పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

  •  
  •  
  •  

10.1-968-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పొడమిన నవకుంకుమాంకిత రమా ముఖమండలంబునుం బోలె నఖండంబైన చంద్రమండలంబుం పొడగని పుండరీకనయనుండు యమునాతట వనంబున జగన్మోహనంబుగ నొక్క గీతంబు పాడిన విని, తదాయత్తచిత్తలై తత్తఱంబున వ్రేత లే పనులకుం జేతు లాడకయు, గోవులకుం గ్రేపుల విడువకయు విడిచి విడిచి యీడకయు నీడి యీడియు, నీడినపాలు కాఁపకయుఁ గాఁచి కాఁచియుఁ, గాఁగిన పాలు డింపకయు డించి డించియు, డించినపాలు బాలురకుఁ బోయకయుఁ బోసి పోసియుఁ, బతులకుఁ బరిచర్యలు చేయకయుఁ జేసి చేసియు, నశనంబులు గుడువకయుఁ గుడిచి కుడిచియుఁ, గుసుమంబులు ముడువకయు ముడిచి ముడిచియుఁ, దొడవులు దొడగకయు దొడిగి తొడిగియు, గోష్ఠంబుల పట్టుల నుండకయుఁ, బాయసంబులు నెఱయ వండకయు, నయ్యైయెడల నిలువం బడకయుఁ, గాటుకలు సూటినిడకయుఁ, గురులు చక్కనొత్తకయుఁ, గుచంబుల గంధంబులు కలయ మెత్తకయుఁ, బయ్యెదలు విప్పి కప్పకయు, సఖులకుం జెప్పకయు, సహోదరులు మగలు మామలు మఱందులు బిడ్డలు నడ్డంబుచని నివారింపం దలారింపక సంచలించి, పంచభల్లుని భల్లంబుల మొల్లంపు జల్లుల పెల్లునం దల్లడిల్లి డిల్లపడి, మొగిళ్ళగమి వెలువడి; యుల్లసిల్లు తటిల్లతల పొందున మందగమన లమందగమనంబుల మంద వెలువడి గోవింద సందర్శనంబునకుం జని; రప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పొడమిన = ఉదయించినట్టి; నవ = అప్పుడే పెట్టుకొన్న; కుంకుమ = కుంకుమ చేత; అంకిత = అలంకరింపబడిన; రమా = లక్ష్మీదేవి; ముఖమండలంబును = నుదిటి; బోలె = వలె; అఖండంబు = నిండు కళలు కలది; ఐన = అయిన; చంద్ర = చంద్రుని; మండలంబున్ = బింబమును; పొడగని = చూసి; పుండరీకనయనుండు = కృష్ణుడు {పుండరీకనయనుడు - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; యమునా = యమునానదీ; తట = తీరము నందలి; వనంబునన్ = తోటలో; జగత్ = లోకము లన్నిటికి; మోహనంబుగన్ = మోహము పుట్టించు నట్లు; ఒక్క = ఒకానొక; గీతంబున్ = పాటను; పాడినన్ = పాడగా; విని = విని; తదాయత్త =అప్పుడే అధీన మైన; చిత్తలు = మనసు కలవారు; ఐ = అయ్యి; తత్తఱంబున్ = తొట్రుబాటుతో; వ్రేతలు = గొల్లభామలు; ఏ = ఎట్టి; పనుల్ = పనులు; కున్ = కు; చేతులాడకయున్ = తోచకుండా ఉండి; గోవుల్ = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడువకయు = తాగుటకువదలకపోయి; విడిచి = వదలినచో; విడిచి = వదలినా; ఈడకయున్ = పితుకక పోయి; ఈడి = పితికినను; ఈడియున్ = మరల పితుకుతు; ఈడిన = పితికిన; పాలు = పాలను; కాపకయున్ = మరిగించక, కాగబెట్టపోయి; కాచి = మరిగించినచో; కాచియున్ = మరల మరిగించి; కాగిన = మరిగించబడిన; పాలు = పాలను; డింపకయున్ = పొయ్యిమీంచి దింపకపోయి; డించి = దించినను; డించియు = మరల దించుచు; డించిన = దించినట్టి; పాలున్ = పాలను; బాలుర = పిల్లల; కున్ = కు; పోయకయున్ = తాగుటకు ఇవ్వకపోయి; పోసి = ఇచ్చినచో; పోసియున్ = మరల ఇచ్చి; పతుల్ = భర్తల; కున్ = కు; పరిచర్యలు = సేవలు; చేయకయున్ = చేయకపోయి; చేసి = చేసినను; చేసియున్ = మరల చేయుచు; అశనంబులు = ఆహారములు; కుడువకయు = తినకపోయి; కుడిచి = తినినచో; కుడిచియు = మరల తినుచు; కుసుమంబులు = పూలను; ముడువకయున్ = తలలోపెట్టుకొనకపోయి; ముడిచి = పెట్టుకొనినచో; ముడిచియున్ = మరలపెట్టుకొనుచు; తొడవులు = ఆభరణములను; తొడగయున్ = ధరించకపోయి; తొడిగి = ధరించినచో; తొడగియున్ = మరల ధరించుచు; గోష్ఠంబుల = పశువులకొట్టముల; పట్టులన్ = తరిని; ఉండకయున్ = నిలువకపోయి; పాయసంబులు = పరవాన్నములు; నెఱయన్ = చక్కగా; వండకయున్ = వండకపోయి; అయ్యై = ఆయా; ఎడల = సమయము లందు; నిలువంబడకయున్ = ఆగకపోయి; కాటుకలు = కంటికి పెట్టుకొనెడి కాటుక; సూటిన్ = తిన్నగా; ఇడకయున్ = పెట్టుకొనకపోయి; కురులు = శిరోజములను; చక్కనొత్తకయున్ = దువ్వుకొనకపోయి; కుచంబులన్ = స్తనము లందు; గంధంబులు = చందనపుపూతలు; కలయన్ = ఖాళీలేకుండ కలియునట్లు; మెత్తకయు = పూసికొనకపోయి; పయ్యెదలు = పైటలు; విప్పి = విప్పుకొని; కప్పకయున్ = మరల కప్పుకొనకపోయి; సఖుల్ = స్నేహితుల; కున్ = కు; చెప్పకయు = చెప్పకుండ; సహోదరులు = అన్నదమ్ములు; మగలు = భర్త; మామలు = భర్త తండ్రులు; మఱందులు = భర్త తమ్ముళ్ళు; బిడ్డలు = పిల్లలు; అడ్డంబుచని = అడ్డముగావచ్చి; నివారింపన్ = ఆపుతుండగా; తలారింపక = వెనుదిరగక, మరలక; సంచలించి = మిక్కిలి కలతనొంది; పంచభల్లుని = మన్మథుని {పంచభల్లుడు - ఐదు (పూల) బాణములు కలవాడు, మన్మథుడు}; భల్లంబుల = బాణముల యొక్క; మొల్లంపు = అధికమైన; జల్లులన్ = వానలా పడుతుండగ; పెల్లున = అతిశయముచేత; తల్లడిల్లి = తత్తరపడి; డిల్లపడి = డీలాపడిపోయి; మొగిళ్ళ = మబ్బుల; గమి = సమూహమునుండి; వెలువడి = బయటపడి; ఉల్లసిల్లు = ప్రకాశించునట్టి; తటిల్లతల = మెరుపుతీగల; పొందున = వలె; మందగమనలు = స్త్రీలు {మందగమన - మెల్లిగా నడచునామె, స్త్రీ}; అమంద = వేగవంతమైన; గమనంబులన్ = నడగలతో; మందన్ = గొల్లపల్లెనుండి; వెలువడి = బయలుదేరి; గోవింద = కృష్ణుని; సందర్శనంబున్ = చూచుట; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అప్పుడు = అప్పుడు.

భావము:

ఇలా క్రొత్తకుంకమతో అలంకృతమైన లక్ష్మీదేవి వదన మండలం వలె, ఉదయించిన నిండైన చంద్రమండలాన్ని చూసి తెల్లతామరల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు యమునాతీరంలో బృందావనములో లోకమును సమ్మోహింప జేసే ఒక మోహనగీతము మురళిపై ఆలపించాడు. ఆ మధురగానానికి ఆధీనమైన చిత్తాలతో గొల్ల యువతులు తత్తరపాటు చెందారు. ఏ పనులు చేయడానికీ వారికి చేయాడ లేదు; వారు ఆవులకు దూడలను విడువటం మరిచారు; విడచి కూడా పాలుపితక లేదు; పిదికి కూడా, పిదికిన పాలు కాచలేదు; కాచి కూడ, కాగిన పాలు దించలేదు; దించి కూడా, దించిన పాలు పిల్లలకు పోయ లేదు; పోసి కూడా, భర్తలకు సేవ చేయ లేదు; చేసి కూడా, అన్నము ఆరగించ లేదు; ఆరగించి కూడా, పూలు ధరించ లేదు; ధరించి కూడా, సొమ్ములు ధరించ లేదు; ధరించి కూడా, గొల్లపల్లెలలో ఉండ లేదు; ఆ గొల్ల వనితలు పరమాన్నములు కలియ వండ లేదు; ఆయా నిలవవలసిన చోటులలో నిలబడటం లేదు; కాటుకలు చక్కగా దిద్దుకోటం లేదు; శిరోజాలు సవరించుకో లేదు; స్తనములపై చందనము అలందుకో లేదు; పైటలు విప్పి కప్పుకోలేదు; చెలికత్తెలకు చెప్పలేదు; తోబుట్టువులు పతులు మామలు మరుదులు పిల్లలు అడ్డము వచ్చి వద్దని వారించినా కూడ వెనుకకు మరలినవారు కారు; ఆ గొల్లభామలు మనసులు సంచలించి పంచబాణుని మిక్కుట మైన బాణవర్షపు దెబ్బలకు తల్లడిల్లి సొమ్మసిల్లారు; మబ్బుల గుంపు నుండి వెలువడి మెరిసే మెరుపుల వలె అ సుందరీమణులు తొందర తొందరగా నడచి గోకులము నుండి బయలుదేరి కృష్ణుడిని దర్శించుకోడానికి వెళ్ళారు.