పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రాసక్రీడా వర్ణనము

  •  
  •  
  •  

10.1-1084-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు హరి దర్పించి తన యిరుకెలంకుల నలంకృతలై కళంకరహితచంద్రవదన లిద్దఱు ముద్దియ లుద్దిగొని వీణ లందుకొని వీణలం బ్రవీణలై, సొంపుమెఱసి యింపుగ వాయించుచు నానందలహరీ నిధానంబగు గానంబు చేయ; నవిరళంబై తరళంబుగాని వేడుక సరళంబగు మురళంబు లీలంగేల నందుకొని, మధురంబగు నధరంబునం గదియించి మించి కామినీజన కబరికా సౌగంధిక గంధ బంధుర కరాంగుళీ కిసలయంబులు యతిలయంబులం గూడి వివరంబుగ మురళీవివరంబుల సారించి పూరించుచు; సరిలేని భంగిం ద్రిభంగి యై కమల కర్ణికాకారంబున నడుమ నిలిచి;, మఱియు గోపసుందరు లెంద ఱందఱకు నందఱయి సుందరుల కవలియెడలం దానును దన కవలియెడల సుందరులును దేజరిల్ల; నృత్యవిద్యా మహార్ణవ వేలావలయ వలయితంబై, విస్మితాఖండలంబైన రాసమండలంబుఁ గల్పించి; వేల్పులు హర్షంబునం గుసుమవర్షంబులు గురియ; నందుఁ బ్రసూనమంజరీ సహచరంబు లైన చంచరీకంబుల మించుఁ బ్రకటించుచు; సువర్ణమణి మధ్యగంబు లైన మహేంద్రనీలంబుల తెఱంగు నెఱపుచుఁ; గరణీవిహారబంధురంబులైన సింధురంబుల చెలువుఁ గైకొలుపుచుఁ; బల్లవిత కుసుమిత లతానుకూలంబులైన తమాలంబుల సొబగు నిగుడించుచు; మెఱుపుతీఁగల నెడ నెడం బెడం గడరు నల్లమొగిళ్ళపెల్లు చూపుచుఁ; దరంగిణీ సంగతంబు లైన రోహణాచల శృంగంబుల బాగు లాగించుచు; జగన్మోహనుండై యుండి; రక్తకమలారుణంబులునుఁ, జంద్రశకల నిర్మల నఖర సంస్ఫురణంబులును, శ్రుతినితంబినీ సీమంత వీధికాలంకరణంబులును, సనక సనందనాది యోగీంద్ర మానసాభరణంబులును నైన చరణంబులు గదియనిడి; సమస్థితి నంజలి పుటంబులం బుష్పంబు లుల్లసిల్లఁ జల్లి; సల్లలిత కమలప్రశస్తంబు లైన హస్తంబులు వల్లవీజనుల కంఠంబులపై నిడి; తాను గీతానుసారంబగు విచిత్ర పాదసంచారంబులు సలుపుచు; వర్తులాకార రాసబంధంబుల నర్తనంబునంబ్రవర్తించి; వెండియు వ్రేతలుం దానును శంఖ పద్మ వజ్ర కందుక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ఖురళీ ప్రముఖంబులైన విశేష రాసబంధంబులకుం జొక్కి; యేకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖ మండల త్రిభంగి ప్రముఖంబులైన తానకంబుల నిలుచుచుఁ; గనకకింకిణీ మంజుల మంజీర శింజనంబులు జగజ్జనకర్ణ రంజనంబులై చెలంగ, ఘట్టిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదకర్మభేదంబులు చేయుచు; సమపాద శకటవదన మతల్లి శుక్తి ప్రముఖంబులైన పార్థివచారి విశేషంబులును. నపక్రాంత డోలాపాదసూచీ ప్రముఖంబులైన వ్యోమచారి విశేషంబులం జూపుచు; సురేంద్రశాఖి శాఖామనోహరంబులు, నపహసిత దిక్కరీంద్రకరంబులునుఁ ద్రిలోక క్షేమకరంబులును నగు కరంబులం దిరంబులగు రత్నకటకంబుల మెఱుంగులు నింగి చెఱంగులం దఱచుకొన నర్ధచంద్ర కర్తరీముఖ కపిత్థ కటకాముఖ శుకతుండ లాంగూల పద్మకోశ పతాక ప్రముఖంబులైన స్వస్వభావసూచక నానావిధ కరభావంబు లాచరించుచుఁ’ గటినిబద్ధ సువర్ణవర్ణ చేలాంచల ప్రభానికరంబులు సుకరంబులై దిశాంగనా ముఖంబులకు హరిద్రాలేపన ముద్రాలంకారంబు లొసంగుచు; నాస్కందిత భ్రమర శకటాసన ప్రముఖంబు లైన జానుమండల భేదంబులు, నలాత దండలాత లలిత విచిత్ర ప్రముఖంబులైన దైవమండలంబు లొనర్చుచుఁ; గమనీయ కంబుకంఠాభిరామంబులు, నుద్దామ తేజస్తోమంబులును నైన నీల మౌక్తిక వజ్ర వైఢూర్య దామంబుల రుచు లిందిరాసుందరీ మందిరంబులై సుందరంబులయిన యురంబులం దిరుగుడుపడి కలయంబడ నంగాంతర వాహ్యలకు ఛత్ర ప్రముఖంబులైన భ్రమణ విశేషంబుల విలసించుచు; నిద్దంబులగు చెక్కుటద్దంబుల నుద్దవిడిఁ దద్దయుం బ్రభాజిత చంద్రమండలంబు లగు కుండలంబుల మెఱుంగు మొత్తంబులు నృత్యంబు లొనరింపఁ, గటిభ్రాంత దండరచిత లలాట తిలక మయూర లలిత చక్రమండల నికుంచిత గంగావతరణ ప్రముఖంబులైన కరణంబు లెఱింగించుచు; వెలిదమ్మి విరుల సిరుల చెన్నుమిగులు కన్నులవలని దీనజనదైన్య కర్కశంబులై తనరు కటాక్షదర్శన జాలంబులు జాలంబులై కామినీజన నయనమీనంబుల నావరింప, లలితకుంచిత వికాస ముకుళ ప్రముఖంబు లైన చూడ్కులం దేజరిల్లుచు; ననేక పరిపూర్ణచంద్రసౌభాగ్య సదనంబులగు వదనంబులఁ బ్రసన్నరాగంబులు బ్రకటించుచు; నుదంచిత పింఛమాలికా మయూఖంబు లకాల శక్రచాపంబుల సొంపు సంపాదింప, నికుంచి తాకుంచిత కంపి తాకంపిత పరివాహిత పరావృత్త ప్రముఖంబులైన శిరోభావంబులు నెఱపుచు; మృగనాభి తిలకంబులుగల నిటలఫలకంబులఁ జికుంరబుల నికరంబులు గప్ప, నపరాజిత సూచికావిద్ధపరిచ్ఛిన్న విష్కంభ రేచిత ప్రముఖంబులగు నంగహారంబుల విలసిల్లు చరణ కటి కర కంఠ రేచకంబు లాచరించుచు; నొప్పెడు నప్పు డా రాసంబు సంజనిత సకల జన మానసోల్లాసకరంబై; సుధార్ణవంబునుం బోలె నుజ్జ్వలరసాభిరామంబై; రామరాజ్యంబునుంబోలె రాగపరిపూర్ణంబై; పూర్ణచంద్రమండలంబునుం బోలెఁ గువలయానందంబై; నందనవనంబునుంబోలె భ్రమరవిరాజమానంబై; మానధనుని చిత్తంబునుంబోలెఁ బ్రధానవృత్తి సమర్థంబై; సమర్థకవివిలసనంబునుంబోలె బహుప్రబంధభాసురంబై; సురలోకంబునుంబోలె వసుదేవనందన విశిష్టంబై; శిష్టచరితంబునుంబోలె ధరణీగగనమండలసుందరంబై; సుందరీరత్నంబునుంబోలె నంగహార మనోహరంబై; హరవధూనిలయంబునుంబోలె ననేకచారి సుకుమారంబై; సుకుమార వృత్తంబునుంబోలె నుద్దీపితవంశంబై, యుండె; నందు.
