పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ఏకవింశత్యవతారములు

  •  
  •  
  •  

1-67-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు; నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు"రని సూతుం డిట్లనియె.

టీకా:

వినుండు = వినండి; అరూపుండు = రూపములేనివాడు; అయి = అయి; చిదాత్మకుండు = జ్ఞాని {చిదాత్మకుడు - చేతనా రూపమైన ఆత్మ కలవాడు, జ్ఞాని}; అయి = అయి; పరఁగు = ప్రవర్తిల్లు; జీవుని = జీవు; కిన్ = నకు; పరమేశ్వరు = పరమేశ్వరునియొక్క; మాయా = మాయతోకూడిన; గుణంబులు = గుణములు; ఐన = అయినట్టి; మహత్ = మహత్తు; ఆది = మొదలగు {మహత్త్వాదులు - చతుర్వింశతితత్వంబులు, (1)మహత్తు (1)పురుషుడు (1)ప్రకృతి (5)పంచభూతములు (5)పంచతన్మాత్రలు (5)పంచకర్మేంద్రియములు (5)పంచజ్ఞానేంద్రియములు మరియు (1)అంతఃకరణము మొత్తము 1+1+1+5+5+5+5+1 - 24 ... పందవింశతి తత్త్వములు చతుర్వింశతి తత్తవములు + బుద్ధి}; రూపంబుల = రూపముల; చేతన్ = చేత; ఆత్మస్థానంబుగాన్ = స్వస్థానముగా; స్థూల = భౌతికమైన; శరీరంబు = శరీరము; విరచితంబు = ఏర్పాటుచేయబడినది; ఐన = అయినట్టి; గగనంబునందున్ = ఆకాశమునందు; పవన = వాయువును; ఆశ్రిత = ఆశ్రయించిన; మేఘ = మేఘముల; సమూహంబును = సమూహమును; గాలియందున్ = వాయువునందు; పార్థివ = భూమికి సంబంధించిన; ధూళి = ధూళితోను; ధూసరత్వంబును = దుమ్ముతోను కూడినట్టి; ఏ = ఏ; రీతి = విధమైతే; ఆ = ఆ; రీతి = విధముగ; ద్రష్ట = చూచువాడు; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; అందున్ = లోపల; దృశ్యత్వంబున్ = చూడబడు దాని తత్త్వము; బుద్ధిమంతులు = జ్ఞానము గలవారు; కానివారి = కాకుండా ఉండే వారి; చేతన్ = చేత; ఆరోపింపంబడున్ = లేనిది యన్నట్లు గా భావింపబడును; ఈ = ఈయొక్క; స్థూల = భౌతిక; రూపంబు = రూపము; కంటెన్ = కంటెను; అదృష్ట = చూడబడని; గుణంబు = గుణములు; అయి = కలిగి యుండినదై; అశ్రుతంబు = వినబడనిది; ఐన = అయినట్టి; వస్తువు = పదార్థము; అగుటన్ = అగుట; చేసి = వలన; వ్యక్తంబున్ = అభివ్యక్తము, తెలియబడునది; కాక = కాకుండ; సూక్ష్మంబై = సూక్ష్మమై; కర = చేతులు; చరణ = కాళ్లు; ఆదులు = మొదలగుని; లేక = లేని; జీవుని = జీవుని; కిన్ = కి; ఒండొక = ఇంకొక; రూపంబు = రూపము; విరచితంబు = ఏర్పరచబడినది; ఐ = అయి; ఉండున్ = ఉండును; సూక్ష్ముఁడు = సూక్ష్మమైనవాడు; అయిన = అయినట్టి; జీవుని = జీవుని; వలనన్ = వలన; ఉత్క్రాంతి = వ్యక్తపరచ బడిన; గమన = వెడలుట; ఆగమనంబులన్ = వచ్చుటలను; పునర్జన్మంబున్ = మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు; తోఁచున్ = అర్థమగును; ఎప్పుడు = ఎప్పుడు; ఈ = ఈ యొక్క; స్థూల = భౌతిక; సూక్ష్మ = సూక్ష్మ; రూపంబులు = రూపములు; రెండున్ = రెండును; స్వ = తన; రూప = రూపము యొక్క; సమ్యక్ = పూర్తియైన; జ్ఞానంబునన్ = జ్ఞానమువలన; ప్రతిషేధింపఁబడున్ = అడ్డగింపబడును; అపుడ = అప్పుడు; అవిద్యన్ = అజ్ఞానము; చేసి = వలన; ఆత్మను = ఆత్మయందు; కల్పింపంబడును = కల్పింపబడతాయి; అనియున్ = అనీ; తెలియున్ = తెలసిన; అప్పుడు = అప్పుడు; జీవుండు = జీవుడు; బ్రహ్మ = పరబ్రహ్మను; దర్శనంబు = దర్శించుట; కున్ = కు; అధికారి = తగినవాడు; అగున్ = అగును; దర్శనంబు = దర్శనము; అనన్ = అనగా; జ్ఞాన = జ్ఞానముయొక్క; ఏక = ప్రత్యేకమైన; స్వరూపంబు = స్వరూపము; విశారదుండు = నేర్పరియైనవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరునిది = ఈశ్వరు యొక్క; ఐ = అయి; క్రీడించుచున్ = క్రీడిస్తూ, వినోదము గా చరిస్తూ; అవిద్య = అవిద్య; అనంబడుచున్ = అని పిలవబడుచు; ఉన్న = ఉన్నట్టి; మాయ = మాయ; ఉపరత = నిలచిపోయినది; ఐ = అయి; ఎప్పుడు = ఎపుడైతే; తాన = తానే; విద్య = విద్య యొక్క; రూపంబునన్ = రూపముగ; పరిణత = పరిణామము చెందినది; అగున్ = అగునో; అప్పుడు = అప్పుడు; జీవ = జీవునకు; ఉపాధి = ఆధారము; అయిన = అయినట్టి; స్థూల = భౌతికమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబున్ = రూపము; దహించి = నశించి; జీవుడు = జీవుడు; కాష్ఠంబు = కట్టె; లేక = లేకనే; తేజరిల్లున్ = ప్రకాశించు; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; తాన = తనే; ఉపరతుండు = నిలిచిపోయినవాడు; అయి = అయి; బ్రహ్మ = బ్రహ్మయొక్క; స్వరూపంబునన్ = స్వరూపమును; పొంది = ప్రాప్తించి; పరమ = అన్నిటికంటె నుత్తమమైన; ఆనందంబునన్ = ఆనందములో; విరాజమానుండు = విశేషముగ ప్రకాశించువాడు; అగున్ = అగును; ఇట్లు = ఈవిధముగ; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానము గలవారు; చెప్పుదురు = చెబుతారు; అని = అని చెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియె = చెప్పెను.

భావము:

వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానికి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమానందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు.