పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కేశిని సంహారము

  •  
  •  
  •  

10.1-1173-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నిన తన్నునం బడక దానవహంత సమీకరంతయై
న్నులఁ గెంపు పెంపెనయ గ్రక్కున ఘోటనిశాటు పాదముల్
న్నె చెడంగఁ బట్టి పడవైచె ధనుశ్శతమాత్రదూరమున్
న్నగడింభమున్ విసరి పాఱఁగవైచు ఖగేంద్రు కైవడిన్.

టీకా:

తన్నినన్ = కాలితో తన్నగా; తన్నునన్ = తన్నునకు; పడకన్ = దొరకకుండ; దానవహంత = కృష్ణుడు {దానవహంత - రాక్షసులను హతమార్చు వాడు, విష్ణువు}; సమీకరంత = యుద్ధములో క్రీడించు వాడు; ఐ = అయ్యి; కన్నులన్ = కన్నుల యందు; కెంపు = ఎఱ్ఱదనము; పెంపు = పెరుగుట; ఎనయన్ = పొందగా; గ్రక్కునన్ = చటుక్కున; ఘోటనిశాటున్ = గుఱ్ఱపురూపు రాక్షసుని; పాదముల్ = కాళ్ళు; వన్నె = చక్కదనము; చెడంగన్ = నశించునట్లుగ; పట్టి = పట్టుకొని; పడవైచె = విసిరివేసెను; ధనుః = విల్లుపొడుగులు; శత = వంద అంత; మాత్ర = మేర; దూరమున్ = దూరముగా; పన్నగ = పాము; డింభమున్ = పిల్లను; విసరి = విసిరి; పాఱగవైచు = పారవేసెడి; ఖగేంద్రున్ = గరుత్మంతుని {ఖగేంద్రుడు - పక్షులలో శ్రేష్ఠుడు, గరుత్మంతుడు}; కైవడిన్ = వలె.

భావము:

గుఱ్ఱమురక్కసుడు తన్నిన తన్ను తప్పించుకుని, కృష్ణుడు రాక్షసాంతకుడు రణోత్సాహం వహించాడు. కోపంతో గోపాలకృష్ణుడి కళ్ళు జేవురించాయి. వెంటనే తురగాసురుడి పొంగు అణిగేలా చటుక్కున, వాడి కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు పాముపిల్లను విసిరేయునట్లు, వాడిని వంద విల్లులపొడుగంత దూరం పారేశాడు.