రాసక్రీడా రీతులు

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బహు = అనేక విధములైన; గతులన్ = గమనము లందు; తిరుగన్ = సంచరించుట యందు; నేర్పరి = నేర్పు కలవాడు; అగు = ఐన; హరి = కృష్ణుడు; దర్పించి = విజృంభించి; తన = తన యొక్క; ఇరు = రెండు; కెలంకులన్ = వైపు లందు; అలంకృతలు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; కళంకరహిత = నిర్మలమైన; చంద్ర = చంద్రునివంటి; వదనలు = ముఖములు కలవారు; ఇద్దఱు = ఇద్దరు (2); ముద్దియలు = ముగ్దలు; లుద్దిగొని = యుగళము కట్టి; వీణలన్ = వీణలను; అందుకొని = చేత పూని; వీణలన్ = వీణలను వాయించుటలో; ప్రవీణలు = నేర్పరులు; ఐ = అయ్యి; సొంపు = చక్కదనము; మెఱసి = అతిశయించగా; ఇంపుగా = మనోజ్ఞముగా; వాయించుచును = మీటుచు; ఆనంద = ఆనందపు; లహరీ = పెద్ద అలకు; నిధానంబు = ఉనికిపట్టు; అగు = ఐన; గానంబున్ = పాటను; చేయన్ = పాడగా; అవిరళంబు = ఎడతెగనిది; ఐ = అయ్యి; తరళంబుగాని = స్థిరమైన; వేడుకన్ = కుతూహలముతో; సరళంబు = ఉదారమైన ధ్వని కలది; అగు = ఐన; మురళంబున్ = వేణువును; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతిలోకి; అందుకొని = తీసుకొని; మధురంబు = తియ్యటిది; అగు = ఐన; అధరంబునన్ = పెదవి యందు; కదియించి = చేర్చి; మించి = పెంపు వహించి; కామినీజన = స్త్రీల యొక్క; కబరికా = కొప్పు లందలి; సౌగంధిక = చెంగల్వల; గంధ = సువాసనచే; బంధుర = బహుచక్కనైనట్టి; కర = చేతి; అంగుళీ = వేళ్ళు అనెడి; కిసలయంబులు = చిగుళ్ళు; యతి = యతి {యతి - తాళప్రాణకళావిశేషము, శ్లో. కాలోమార్గక్రియాంగాని గ్రహోజాతిః కళాలయః, యతిః ప్రస్తార ఇత్యతే తాళ ప్రాణాదశ స్మృతాః. (ప్రమాణము), తాళము కాలముల ప్రమాణమునకై నిదానించుట}; లయంబులన్ = లయలతో {లయ - నృత్త గీత వాద్యముల మూడింటి సామ్యము, తాళము యొక్క కాలము}; కూడి = కలిసి; వివరంబుగన్ = విశదముగా; మురళీ = వేణువు యొక్క; వివరంబులన్ = రంధ్రము లందు; సారించి = ప్రసరింపజేసి; పూరించుచు = ఊదుతు; సరిలేని = సాటిలేని; భంగిన్ = భంగిమలో; త్రిభంగి = మువ్వం కల భంగిమ వాడు {త్రిభంగి - మువ్వంకల భంగిమ, మూడు వంకరలు (1కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు వంకర 2తల ఎడమపక్కకు వాల్చుటచేనగు వంకర 3కుడి చేతిని వంచి వేణువు రంధ్రము లందు వేళ్ళూనుట యందలి వంకర అనెడ మూడు వంకరలు) కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ}; ఐ = అయ్యి; కమల = పద్మము; కర్ణిక = బొడ్డు; ఆకారంబునన్ = వలె; నడుమ = మధ్యభాగమున; నిలిచి = నిలబడి; మఱియు = ఇంకను; గోప = గోపికా; సుందరులు = స్త్రీలు; ఎందఱున్ = ఎంతమంది ఉన్నారో; అందఱ = అంతమంది; కున్ = కి; అందఱు = అంతమంది; ఐ = అయ్యి; సుందరుల = అందగత్తెల; కున్ = కు; అవలి = నడుమ, అవలగ్నపు; ఎడలన్ = స్థానము లందు; తానును = అతను; తన = అతని (రెండు రూపుల); కున్ = కి; అవలి = నడుమ; ఎడలన్ = స్థానము లందు; సుందరులును = స్త్రీలు; తేజరిల్ల = ప్రకాశించుచుండగా; నృత్యవిద్యా = నాట్యశాస్త్రము అనెడి; మహార్ణవ = మహాసముద్రపు; వేలావలయ = చెలియలికట్ట వలె; వలయితంబు = చుట్టకోబడినది; ఐ = అయ్యి; విస్మిత = ఆశ్చర్యపరచబడిన; ఆఖండలంబు = ఇంద్రుడు కలది {ఆఖండలుడు - పర్వతములను భేదించిన వాడు, శత్రువులను ఖండించు వాడు, ఇంద్రుడు}; ఐనన్ = అయినట్టి; రాసమండలంబున్ = రాసక్రీడామండలమును {రాసము – జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము}; కల్పించి = ఏర్పరచి; వేల్పులు = దేవతలు; హర్షంబునన్ = సంతోషముతో; కుసుమ = పూల; వర్షంబులున్ = వానలు; కురియన్ = కురిపించగా; అందు = అప్పుడు; ప్రసూన = పూల; మంజరీ = గుత్తులను; సహచరంబులు = కూడి చరించెడివి; ఐనన్ = అయినట్టి; చంచరీకంబుల = తుమ్మెదల; మించున్ = అతిశయమును, శోభను; ప్రకటించుచున్ = కనబరచుచు; సువర్ణ = బంగారపు; మణి = పూసల; మధ్యగంబులు = నడుమ పొదిగినవి; ఐనన్ = అయిన; మహేంద్రనీలంబుల = ఇంద్రనీలముల; తెఱంగున్ = వలె; నెఱపుచున్ = కనబరచుచు; కరణీ = ఆడ యేనుగుల; విహార = విహరించుటలచేత; బంధురంబులు = చక్కటివి; ఐనన్ = అయిన; సింధురంబులన్ = ఏనుగుల; చెలువున్ = అందమును; కైకొలుపుచున్ = పొందుతు; పల్లవిత = చిగురించిన; కుసుమిత = పుష్పించిన; లతా = లతలకు; అనుకూలంబులు = అల్లుకోను అనువైనట్టి; తమాలంబుల = చీకటిమానుల; సొబగు = అందముతో; నిగుడించుచున్ = అతిశయించుచు; మెఱుపుతీగల = మెరుపుల; ఎడనెడల = మధ్యమధ్యన; బెడంగడరు = అందగించుచున్న; నల్ల = నల్లని; మొగిళ్ళ = మబ్బుల; పెల్లు = అతిశయమును; చూపుచున్ = ప్రదర్శించుచు; తరంగిణీ = నదులతో; సంగతంబులు = కూడినవి; ఐనన్ = అయినట్టి; రోహణాచల = రత్నపర్వతము యొక్క; శృగంబులన్ = శిఖరముల; బాగున్ = చక్కదనమును; లాగించుచున్ = గ్రహించుచు; జగత్ = జగత్తునకే; మోహనుండు = మోహము పుట్టించువాడు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; రక్తకమల = ఎఱ్ఱ తామరల వలె; అరుణంబులును = ఎఱ్ఱనివి; చంద్ర = చంద్రుని యొక్క; శకల = ముక్క వలె; నిర్మల = స్వచ్చమైన; నఖర = గోళ్ళచేత; సంస్ఫురణంబులును = చక్కగా కనబడునవి; శ్రుతినితంబినీసీమంతవీధికా = ఉపనిషత్తులకు {శ్రుతి నితంబినీ సీమంత వీధి - వేదములనెడి స్త్రీల