పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : మాయ మింటనుండి పలుకుట

  •  
  •  
  •  

10.1-153-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పయ్యెదఁ జక్కఁ సవరించుకొనుచుఁ, బలవరించుచు, భ్రాంతిపడి కూఁతున్ గ్రక్కున నక్కునం జక్క హత్తుకొని, చెక్కుచెక్కున మోపి, చయ్యన నుత్తరీయాంచలంబున సంచలతం గప్పి, చప్పుడుగాఁ గుయ్యిడ, నయ్యెడం గ్రయ్యం బడి వాఁడు పోఁడిమి చెడఁ, దోబుట్టువుం దిట్టి, చిట్టిపట్టి నావురని వాపోవఁ, గావరంబున నడుగు లొడిసి తిగిచి, వడిం బెడిసిపడం బుడమిపైం బడవైచిన, న బ్బాలయు నేలంబడక, లీల నెగసి, నవ్య దివ్య మాలికా గంధ బంధుర మణి హారాంబరాద్యలంకార మనోహారిణియు, గదా శంఖ చక్ర పద్మశర చాపాసి శూలధారిణియునై, యెనిమిది కరంబులం గరంబొప్పుచు, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాది వైమానిక నికాయంబు గానికలిచ్చి పొగడ, నెగడుచు, నచ్చరల యాట పాటలకు మెచ్చుచు, మింటనుండి కంటఁబడి, కంటుపడఁ, గంసుని కిట్లనియె.

టీకా:

అని = అని; పయ్యెదన్ = కొంగును; చక్కగన్ = చక్కగా; సవరించుకొనుచున్ = సరిచేసుకొనుచు; పలవరించుచున్ = మొత్తుకొనుచుండగా; భ్రాంతిపడి = కలవరపడిపోయి; కూతున్ = పుత్రికను; గ్రక్కునన్ = తటాలున; అక్కునన్ = రొమ్మునందు; చక్కన్ = చక్కగా; హత్తుకొని = చేర్చిపట్టుకొని; చెక్కు = చెంపకు; చెక్కున = చెంపని; మోపి = ఆన్చి; చక్కనన్ = ఒప్పుగా; ఉత్తరీయాంచలంబున = పైటచెఱగుతో; సంచలతన్ = కంగారును; కప్పి = కప్పిపుచ్చుకొని; చప్పుడుగాన్ = గట్టిగా; కుయ్యిడన్ = రోదించగా; ఆ = ఆ; ఎడన్ = సమయమునందు; క్రయ్యంబడి = కలియబడి; వాడు = అతను; పోడిమి = పద్ధతి; చెడన్ = తప్పి; తోబుట్టువున్ = చెల్లెలిని; తిట్టి = దూషించి; చిట్టి = చిన్ని; పట్టిన్ = పాపను; ఆవురు = ఆ...; అని = అని; వాపోవగన్ = ఏడ్చుచుండగా; కావరంబునన్ = గర్వముతో; అడుగులు = కాళ్ళు; ఒడిసి = ఒడిసిపట్టికొని; తిగిచి = లాగిపెట్టి; వడిన్ = వేగముగా; బెడిసిపడన్ = మిడిసిపాటుతో; పుడమి = నేల; పైన్ = మీదకి; పడవైచినన్ = విసిరికొట్టగా; ఆ = ఆ; బాలయున్ = ఆడపిల్ల; నేలన్ = నేలమీద; పడకన్ = పడిపోకుండ; లీలన్ = అద్భుతముగా; ఎగసి = ఎగిరి; నవ్య = సరికొత్త; దివ్య = దివ్యమైన; మాలికా = పూలమాలలతో; గంధ = సువాసన; బంధుర = తరుచైన; మణి = రత్నాల; హార = దండలు; ఆది = మున్నగు; అలంకార = భూషణములతో; మనోహారిణియున్ = అందమైనది; గదా = గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; పద్మ = పద్మము; శర = బాణములు; చాప = విల్లు; అసి = ఖడ్గము; శూల = శూలము; ధారిణియున్ = ధరించినామె; ఐ = అయ్యి; ఎనిమిది = ఎనిమిది (8); కరంబులన్ = చేతులతో; కరంబున్ = మిక్కిలి; ఒప్పుచున్ = ప్రకాశించుచు; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; కిన్నర = కిన్నరులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; ఆది = మున్నగు; వైమానిక = దేవయోనివిశేషముల {వైమానికులు - విమానము లందు సంచరించువారు, దేవయోని విశేషములు}; నికాయంబు = సమూహములు; కానికలు = బహుమతులు; ఇచ్చి = సమర్పించి; పొగడన్ = స్తోత్రములు చేయుచుండ; నెగడుచున్ = ప్రకాశించుచు; అచ్చరల = అప్సరసల యొక్క; ఆట = నాట్యములు; పాటల = గానముల; కున్ = కు; మెచ్చుచున్ = మెచ్చుకొనుచు; మింటన్ = ఆకాశము; నుండి = నుండి; కంటబడి = కనిపించి; కంటుపడన్ = విరోధించి; కంసున్ = కంసుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతి పడి, విలపిస్తూ, పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, జారిపోతున్న పైట సర్దుకొంటు, పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి, పైటకొంగుతో చటుక్కున పిల్లని కప్పింది. పసిపిల్లేమో గట్టిగా ఏడిచింది. వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు, లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు. కన్నుమిన్ను కానని కావరంతో చిన్నారిపాప కాళ్ళు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడ్చింది. అయినా లెక్కచేయక నేల మీదకి విసిరి కొట్టాడు. కాని పాప నేలమీద పడలేదు. రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతాపుష్పాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది. గద, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే ఎనిమిది ఆయుధాలు ఎనిమిది చేతులలో చక్కగా ధరించి ఉంది. విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్ధులు, చారణులు, కిన్నరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవ గణాలు ఆమెకు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ, ఆకాశంలో కనబడి, కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది.