పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : దేవకి చేసిన స్తుతి

 •  
 •  
 •  

10.1-126-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ట్టిట్టి దనరానిదై మొదలై నిండు-
కొన్నదై వెలుఁగుచు గుణములేని
దై యొక్క చందంబుదై కలదై నిర్వి-
శేషమై క్రియలేక చెప్పరాని
దేరూపమని శ్రుతు లెప్పుడు నొడివెడి-
యా రూప మగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ ర్థంబు తుది జగం-
బులు నశింపఁగఁ బెద్దభూతగణము

10.1-126.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సూక్ష్మభూతమందుఁ జొరగఁ నా భూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి పోయి
వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మడంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.

టీకా:

అట్టిది = అలాంటిది; ఇట్టిది = ఇలాంటిది; అనన్ = అనుటకు; రాని = వీలుకాని; మొదలు = మూలకారణము; ఐ = అయ్యి; నిండుకొన్నది = అంతటను వ్యాపించినది; ఐ = అయ్యి; వెలుగుచున్ = ప్రకాశించుచు; గుణము = త్రిగుణా; లేనిది = అతీతమైనది; ఐ = అయ్యి; ఒక్కచందంబు = నిర్వికారము కలది {ఒక్కచందము కలది - ఎప్పటికిని ఒకే విధముగా ఉండునది, షడ్భావవికారములు లేనిది}; ఐ = అయ్యి {షడ్వికారములు - 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6చావు}; కలది = శాశ్వతముగ నుండునది; ఐ = అయ్యి; నిర్విశేషము = ఇంద్రియవిషయలు లేనిది; ఐ = అయ్యి; క్రియ = కర్మవాసన గల పనులు; లేక = లేనిదై; చెప్పన్ = నోటితో వివరించుటకు; రానిది = వీలుకానిది; ఏ = ఎట్టి; రూపము = స్వరూపము; అని = అని; శ్రుతులు = వేదములు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నొడివెడి = చెప్పెడి; ఆ = అట్టి; రూపము = స్వరూపము గలది; అగుచున్ = ఔతూ; అధ్యాత్మ = ఆత్మవిషయ జ్ఞానమును; దీపము = ప్రకాశింపజేయునది; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; రెండవయర్థంబు = ద్విపరార్థమున, శ్వేతవరాహాది కల్పములు; తుదిన్ = చివరకు; జగంబులున్ = అఖిల లోకములు; నశింపన్ = లయమైపోగా (మహాప్రళయము); పెద్దభూతగణము = పంచమహాభూతములు {పంచమహాభూతములు - భూజలాగ్ని వాయువ్యాకాశములు}.
సూక్ష్మభూతము = భూతాదియైన అహంకారము; అందున్ = లో; చొరగన్ = లయముకాగా; ఆ = ఆ; భూతంబు = అహంకారము; ప్రకృతి = మహతత్త్వము; లోనన్ = అందు; చొరగన్ = లయముకాగా; ప్రకృతి = ప్రకృతి; పోయి = నశించి; వ్యక్తము = అయవ్యక్తతత్వము; అందున్ = లో; చొరగన్ = లయముకాగా; వ్యక్తము = అయవ్యక్తతత్వము; అడంగును = నశించును; శేష = శేషుడు అనెడి; సంజ్ఞన్ = పేరుతో; నీవున్ = నీవు; చెలువము = ఒప్పువాడవు; అగుదు = అయ్యెదవు.

భావము:

“బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తైన పిమ్మట స్థూలమైన పంచమహాభూతాలు అహంకార మనే సూక్ష్మ భూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమౌతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వం లోనికి లీనమౌతుంది. ఆ వ్యక్తతత్వం కూడ లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అట్టి నీ తత్వం అలాంటిది ఇలాంటిదని వివరించడానికి వీలుకానిది. అదే అన్నిటికి మూలం. అన్నిటా అదే నిండి ప్రకాశిస్తుంటుంది. గుణాలకు అతీతమైనది. ఏకైక తత్త్వంగా నిలబడి ఉంటుంది. అది కాక వేరుగా శేషించినది ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే అది సర్వ క్రియా స్వరూపమైనది. వేదాలు ఆ తత్త్వాన్ని గురించే సర్వత్రా గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠించి, దానికి ఆధారంగా నిలబడే జ్యోతి అది. అది నీవే.