పాపిట ప్రదేశములు, ఉపనిషత్తులు}; అలంకరణంబులును = అలంకారములు; సనక = సనకుడు; సనందన = సనందనుడు; ఆది = మొదలగు; యోగి = ఋషులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మానస = మనసులకు; ఆభరణంబులును = అలంకారములు; ఐన = అయినట్టి; చరణంబులు = పాదములను; కదియన్ = దగ్గరగా; ఇడి = పెట్టి; సమస్థితి = చక్కటి విధముగ; అంజలి = దోసిళ్ళ; పుటంబులన్ = పొట్టలతో; పుష్పంబులు = పూలు; ఉల్లసిల్లన్ = మనసు ఆనందిచునట్లు; చల్లి = చల్లి; సల్లలిత = మిక్కిలి మృదువైన; కమల = పద్మములవలె; ప్రశస్తంబులు = శ్రేష్ఠమైనట్టివి; ఐన = అయిన; హస్తంబులున్ = చేతులు; వల్లవీజనుల = గోపికాజనుల; కంఠంబుల = మెడల; పైన్ = మీద; ఇడి = పెట్టి; గీతా = పాటకు; అనుసారంబుగన్ = అనుగుణముగ; విచిత్ర = అద్భుతమైన; పాద = కాళ్ళ; సంచారంబులు = కదలికలు; సలుపుచున్ = చేయుచు; వర్తుల = గుండ్రని; ఆకార = ఆకారము గల; రాసబంధంబులన్ = రాసక్రీడలోని బంధములలో; నర్తనంబు = నృత్యము చేయుటలో; ప్రవర్తించి = మెలగుచు; వెండియున్ = ఇంతేకాక; వ్రేతలున్ = గోపికలు; తానును = అతను; శంఖ = శంఖాకార బంధము {శంఖబంధము - మొదట ఒకరు ఆవల ఇరువురు వారికవతల ముగ్గురునుగా రెండుపక్కల నిలబడి నడుమనుండువారికి హస్త విన్యాసాదులను చూపునట్టిది}; పద్మ = పద్మాకారబంధము {పద్మాకారబంధము - తామరరేకుల వలె పేర్పుగాను వలయాకారముగాను నిలిచి పరస్పర హస్త విన్యాసాదులు చూపునది}; వజ్ర = వజ్రాకారబంధము {వజ్రాకారబంధము - వజ్రాయుధపు అంచుల వలె ఎదురెదురుగాను వాలుగాను నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను కనబరచునది}; కందుక = కందుకబంధము {కందుకబంధము - పూలచెండ్లు ఎగరవేయునట్లు ఎగురుతుగాని పూలచెండ్లను ఎగురవేయుచుగాని హస్త విన్యాసాదులు కనుపింపజేయుట}; చతుర్ముఖ = చతుర్ముఖ బంధము {చతుర్ముఖబంధము - నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది}; చక్రవాళ = చక్రవాళబంధము {చక్రవాళబంధము - తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హాస విన్యాసాదులను చూపునట్టిది}; చతుర్భద్ర = చతుర్భద్రబంధము {చతుర్భద్రబంధము - నాలుగు మూల లందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది}; సౌభద్ర = సౌభద్రబంధము {సౌభద్రబంధము - వారివారికి అనువైన చొప్పున హస్త విన్యాసాదులను చూపునది}; నాగ = నాగబంధము {నాగబంధము - పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది}; నంద్యావర్త = నంద్యావర్తబంధము {నంద్యావర్తబంధము - అరవైనాలుగు అక్షరముల కాలముగల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది}; కుడలీకరణబంధము = కుండలీకరణబంధము {కుండలీకరణబంధము - ఒంటికాలితో నిలిచి చక్రాకారముగ గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాదులను కనబరచునది, కుండలాకారముగ అందరి చేతులు పైకెత్తుకొని లయ తప్పక నటించునది}; ఖురళీబంధము = ఖురళీబంధము {ఖురళీబంధము - (ఖురళి - సాము గారడీలు) చెట్టాపట్టాలు వేసుకున్నట్లు చేతులను కూర్చుకొని గిరగిర తిరుగునది}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయినట్టి; విశేష = విశిష్టములైన; రాస = రాసక్రీడ యందలి; బంధంబుల్ = మండలపు బంధములు; కున్ = కు; చొక్కి = పరవశులై; ఏకపాద = ఏకపాదతానకము {ఏకపాదతానకము - ఒంటికాలితో అడుగులు వేయుట}; సమపాద = సమపాదతానకము {సమపాదతానకము - రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట}; వినివర్తిత = వినివర్తితతానకము {వినివర్తితతానకము - పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట}; గతాగత = గతాగతతానకము {గతాగతతానకము - తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట}; వలిత = వలితతానకము {వలితతానకము - ఇరుపార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహమును వాల్చుచు నటించుట}; వైశాఖ = వైశాఖతానకము {వైశాఖతానకము - కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట}; మండల = మండలతానకము {మండలతానకము - నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట}; త్రిభంగి = త్రిభంగితానకము {త్రిభంగితానకము - మువ్వంకల దేహము వంచి నటనము చేయుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయినట్టి; తానకంబులన్ = నిలబడుటలు యందు; నిలుచుచున్ = ఉండి; కనక = బంగారపు; కింకిణీ = గజ్జెలతో; మంజుల = మనోజ్ఞములైన; మంజీర = అందల యొక్క; శింజనంబులన్ = మ్రోతలు; జగత్ = లోకము నందలి; జన = ప్రజల యొక్క; కర్ణ = చెవులకు; రంజనంబులు = ఇంపుగా ఉండునవి; ఐ = అయ్యి; చెలంగన్ = చెలరేగగా; ఘట్టిత = ఘట్టితపాదకర్మలు {ఘట్టితపాదకర్మలు - రెండు అడుగులను చేరబెట్టుట}; మర్దిత = మర్దితపాదకర్మలు {మర్దితపాదకర్మలు - బంకమన్ను కలియదొక్కునట్లు అడుగులెత్తి వేయుట}; పార్శ్వగ = పార్శ్వగపాదకర్మములు {పార్శ్వగపాదకర్మములు – పార్శ్వము లందు పొందునట్లు బొటనవేలితో నేలరాయుచు అడుగు లుంచుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; పాదకర్మ = కాలితో చేయు చేష్టా; భేదంబులు = విశేషములు; చేయుచున్ = చేస్తూ; సమపాద = సమపాద పార్థివచారము {సమపాద పార్థివచారము - సరిగా అడుగులుంచుచు పోవుట}; శకటవదన = శకటవదనపార్థివచారము {శకటవదనపార్థివచారము - ముందరి వైపున బండిచక్రము వలె కనబడునట్లు పాదములను తిప్పితిప్పి పెట్టుచు పోవుట}; మతల్లి = మతల్లిపార్థివచారము {మతల్లిపార్థివచారము - ప్రతి పర్యాయమున కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తి పెట్టుచు పోవుట}; శుక్తి = శుక్తిపార్థివచారము {శుక్తిపార్థివచారము - అడుగులు వంపుగా బోరగిలం చేర్చి పెట్టుచు పోవుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; పార్థివచారి = నేలమీద సంచారపు; విశేషంబులును = భేదములు; అపక్రాంత = అపక్రాంతవ్యోమాచారి {అపక్రాంతవ్యోమాచారి - కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగులుంచుట}; డోలాపాద = డోలాపాదవ్యోమాచారి {డోలాపాదవ్యోమాచారి - కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగు లుంచుట}; సూచీ = సూచీవ్యోమాచారి {సూచీవ్యోమాచారి - మొనవేళ్ళు నేలను తాకునట్లు మెలగుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; వ్యోమాచారి = గాలిలో కాలుకదుపుటలో; విశేషంబులన్ = భేదములను; చూపుచున్ = కనబరచుచు; సురేంద్రశాఖి = కల్పవృక్షము {సురేంద్రశాఖి - ఇంద్రుని చెట్టు, కల్పవృక్షము}; శాఖా = కొమ్మలవలె; మనోహరంబులును = ఇంపైనవి; అపహసిత = ఎగతాళి చేయబడిన; దిక్కరీంద్ర = దిగ్గజముల; కరంబులును = తొండములు కలవి; త్రిలోక = ముల్లోకములకు; క్షేమకరంబులును = మేలుచేయునవి; అగు = ఐన; కరంబులన్ = చేతులను; తిరంబులు = బాగా గట్టివి; అగు = ఐన; రత్నకటకంబుల = రత్నాలకడియముల; మెఱుంగులు = మెరుపులు; నింగి = ఆకాశమున; చెఱంగులన్ = నలుదిశలు; తఱచుకొనన్ = దట్టముగా వ్యాపించగా; అర్ధచంద్ర = అర్థచంద్రకరభావము {అర్థచంద్రకరభావము - అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది, శ్లో. అర్ధచంద్రకరస్సోయం పతాకేంగుష్ట సారణాత్}; కర్తరీముఖ = కర్తరీముఖకరభావము {కర్తరీముఖకరభావము - కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది, శ్లో.అన్యైవచాపిహస్త తర్జనీచ కనిష్టకా బహిః ప్రసారితేద్వేత్స కరః కర్తరీముఖః}; కపిత్త = కపిత్తకరభావము {కపిత్తకరభావము - వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది, శ్లో. అంగుష్టమూర్ధ్ని శిఖరేవక్రితాయది తర్జనీ, కపిత్థాఖ్యకరస్సోయం తన్నిరూపణముచ్యతే.}; కటకాముఖ = కటకాముఖకరభావము {కటకాముఖకరభావము - వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది, శ్లో. కపిత్థ తర్జనీచోర్ధ్వం మిశ్రితాంగుష్ట మధ్యమా, కటకాముఖహస్తోయం కీర్తితో భరతాదిభిః}; శుకతుండ = శుకతుండకరభావము {శుకతుండకరభావము - చిలుకముక్కు వలె బొటనవేలిని తర్జనీ అనామికలను వంచి పట్టునది, శ్లో. అస్మిన్ననామికా వక్రాశుకతుండకరోభవేత్}; లాంగూల = లాంగూలకరభావము {లాంగూలకరభావము - తోకవలె అనామిక తప్ప తక్కిన వేళ్ళను సగము వంచి ఎడముగలవిగా చేసి అరచేయి పల్లముగా ఏర్పడునట్లు పట్టునది, శ్లో. పద్మకోశేనామికా చేన్నమ్రాలాంగూలకోభవేత్.}; పద్మకోశ = పద్మకోశకరభావము {పద్మకోశకరభావము - తామరమొగ్గవలె ఐదువేళ్ళను కొంచము వంచి ఎడము కలవిగా చేసి అరచేయి పల్లముగ ఏర్పడునట్లు పట్టునది, శ్లో. అంగుళ్యో విరాళాః కించిత్కుంచితాస్త నిమ్నగాః, పద్మకోశాభిధో హస్తస్తన్నిరూపణముచ్యతే.}; పతాక = పతాకకరభావము {పతాకకరభావము - జండావలె బొటకనవేలు తప్ప తక్కినవేళ్ళన్నియు చాచి పట్టునది, శ్లో. అంగుళ్యఃకుంచితైంగుష్టా స్సంశ్లిష్టాః ప్రసృతాయది, సపతాకకరఃప్రోక్తోనృత్యకర్మవిశారదైః.}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; స్వస్వభావ = ఆయా అభిప్రాయములను; సూచక = కనబరచునట్టి; నానావిధ = అనేక రకములైన; కరభావంబుల్ = చేతితో చేయు అభినయములు; ఆచరించుచు = చేయుచు; కటి = మొల యందు; నిబద్ధ = చక్కగా కట్టబడిన; సువర్ణ = బంగారపు; వర్ణ = రంగుగల; చేలా = వస్త్రము యొక్క; అంచల = చెరగుల యొక్క; ప్రభా = కాంతుల; నికరంబులు = సమూహములు; సు = మంచి; కరంబులు = చేతులు; ఐ = అయ్యి; దిశ = దిక్కులు అనెడి; అంగనా = స్త్రీల; ముఖంబులు = మోముల; కున్ = కు; హరిద్రా = పసుపును; లేపన = పూయుట; ముద్రా = అచ్చొత్తుట అనెడి; అలంకారంబులున్ = అలంకారములను; ఒసంగుచున్ = పెట్టుచు; ఆస్కందిత = ఆస్కందితజానువర్తన {ఆస్కందితజానువర్తన - మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట}; భ్రమర = భ్రమరజానువర్తన {భ్రమరజానువర్తన - రెండు మోకాళ్ళను ఒకసారిగా ఎత్తిఎత్తి పెట్టుచు నటించుట}; శకటాసన = శకటాసనజానువర్తన {శకటాసనజానువర్తన - బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట}; ప్రముఖంబులు = మొదలగునవి {శకటాసనజానువర్తన - బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట}; ఐన = అయిన; జానుమండల = మోకాలి వర్తనముల; భోదంబులును = విశేషములు; అలాత = అలాతదైవమండలము {అలాతదైవమండలము - కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికిమీదికి తిప్పుట}; దండలాత = దండలాతదైవమండలము {దండలాతదైవమండలము - బాణాకఱ్ఱ తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట}; లలిత = లలితదైవమండలము {లలితదైవమండలము - చేతులను మీదికి చాచి తిన్నగాను చక్కగాను తిప్పుట}; విచిత్ర = విచిత్రదైవమండలము {విచిత్రదైవమండలము - చేతులను