేసి, ప్రణమిల్లి, గుహనుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు పశువులు చెట్లు తీగలు అల్పపరిమాణాలై ఉండడం చూసాడు. కలియుగం రాబోతున్నదని తెలిసికొని, ఉత్తరదిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదలిపెట్టి అన్నిటి యందు ఆసక్తి మాని శ్రీహరి మీద మనసు లగ్నంచేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుండి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై విష్ణుమూర్తిని ఆరాధించసాగాడు.