మీదికి చాచి నానావిధములుగాను వింతగాను తిప్పుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; దైవమండలంబులు = దైవమండలములను {దైవమండలము - చేతులను ఆకాశముకేసి చాచి నటించుట}; ఒనర్చుచు = చేయుచు; కమనీయ = చూడచక్కని; కంబు = శంఖమువంటి; కంఠ = కంఠములకు; అభిరామంబులు = చక్కనైనవి; ఉద్దామ = అధికమైన; తేజస్ = తేజస్సుల యొక్క; స్తోమంబులును = సమూహములుకలవి; ఐన = అయిన; నీల = ఇంద్రనీలములు; మౌక్తిక = ముత్యములు; వజ్ర = వజ్రములు; వైఢూర్య = వైఢూర్యముల; దామంబుల = దండల; రుచులు = కాంతులు; ఇందిరాసుందరీ = లక్ష్మీదేవికి; మందిరంబులు = నివాసస్థానములు; ఐ = అయ్యి; సుందరంబులు = అందమైనవి; అయిన = ఐన; ఉరంబులన్ = వక్షస్థలము లందు; తిరుగుడుపడి = చిక్కుకొని; కలయంబడన్ = కలిసిపోగా; అంగాంతర = అంగప్రత్యంగములను; వాహ్యల = వహించునట్టివారి; కున్ = కి; ఛత్ర = గొడుగులు; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; భ్రమణ = విలాస; విశేషంబులన్ = భేదంబులతో; విలసించుచున్ = ప్రకాశించుచు; నిద్దంబులు = మెరుస్తున్నవి; అగు = ఐన; చెక్కుటద్దంబులను = చెక్కిళ్ళను అద్దములను; ఉద్దవిడిన్ = అధికమైన తేజముచేత; దద్దయున్ = మిక్కిలిది యగు; ప్రభా = కాంతులచేత; జిత = జయింపబడిన; చంద్రమండలంబులు = చంద్రమండలములు గలవి; అగు = ఐన; కుండలంబులన్ = చెవికుండలముల; మెఱుంగు = తళతళలు; మొత్తంబులు = సమూహములు; నృత్యంబులు = నాట్యము; ఒనరింపన్ = చేయుచుండగా; కటిభ్రాంత = కటిభ్రాంతకరణము {కటిభ్రాంతకరణము - నడుముమాత్రము కదలించుట}; దండరచిత = దండరచితకరణము {దండరచితకరణము - దేహము కఱ్ఱవలె బిగదీయుట}; లలాటతిలక = లలాటతిలకకరణము {లలాటతిలకకరణము - మొగము చిట్లించుట ద్వారా కనుబొమల వెంట్రుకలు నుదిటిబొట్టువలె కనబడ చేయుట}; మయూరలలిత = మయూరలలితకరణము {మయూరలలితకరణము - నెమలి వలె ఒయ్యారముగా మెడను నిక్కించి కదలించుట}; చక్రమండల = చక్రమండలకరణము {చక్రమండలకరణము - పాదములను కుడియెడమలుగా మార్చి ఉంచుకొని రెండుమోకాళ్ళను కౌగలించుకొనుట}; నికుంచిత = నికుంచితకరణము {నికుంచితకరణము - అవయవములను ముడుచుకొనుట}; గంగావతరణ = గంగావతరణకరణము {గంగావతరణకరణము - ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; కరణంబులన్ = కరణములను; ఎఱిగించుచు = కనబరచుచు; వెలి = తెల్ల; తమ్మి = తామర; విరుల = పూల; సిరులన్ = సౌందర్య సంపదల యొక్క; చెన్ను = అందమును; మిగులు = అతిశయించునట్టి; కన్నుల = కళ్ళ; వలని = చేత; దీన = దీనులైన; జన = వారి; దైన్య = దీనత్వమునకు; కర్కశంబులు = హింసకములు; ఐ = అయ్యి; తనరు = ఒప్పునట్టి; కటాక్ష = కడగంటి; దర్శన = చూపు లనెడి; జాలంబులున్ = సమూహములు; జాలంబులున్ = వలలు; ఐ = అయ్యి; కామినీజన = కామినీజనుల; నయన = కన్ను లనెడి; మీనంబులన్ = చేపలను; ఆవరింపన్ = కమ్ముకొనగా; లలిత = లలితచూడ్కులు {లలితచూడ్కులు - మనోహరభ్రూవిలాసాదులు కల చూపులు}; కుంచిత = కుంచితచూడ్కులు {కుంచితచూడ్కులు - సగము మూయబడిన చూపులు}; వికాస = వికాసచూడ్కులు {వికాసచూడ్కులు - చక్కగా తెరచిన చూపులు}; ముకుళ = ముకుళచూడ్కులు {ముకుళచూడ్కులు - చిట్లించిన చూపులు}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; చూడ్కులన్ = చూపులతో; తేజరిల్లుచున్ = విలసిల్లుతు; అనేక = అనేకమైన; పరిపూర్ణ = పదహారు కళల నిండు; చంద్ర = చంద్రబింబ; సౌభాగ్య = మనోహరత్వమునకు; సదనంబులు = ఉనికిపట్టులు; అగు = ఐన; వదనంబులన్ = ముఖములచే; ప్రసన్నరాగంబులున్ = ఆదర పూర్వక ఆసక్తులను; ప్రకటించుచున్ = కనబరచుచు; ఉదంచిత = మిక్కిలి విప్పారిన; పింఛ = నెమలిపింఛముల; మాలికా = సమూహముల; మయూఖంబుల = కాంతికిరణములచే; అకాల = కాలముగాని కాలపు; శక్రచాపంబుల = ఇంద్రధనుస్సుల; సొంపు = చక్కదనమును; సంపాదింపన్ = కలుగజేయగా; నికుంచిత = నికుంచితశిరోభావాలు {నికుంచితశిరోభావాలు - వంపబడిన శిరస్సు కలవి}; అకుంచిత = అకుంచితశిరోభావాలు {అకుంచితశిరోభావాలు - నిగుడించిన శిరస్సు కలవి}; కంపిత = కంపితశిరోభావాలు {కంపితశిరోభావాలు - కిందమీదలుగా కదలించి శిరస్సులు కలవి}; అకంపిత = అకంపితశిరోభావాలు {అకంపితశిరోభావాలు - సమముగా నిలిపిన శిరస్సులు కలవి}; పరివాహిత = పరివాహితశిరోభావాలు {పరివాహితశిరోభావాలు - ఇరుపక్కలకు చామరములు వీచునట్లు వంచిన శిరస్సులు కలవి}; పరావృత్త = పరావృత్తశిరోభావాలు {పరావృత్తశిరోభావాలు - వెనుకకు తిప్పిన శిరస్సులు కలవి}; ప్రముఖంబులు = మొదలగునవి; ఐన = అయిన; శిరోభావంబులున్ = శిరస్సుచే నటించుటలు; నెఱపుచున్ = చేయుచు; మృగనాభి = కస్తూరి; తిలకంబులు = బొట్లు; కల = ఉన్నట్టి; నిటలఫలకంబులన్ = నుదుర్లపై; చికురంబుల = ముంగురుల; నికరంబులు = సమూహములు; కప్పన్ = ఆవరింపగా; అపరాజిత = అపరాజితాంగహారము {అపరాజితాంగహారము - ఉత్సాహవర్ధక సూచకమును}; సూచికా = సుచికాంగహారము {సుచికాంగహారము - అభిప్రాయమును సూచించునవి}; అవిద్ధ = అవిద్ధ అంగహారము {అవిద్ధ అంగహారము - మనసునందు నాటుటను సూచించునవి}; పరిచ్ఛిన్న = పరిచ్ఛిన్నంగహారము {పరిచ్ఛిన్నంగహారము - భిన్నభావములను సూచించునవి}; విష్కంభ = విష్కంభ అంగహారము {విష్కంభ అంగహారము - విషయమును విరివిగా సూచించునవి}; రేచిత = రేచిత అంగహారము {రేచిత అంగహారము - వేళ్ళ కదలికలతో సూచించునవి}; ప్రముఖంబులు = మొదలగునవి; అగు = ఐన; అంగ = అయయవముల; హారంబులు = కదలికలుచేత; విలసిల్లు = విరాజిల్లెడు; చరణ = పాదములయొక్క; కటి = పిరుదుల యొక్క; కర = చేతుల యొక్క; కంఠ = మెడల యొక్క; రేచకంబులు = కదలికలు; ఆచరించుచు = చేయుచు; ఒప్పెడు = చక్కటి; అప్పుడు = సమయము లందు; ఆ = ఆ యొక్క; రాసంబు = రాసక్రీడ; సంజనిత = చక్కగా కలిగిన; సకల = సమస్తమైన; జన = వారి; మానస = మనసులకు; ఉల్లాస = సంతోషమును; కరంబులు = కలిగించెవి; ఐ = అయ్యి; సుధార్ణవంబునున్ = పాలసముద్రమును; బోలెన్ = వలె; ఉజ్జ్వల = ప్రాకాశించునట్టి; రసా = క్షీరరసముచే, శృంగారరసముచే; అభిరామంబు = మనోజ్ఞము; ఐ = అయ్యి; రామ = శ్రీరామచంద్రుని; రాజ్యంబును = రాజ్యపాలన; బోలెన్ = వలె; రాగ = అనురాగముచే, సంగీతములోని రాగముచే; పరిపూర్ణంబు = బాగా నిండి ఉన్నది; ఐ = అయ్యి; పూర్ణ = పదహారుకళల నిండు; చంద్ర = చంద్ర; మండలంబునున్ = బింబమును; బోలెన్ = వలె; కువలయ = భూమండలమునకు, కలువకు; ఆనందంబు = ఆనందము కలిగించునది; ఐ = అయ్యి; నందనవనంబునున్ = ఇంద్రునివనము; బోలెన్ = వలె; భ్రమర = ముంగురులచే, తుమ్మెదలచే; విరాజమానంబు = ప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; మానధనుని = అభిమానము కలవాని; చిత్తంబునున్ = మనసు; బోలెన్ = వలె; ప్రధాన = ముఖ్య; వృత్తి = వృత్తి యందు; సమర్ధంబు = నైపుణ్యము కలది; ఐ = అయ్యి; సమర్థ = నేర్పు కల; కవి = కవి యొక్క; విలసనంబునున్ = విలాసములను; బోలెన్ = వలె; బహు = అనేకమైన, నానావిధములై; ప్రబంధ = కావ్యములచే, ప్రకృష్టబంధములచేత; భాసురంబు = ప్రకాశించునది; ఐ = అయ్యి; సురలోకంబునున్ = స్వర్గమును; బోలెన్ = వలె; వసుదేవనందన = కృష్ణునిచేత, వసువులు దేవతలు నందనవనాదులచే; విశిష్టంబు = ఉత్తమమైనది; ఐ = అయ్యి; శిష్ట = సజ్జనుల; చరితంబునున్ = ప్రవర్తనల; బోలెన్ = వలె; ధరణీగగన = భూమ్యాకాశముల; మండల = చక్రములలో; సుందరంబు = అందము కలది; ఐ = అయ్యి; సుందరీ = స్త్రీలలో; రత్నంబున్ = శ్రేష్ఠురాలి; బోలెన్ = వలె; అంగహార = అవయవాల కదలికలచే, హారములు కదలికలతో; మనోహరంబు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; హరవధూ = పార్వతీదేవి; నిలయంబునున్ = నివాసస్థానము; బోలెన్ = వలె; అనేక = అనేకుల; చారి = సంచారములచేత; సుకుమారంబు = మృదువైనది; ఐ = అయ్యి; సు = మంచి; కుమార = పుత్రుని; వృత్తంబు = నడవడిక; బోలెన్ = వలె; ఉద్దీపిత = ప్రకాశింప జేయబడిన; వంశంబు = కులము కలది, వేణువు కలది; ఐ = అయ్యి; ఉండెన్ = ఉన్నది; అందు = దానియందు.

భావము:

శ్రీకృష్ణుడు అనేక విధములుగా నటనా గమనములు సంచరించుట యందు మిక్కిలి నేర్పు కలవాడు. అప్పుడు అయన బృందావనంలో విజృంభించి రసక్రీడ ఆరంభిస్తుండగా, తనకు రెండు ప్రక్కలా బాగా అలంకరించుకున్న ఇద్దరు గోపముగ్దలు నిర్మలమైన చంద్రుని వంటి ముఖములు కలవారు చేరారు. వారిద్దరూ యుగళము కట్టి వీణలను వాయించుటలో నేర్పరులు. ఆ జంట గాయనులు బహు చక్కగా, మనోజ్ఞముగా వీణలను చేపట్టి మీటుతూ, ఆనంద రస పరిపూర్ణమైన పాటను ఎత్తుకున్నారు. కృష్ణుడు సాటిలేని త్రిభంగి అనే మువ్వొంకల భంగిమలో నిలబడ్డాడు. దట్టమైన, స్థిరమైన కుతూహలముతో ఉదాత్తమైన ధ్వని కల వేణువును విలాసముగా అందుకున్నాడు. తన తియ్యటి పెదవికి వేణువును చేర్చి గోపికల కొప్పు లందలి చెంగల్వల సువాసనచే బహుచక్కనైన తన గొప్ప చేతి వేళ్ళు అనె చిగుళ్ళుతో, యతి లయలు వివరంగా విశదము అయ్యేలా ఊదసాగాడు. అలా అలవోకగా అందంగా అద్భుతంగా మురళి రంధ్రాలపై నాట్యాలాడుతున్న ఆ వేణుమాధవుడి మునివేళ్ళ నుండి అద్భుతమైన గంధర్వ గానం జాలువారుతోంది. అలా నిలబడిన గోపాలమనోహరుడిని పద్మము బొడ్డు వలె మధ్యభాగమున ఉంచుకుని, మిగతా గోపికా స్త్రీలు అందరూ చుట్టూ గుండ్రంగా చేరి జంటలుజంటలు కట్టి వర్తులాకారంగా తిరుగుతూ చేసే రాసము అనే విశిష్ట నాట్య క్రీడలు మొదలెట్టారు. ఎంతమంది అందగత్తెలు ఉన్నారో అన్ని రూపులూ ధరించి ప్రతి మగువ ప్రక్కన తానే ఉంటూ, ప్రతి ఇద్దరి మధ్యా ఒకనిగా ఉంటూ, తన ప్రతి రెండు రూపుల మధ్య ఒక రమణి ఉండేలా అవతరించి విజృంభించి వారితో కూడి బహురీతుల నటనలు చేస్తున్నాడు. నాట్యశాస్త్రానికి పరాకాష్ఠగా ఉన్న ఆ రాసక్రీడా నటనలు చూడటానికి ఇంద్రుడు వచ్చి ఆకాశంలో సాశ్చర్యంగా తిలకిస్తున్నాడు. దేవతలు సంతోషంతో పూల వానలు కురిపిస్తున్నారు. ఆ రాసము ఎలా ఉందంటే, ఆ బృందావనంలో పూల నడిమిబొడ్డులలో విహరిస్తున్న తుమ్మెదలు అతిశయించిన శోభలతో బంగారు పూసల మధ్య పొదిగిన ఇంద్రనీలాలవలె మెరుస్తున్నాయి అన్నట్లు; ఆడఏనుగులతో విహరించు గజరాజులు అందగిస్తున్నాయి అన్నట్లు; చీకటిమానులు చిగురించిన, పుష్పించిన లతలు అల్లుకొని అందగించి మనోజ్ఞంగా ఉన్నాయి అన్నట్లు; మెరుపుల మధ్యన అందగిస్తున్న నల్లని మబ్బుల అందాలు చిందుతున్నాయి అన్నట్లు. నదులతో కూడిన రత్నపర్వతాల అందాలను మించుతున్నాయి అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. త్రిజగన్మోహనుడైన మురళీమోహనుడి ఎఱ్ఱటి మునివేళ్ళ చివరల చంద్రభాగాల వలె మెరిసిపోతున్న తెల్లని గోరులుతో కూడిన పాదాలు ఎలాంటివి అంటే. ఉపనిషత్తులకు అలంకారములు అయినవి, సనక సనందనాది మహర్షులు మనస్పూర్తిగా దోసిళ్ళతో చక్కగా అందమైన పూలతో పూజించి ఆనందించేవి. అట్టి గొప్ప పాదపద్మాలతో, మిక్కిలి చక్కనైన మృదువైన పద్మాల వంటివి బహు శ్రేష్ఠమైనవి అయిన తన అన్ని రూపుల చేతులను ఆయా గోపికల భుజాలపై పెట్టి, పాటకు అనుగుణంగా అద్భుతంగా అడుగు వేస్తున్నాడు నల్లనయ్య. అలా గోపికల మధ్య తను, తన మధ్య గోపిక ఉంచుకుని వర్తులాకరంలో రాసక్రీడలో వేసే అందమైన బంధములు పడుతూ, అడుగులు వేస్తూ, నాట్యాలు చేస్తున్నాడు. అలా అనేక రకాల బంధాలు, తానకాలతో గోపిక లందరను తనుపుతున్నాడు. ఆ రాసక్రీడలో శంఖబంధము {మొదట ఒకరు ఆవల ఇరువురు వారికవతల ముగ్గురునుగా రెండుపక్కల నిలబడి నడుమ ఉండువారికి హస్త విన్యాసాదులను చూపు నట్టిది}; పద్మాకారబంధము {తామరరేకుల వలె పేర్పుగాను వలయాకారముగాను నిలిచి పరస్పర హస్త విన్యాసాదులు చూపునది}; వజ్రాకారబంధము {వజ్రాయుధపు అంచుల వలె ఎదురెదురుగాను వాలుగాను నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను కనబరచునది}; కందుకబంధము {పూలచెండ్లు ఎగరవేస్తునట్లు ఎగురుతు గాని పూలచెండ్లను ఎగురవేస్తూగాని హస్త విన్యాసాదులు కనుపింప జేయుట}; చతుర్ముఖ బంధము {నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది}; చక్రవాళబంధము {తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హస్య విన్యాసాదులను చూపు నట్టిది}; చతుర్భద్రబంధము {నాలుగు మూల లందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది}; సౌభద్రబంధము {వారి వారికి అనువైన చొప్పున హస్త విన్యాసాదులను చూపునది}; నాగబంధము {పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది}; నంద్యావర్తబంధము {అరవైనాలుగు అక్షరముల కాలము గల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది}; కుండలీకరణబంధము {ఒంటికాలితో నిలిచి చక్రాకారముగ గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాదులను కనబరచునది, కుండలాకారముగ అందరి చేతులు పైకెత్తుకొని లయ తప్పక నటించునది}; ఖురళీబంధము {చెట్టాపట్టాలు వేసుకున్నట్లు చేతులను కూర్చుకొని గిరగిర తిరుగునది} మొదలగు విశిష్ట రాసక్రీడ మండల బంధములకు గోపికలను పరవశులను చేస్తున్నాడు. ఇంకా, ఏకపాదతానకము {ఒంటికాలితో అడుగులు వేయుట}; సమపాదతానకము {రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట}; వినివర్తితతానకము {పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట}; గతాగతతానకము {తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట}; వలితతానకము {ఇరుపార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహమును వాల్చుచు నటించుట}; వైశాఖతానకము {కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట; మండలతానకము {నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట}; త్రిభంగితానకము {మువ్వంకల దేహము వంచి నటనము చేయుట} మొదలగు నిలబడుటలులోని తానకములతో తనుపుతున్నాడు. ఇంకా, బంగారు గజ్జెలు, మనోజ్ఞములైన అందలు యొక్క మ్రోతలు లోకు లందరి చెవులకు ఇంపుగా ఉండేలా చెలరేగే ఘట్టితపాదకర్మలు {రెండు అడుగులను చేరబెట్టుట}; మర్దితపాదకర్మలు {బంకమన్ను కలియదొక్కునట్లు అడుగులెత్తి వేయుట; పార్శ్వగపాదకర్మములు {పార్శ్వములందు పొందునట్లు బొటనవేలితో నేలరాయుచు అడుగు లుంచుట} మొదలగు కాలితో చేసే చేష్టా విశేషములు చేస్తూ ఆనందిస్తున్నారు. ఇంకా, సమపాద పార్థివచారము {సరిగా అడుగు లుంచుచు పోవుట; శకటవదనపార్థివచారము {ముందరి వైపున బండిచక్రము వలె కనబడునట్లు పాదములను తిప్పితిప్పి పెట్టుచు పోవుట; మతల్లిపార్థివచారము {ప్రతి పర్యాయమున కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తి పెట్టుచు పోవుట}; శుక్తిపార్థివచారము {అడుగులు వంపుగా బోరగిలం చేర్చి పెట్టుచు పోవుట} మొదలగు నేలమీద చేసే సంచార భేదములు చూపుతూ. అపక్రాంతవ్యోమాచారి {కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగు లుంచుట}; డోలాపాదవ్యోమాచారి {కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగు లుంచుట}; సూచీవ్యోమాచారి {మొనవేళ్ళు నేలను తాకునట్లు మెలగుట} మొదలగు గాలిలో కాలు కదుపుటలో భేదములను కనబరస్తూ. ఇంకా, కల్పవృక్షము కొమ్మలవలె ఇంపైనవి, దిగ్గజముల తొండములు ఎగతాళి చేసేటంత అందమైనవి, ముల్లోకములకు మేలుచేసేవి ఐన చేతులను, దట్టమైన రత్నాలకడియముల మెరుపులు ఆకాశమున నలుదిశలు దట్టముగా వ్యాపించేలా అర్థచంద్రకరభావము {అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది}; కర్తరీముఖకరభావము {కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది}; కపిత్తకరభావము {వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది}; కటకాముఖకరభావము {వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది}; శుకతుండకరభావము {చిలుకముక్కు వలె బొటనవేలిని తర్జనీ అనామికలను వంచి పట్టునది}; లాంగూలకరభావము {తోకవలె అనామిక తప్ప తక్కిన వేళ్ళను సగము వంచి ఎడము గలవిగా చేసి అరచేయి పల్లముగా ఏర్పడునట్లు పట్టునది}; పద్మకోశకరభావము {తామరమొగ్గవలె ఐదువేళ్ళను కొంచము వంచి ఎడము కలవిగా చేసి అరచేయి పల్లముగ ఏర్పడునట్లు పట్టునది}; పతాకకరభావము {జండావలె బొటకనవేలు తప్ప తక్కిన వేళ్ళన్ని చాచి పట్టునది}; మొదలగు ఆయా అభిప్రాయములను కనబరచునట్టి అనేకరకాల చేతితో చేసే అభినయములు చేస్తూ. ఇంకా, మొల యందు చక్కగా కట్టబడిన బంగారపు రంగు గల వస్త్రము యొక్క చెరగుల యొక్క కాంతుల సమూహములు మంచి చేతులు అయ్యి దిక్కులు అనెడి స్త్రీల మోములకు పసుపును పూయుట అచ్చొత్తుట అనెడి అలంకారములను పెట్టుచు ఆస్కందితజానువర్తన {మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట; భ్రమరజానువర్తన {రెండు మోకాళ్ళను ఒకసారిగా ఎత్తిఎత్తి పెట్టుచు నటించుట}; శకటాసనజానువర్తన {బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట} అనే మోకాలివర్తనముల విశేషములు; అలాతదైవమండలము {కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికి మీదికి తిప్పుట}; దండలాతదైవమండలము {బాణాకఱ్ఱ తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట}; లలితదైవమండలము {చేతులను మీదికి చాచి తిన్నగాను చక్కగాను తిప్పుట}; విచిత్రదైవమండలము {చేతులను మీదికి చాచి నానావిధములుగాను వింతగాను తిప్పుట} మొదలగు దైవమండలములను; {చేతులను ఆకాశముకేసి చాచి నటించుట} చేస్తూ. ఇంకా, అందమైన కంఠము వంటి తమ మెడలలో చక్కటి తేజస్సుతో మెరుస్తున్న ఇంద్రనీలములు, ముత్యములు, వజ్రములు, వైఢూర్యముల దండల కాంతులు లక్ష్మీదేవికి నివాసస్థానములుగా ప్రకాశిస్తున్నాయి. అవి వారి అందమైన వక్షస్థలము లందు చిక్కుకొని కలిసిపోగా అంగప్రత్యంగములను వహించునట్టి గొడుగులు మొదలగునవి విలాసాలలో ప్రతిఫలిస్తూ మెరుస్తున్నాయి. చంద్ర ప్రభల మించి మెరుస్తున్న చెవికుండలముల తళతళలు, చెక్కిటద్దములపై నాట్యము చేస్తుండగా. కటిభ్రాంతకరణము {నడుము మాత్రము కదలించుట}; దండరచితకరణము {దేహము కఱ్ఱవలె బిగదీయుట}; లలాటతిలకకరణము {మొగము చిట్లించుట ద్వారా కనుబొమల వెంట్రుకలు నుదిటిబొట్టువలె కనబడ చేయుట}; మయూరలలితకరణము {నెమలి వలె ఒయ్యారముగా మెడను నిక్కించి కదలించుట}; చక్రమండలకరణము {పాదములను కుడి ఎడమలుగా మార్చి ఉంచుకొని రెండు మోకాళ్ళను కౌగలించుకొనుట}; నికుంచితకరణము {అవయవములను ముడుచుకొనుట}; గంగావతరణకరణము {ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట}; మొదలగు కరణములను కనబరస్తు, ఇంకా, తెల్ల తామర పూల సౌందర్య అతిశయించు కళ్ళతో దీనుల దీనత్వము పోగొట్టునవి, కడగంటి చూపులు వలలు అయ్యి కామినీజనుల కన్నులు అనె చేపలను కమ్ముకొనేవి అయినవి; లలితచూడ్కులు {మనోహరభ్రూవిలాసాదులు కల చూపులు}; కుంచితచూడ్కులు {సగము మూయబడిన చూపులు}; వికాసచూడ్కులు {చక్కగా తెరచిన చూపులు}; ముకుళచూడ్కులు {చిట్లించిన చూపులు} మొదలగు చూపులతో విలసిల్లుతూ. ఇంకా, నిందు పదహారు కళల చంద్రబింబ మనోహరత్వమునకు ఉనికిపట్టులు ఐన ముఖములచే ఆదర పూర్వక ఆసక్తులను కనబరస్తూ; బాగా విప్పారిన నెమలిపింఛముల కాంతికిరణముల వలన కలిగిన అకాల ఇంద్రధనుస్సుల చక్కదనమును కలుగజేస్తూ, నికుంచితశిరోభావాలు {వంపబడిన శిరస్సు కలవి}; అకుంచితశిరోభావాలు {నిగుడించిన శిరస్సు కలవి}; కంపితశిరోభావాలు {కిందమీదలుగా కదలించు శిరస్సులు కలవి}; అకంపితశిరోభావాలు {సమముగా నిలిపిన శిరస్సులు కలవి}; పరివాహితశిరోభావాలు {ఇరుపక్కలకు చామరములు వీచునట్లు వంచిన శిరస్సులు కలవి}; పరావృత్తశిరోభావాలు {వెనుకకు తిప్పిన శిరస్సులు కలవి} మొదలగు శిరస్సులతో చేయు నటనలు చేస్తూ. ఇంకా, నుదుటి మీద కస్తూరి బొట్లు పై ఆవరిస్తున్న ముంగురులతో, అపరాజితాంగహారము {ఉత్సాహవర్ధక సూచకమును}; సూచికాంగహారము {అభిప్రాయమును సూచించునవి}; అవిద్ధ అంగహారము {మనసు నందు నాటుటను సూచించునవి}; పరిచ్ఛిన్నంగహారము {భిన్నభావములను సూచించునవి}; విష్కంభ అంగహారము {విషయమును విరివిగా సూచించునవి}; రేచిత అంగహారము {వేళ్ళ కదలికలతో సూచించునవి} మొదలగు అయయవముల కదలికలుతో విరాజిల్లే పాదముల, పిరుదుల, చేతుల, మెడల కదలికలు చేస్తూ, చక్కటి సమయములో కొనసాగుతోంది ఆ రాసక్రీడ. ఆ రాసక్రీడలు అందరి మనసులకు సంతోషమును కలిగించెవి, పాలసముద్రములా ప్రాకాశించే క్షీరరసముతో, శృంగారరసముతో మనోజ్ఞమైనవి, శ్రీరామచంద్రుని రాజ్యపాలన వలె నిండైన అనురాగము, సంగీతములోని రాగము కలవి, పదహారుకళల నిండు చంద్ర బింబమును వలె భూమండలమునకు, కలువకు ఆనందము కలిగించేవి, ఇంద్రడి వనము వలె భాసించే ముంగురులతో, తుమ్మెదలతో ప్రకాశించేవి, అభిమాని మనసులా ముఖ్య వృత్తి యందు నైపుణ్యము కలవి, కవిశ్రేష్ఠుని విలాసముల వలె రకరకాల కావ్యములతో, ప్రకృష్ట బంధములతో ప్రకాశించేవి, స్వర్గము మాదిరి కృష్ణునిచే, వసువులు దేవతలు నందనవనాదులచే ఉత్తమమైనవి, సజ్జనుల ప్రవర్తనలలా ముల్లోకాలకు అందమైన శ్రేష్ఠురాలైన స్త్రీ వలె అవయవాల హారముల కదలికలతో మనోజ్ఞమైనవి, పార్వతీదేవి నివాస స్థానము వలె ఎందరో మహానుభావుల సంచారములతో, మంచి పుత్రుడి మృదువైన ప్రవర్తన వలె వంశోద్ధారకములు (కులము, వేణువు) కలవి అయ్యి ఉన్నాయి. అలాంటి అత్యద్భుతమైన ఆ రాసక్రీడలలో. . .
ఈ రాసక్రీడాభివర్ణన చాలా చక్కటిది ప్రసిద్ధమైనది. ఈ వచనానికి. . .
(1) పండితశ్రేష్ఠులు పాలకుర్తి నాగేశ్వర్లు శాస్త్రి గారు వివరించిన పాఠం.
(2) తితిదే పోతన భాగవతంలో వివరించి పాఠం ఎత్తి ఉల్లేకించాను వాటిని క్రింది లింకులు వాడి చదవుకొనగలరు:. . .