పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా సూచనంబు

  •  
  •  
  •  

1-58-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు దేవతాగురు నమస్కారంబుసేసి యిట్లనియె ”మునీంద్రులారా! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి; ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు? నెవ్విధంబున నాత్మ ప్రసన్నంబగు? నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి యే రూపంబునం గలుగు? నది పురుషులకుఁ బరమ ధర్మం బగు, వాసుదేవుని యందుఁ బ్రయోగింపఁ బడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు; నారాయణ కథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబు; లపవర్గపర్యంతం బయిన పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు; ధర్మంబు నందవ్యభిచారి యైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు; విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబు గాదు; నెంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు; తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు; తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస యగుటఁ గొందఱు ధర్మంబె తత్త్వం బని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానం బనుపేర నద్వయం బైన యది తత్త్వ మని యెఱుంగుదు; రా తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మ మనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు, సాత్వతులచేత భగవంతుం డనియును బలుకంబడు; వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి, జ్ఞాన వైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడగందురు; ధర్మంబునకు భక్తి ఫలంబు; పురుషులు వర్ణాశ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి; ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపనుం వర్ణింపనుం దగుఁ; జక్రాయుధ ధ్యానం బను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు; భగవంతుని యందలి శ్రద్ధయు; నపవర్గదం బగు తత్కథాశ్రవణాదుల యం దత్యంతాసక్తియుఁ; బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మనిర్మూలన హేతువు లైన కమలలోచను కథలం దెవ్వండు రతిసేయు విననిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు; పుణ్యశ్రవణకీర్తనుం డైన కృష్ణుండు తనకథలు వినువారి హృదయంబు లందు నిలిచి, శుభంబు లాచరించు; నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన భాగవతశాస్త్రసేవా విశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబు లైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నం బగుఁ; ప్రసన్నమనస్కుం డైన ముక్తసంగుం డగు; ముక్తసంగుం డైన నీశ్వరతత్త్వజ్ఞానంబు సిద్ధించు; నీశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథనరూపం బైన యహంకారంబు భిన్నం బగు; నహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబు లగు సంశయంబులు విచ్ఛిన్నంబు లగు; సంశయవిచ్ఛేదం బైన ననారబ్ధఫలంబు లైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం గావున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈవిధంగా; దేవతా = దేవతలకు; గురు = గురువులకు; నమస్కారంబున్ = నమస్కారము; చేసి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్రులారా = శ్రేష్ఠులారా; నన్ను = నన్ను; మీరు = మీరు; నిఖిల = అన్ని; లోక = లోకములకు; మంగళంబు = శుభకరము; ఐన = అయినట్టి; ప్రయోజనంబు = ప్రయోజనము; అడిగితిరి = అడిగారు; ఏమిటన్ = దేనివలన; కృష్ణ = కృష్ణుని; సంప్రశ్నంబు = ఆశ్రయము, శరణు; సేయంబడున్ = కలుగుతుందో; ఏ = ఏ; విధంబునన్ = విధము వలన; ఆత్మ = ఆత్మ; ప్రసన్నంబు = సంతుష్టము; అగున్ = అవుతుంది; నిర్విఘ్నయు = ఆటంకములు లేనిది; నిర్హేతుకయున్ = కారణములేనిది; ఐ = అయి; హరి = హరియందు; భక్తి = భక్తి; ఏ = ఏ; రూపంబునన్ = విధము వలన; కలుగున్ = కలుగుతుందో; అది = అది; పురుషుల = మానవుల; కున్ = కు; పరమధర్మంబు = పరమ ధర్మము; అగు = అయిన; వాసుదేవుని = భగవంతుని; అందున్ = గురించి; ప్రయోగింపఁబడిన = నడప బడిన; భక్తి = భక్తి; యోగంబు = యోగము; వైరాగ్య = వైరాగ్యమును; విజ్ఞానంబులన్ = విజ్ఞానములను; పుట్టించు = కలిగించును; నారాయణ = భగవంతుని; కథల = కథల; వలనన్ = వలన; ఎయ్యే = ఏఏ; ధర్మంబులు = ధర్మములు; తగులువడవు = పట్టు బడవో; అవి = అవి; నిరర్థకంబులు = ప్రయోజనము లేనివి; అపవర్గ = మోక్షము; పర్యంతంబు = వరకు; అయిన = వ్యాపించిన; పరధర్మంబున్ = పరధర్మమున; కున్ = కు; దృష్ట = చూడబడు; శ్రుత = వినబడు; ప్రపంచ = ప్రాపంచిక; అర్థంబు = విషయములు; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; ధర్మంబున్ = ధర్మము; అందున్ = లో; అవ్యభిచారి = అతిక్రమించనిది {అవ్యభిచారి - (అది తప్ప) మరియొకదానియందు చరించనిది}; ఐన = అయిన; అర్థంబు = విషయము; కున్ = కు; కామంబు = కామము; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; విషయ = ఇంద్రియార్థములను; భోగంబు = అనుభవించుట; ఐన = అయినట్టి; కామంబు = కామము; కున్ = కు; ఇంద్రియ = ఇంద్రియములకు; ప్రీతి = ప్రియము కలుగ జేయుట; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; ఎంత = ఎంత; తడవు = కాలము; జీవించున్ = జీవించునో; అంతియ = అంత వరకు మాత్రమే; కామంబు = కామము; కున్ = కు; ఫలంబు = ప్రయోజనము; తత్త్వ = సృష్టిలోని సత్యమును, పరబ్రహ్మను; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; కల = ఉన్నటువంటి; జీవుడు = మానవుడు; కున్ = కు; కర్మంబుల = కర్మల; చేతన్ = చేత; ఎయ్యది = ఏదయితే; సుప్రసిద్ధంబు = బాగా ప్రసిద్ధమైనదో; అదియున్ = అది కూడా; అర్థంబు = ప్రయోజనము; కాదు = కాదు; తత్త్వ = తత్త్వ; జిజ్ఞాస = జిజ్ఞాస; అనునది = అనునది; ధర్మ = ధర్మమును; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; అగుటన్ = అగుట చేత; కొందఱు = కొందఱు; ధర్మంబె = ధర్మమే; తత్త్వంబు = తత్త్వము; అని = అని; పలుకుదురు = అందురు; తత్త్వవిదులు = తత్త్వము తెలిసినవారు; జ్ఞానంబు = జ్ఞానము; అను = అను; పేరన్ = పేరుతో; అద్వయంబు = అదితప్ప మరింకొకటి లేనిది; అయిన = అయినట్టి; అది = అది; తత్త్వము = తత్త్వము; అని = అని; ఎఱుంగుదురు = తెలియుదురు; ఆ = ఆయొక్క; తత్త్వంబు = తత్త్వము; ఔపనిషదుల = ఉపనిషత్తులను అనుసరించువారి; చేతన్ = చేత; బ్రహ్మము = బ్రహ్మము; అనియు = అనీ; హైరణ్యగర్భుల = హిరణ్యగర్భుని వివరించువారి {హిరణ్యగర్భుడు - హిరణ్య (బంగారు అండము) నందు గర్భుడు (జనించిన వాడు), బ్రహ్మదేవుడు}; చేతన్ = చేత; పరమాత్మ = పరమాత్మ; అనియు = అనీ; సాత్వతుల = భాగవత మతము నవలంభించినవారి; చేతన్ = చేత; భగవంతుండు = భగవంతుండు; అనియును = అనీ; పలుకంబడు = తెలుప బడుచున్నది; వేదాంత = వేదాంతమును; శ్రవణంబున = వినుట వలన; గ్రహింపంబడి = తెలిసికొని; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్యంబుల = వైరాగ్యముల; తోడన్ = తో; కూడిన = కలిసియున్న; భక్తి = భక్తి; చేతన్ = చేత; తత్పరులు = దాని యందు నిష్ఠ గలవారు; ఐన = ఐన; పెద్దలు = మహాత్ములు; క్షేత్రజ్ఞుండు = శరీరమును ధరించిన జీవుడు; ఐన = అయిన; ఆత్మ = జీవాత్మ; అందున్ = లో; పరమాత్మన్ = పరమాత్మను; పొడగందురు = దర్శించెదరు; ధర్మంబు = ధర్మము; కున్ = కు; భక్తి = భక్తి; ఫలంబు = ప్రయోజనము; పురుషులు = మానవులు; వర్ణ = వివిధ వర్ణముల {చతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర}; ఆశ్రమ = వివిధ ఆశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హపత్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి నాలుగు ఆశ్రమములు}; ధర్మ = ధర్మములులోని; భేదంబులన్ = భేదముల ప్రకారము; చేయు = చేయు; ధర్మంబు = ధర్మముల; కున్ = కు; మాధవుండు = లక్ష్మీదేవి భర్త, హరి; సంతోషించుటయె = సంతోషించుటే; సిద్ధి = ప్రయోజనము; ఏక = ఏకాగ్ర; చిత్తంబున = మనసుతో; నిత్యంబును = నిత్యమూ; గోవిందుని = కృష్ణుని; ఆకర్ణింపనున్ = వినుటయును; వర్ణింపనున్ = కీర్తించుటయును; తగున్ = తగినది; చక్రాయుధ = హరి {చక్రాయుధుడు - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; ధ్యానంబు = ధ్యానము; అను = అనే; ఖడ్గంబున = కత్తితో; వివేకవంతులు = వివేకవంతులు; అహంకార = అహంకారమునందు; నిబద్ధంబు = బంధింపబడినది; ఐన = అయిన; కర్మంబు = కర్మములను; త్రుంచివైతురు = త్రుంచివైతురు; భగవంతుని = భగవంతుని; అందలి = మీది; శ్రద్ధయున్ = శ్రద్ద; అపవర్గదంబు = మోక్షమిచ్చునవి; అగు = అయినటువంటి; తత్ = అతని; కథా = కథలు; శ్రవణ = వినుట; ఆదులు = మొదలగువాటి; అందున్ = అందు; అత్యంత = మిక్కిలి; ఆసక్తియు = కుతూహలమును; పుణ్యతీర్థ = పుణ్యతీర్థములలో; అవగాహన = స్నానముచేయుట; మహత్ = మహాత్ములను; సేవ = సేవించుట; ఆదుల = మొదలగువాని; చేన్ = చేత; సిద్ధించు = కలుగును; కర్మ = కర్మలను; నిర్మూలన = నశింపచేయుటకు; హేతువులైన = కారణములైన; కమలలోచను = భగవంతుని {కమలలోచనుడు - కమలములవంటి కన్నులుగలవాడు, విష్ణువు}; కథలు = కథల; అందున్ = లో; ఎవ్వండు = ఎవడు; రతిసేయు = కుతూహలపడునో; వినన్ = వినుటను; ఇచ్చగించు = ఇష్టపడతాడో; వాని = అతని; కిన్ = కి; ఇతరంబులు = మిగిలినవి; ఎవ్వియు = ఏవీకూడా; రుచి = ఇష్టమును; పుట్టింపన్ = కలుగ; నేరవు = జేయలేవు; పుణ్య = పుణ్యమును కలుగజేయు; శ్రవణ = తన కథలు వినబడువాడు, శ్రుతి; కీర్తనుండు = కీర్తింపబడు వాడు, స్తోత్రము చేయబడు వాడు; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; తన = తనయొక్క; కథలు = కథలు; వినువారి = వినే వారి; హృదయంబులు = మనసుల; అందున్ = లో; నిలిచి = నివసించి; శుభంబులు = శుభములు; ఆచరించున్ = సమకూర్చును; అశుభంబులు = అశుభములను; పరిహరించున్ = నశింపజేయును; అశుభంబులు = అశుభములు; నష్టంబులు = నాశనము; అయిన = అయినచో; భాగవత = భాగవత; శాస్త్ర = పురాణాల; సేవ = సేవయొక్క; విశేషంబున = విశిష్టత వలన; నిశ్చల = అచంచలమైన; భక్తి = భక్తి; ఉదయించున్ = ప్రాప్తించును; భక్తి = భక్తి; కలుగ = కలుగుట వలన; రజస్ = రజస్; తమో = తమో; గుణ = గుణముల నుండి; ప్రభూతంబులు = పుట్టినవి; ఐన = ఐనటువంటి; కామ = కామము; లోభ = లోభము; ఆదులు = మొదలగు; కున్ = వాటికి; వశంబుగాక = లొంగక; చిత్తంబు = చిత్తము; సత్త్వ = సత్త్వ; గుణంబునన్ = గుణములో; ప్రసన్నంబు = ప్రశాంతమైనది; అగున్ = అవుతాడు; ప్రసన్న = ప్రసన్నమైన; మనస్కుండు = మనసుగలవాడు; ఐన = అయిన; ముక్తసంగుండు = బంధవిముక్తుడు {ముక్తసంగుడు - ముక్త (విడువబడిన) సంగుడు (తగులములు కలవాడు)}; అగు = అవుతాడు; ముక్తసంగుండు = బంధవిముక్తుడు; ఐనన్ = అయినచో; ఈశ్వర = భాగవత; తత్త్వజ్ఞానంబు = పరతత్త్వ జ్ఞానము; సిద్ధించున్ = సిద్ధించును; ఈశ్వరుండు = భగవంతుడు; కానంబడినన్ = దర్శనము జరిగిన; చిత్ = చైతన్య రూపమైన జ్ఞానము; జడ = అచేతన రూపమైన అజ్ఞానములు; గ్రథన = గ్రంథి {గ్రథనము - ముడి పెట్టబడినది, గ్రుచ్చుట, కూర్చుట}; రూపంబు = రూపము; ఐన = అయినటువంటి; అహంకారంబు = అహంకారము; భిన్నంబగు = బ్రద్ధలగును; అహంకారంబు = అహంకారము; భిన్నంబు = బ్రద్దలు; ఐనన్ = అయితే; అసంభావన = చక్కగా భావింప కుండుట; ఆది = మొదలైన; రూపంబులు = రూపములు; అగు = అయిన; సంశయంబులు = సంశయములు; విచ్ఛిన్నంబులగు = నశించిపోతాయి; సంశయ = సంశయముల; విచ్ఛేదంబు = నాశనము; ఐనన్ = అయినచో; అనారబ్ధ = అనారబ్ధ {అనారబ్ధములు - ఇంకనూ ప్రారంభింపబడనివి (ప్రభావము చూపనివి) ఐన పూర్వకర్మఫలములు}; ఫలంబులు = ఫలితములు ఇచ్చేటివి; ఐన = ఐనటువంటి; కర్మంబులు = కర్మములు; నిశ్శేషంబులు = శేషము మిగలనవి; ఐ = అయి; నశించున్ = నశించి పోవును; కావున = అందువలననే.

భావము:

అని దేవతలకు, గురువులకు ప్రణామాలు చేసి సూతుడు శౌనకాదులతో ఇలా చెప్పసాగాడు మునీంద్రులారా! సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరడిగారు. దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము నయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తియోగంవలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియసంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్త్వవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు, తత్త్వవేత్తలైన వారు అద్వైతజ్ఞానమే తత్త్వమని తలుస్తారు. ఆ తత్త్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటారు. హైరణ్యగర్భులు పరమాత్మ అంటారు. సాత్త్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై, జ్ఞానంతోనూ, వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ యందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించటం, అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలనూ, పుణ్యపురుషులనూ సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణకీర్తనుడైన పురుషోత్తముడూ తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలూ సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. అశుభ పరిహారంవల్ల భాగవతసేవ లభిస్తుంది, భాగవతసేవ వల్ల అచంచలభక్తి ప్రాప్తిస్తుంది. భక్తివల్ల రజస్తమోగుణాలతో చెలరేగిన కామలోభాదులకు లొంగక చిత్తం సత్త్వగుణాయత్తమై ప్రసన్నమౌతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్త్వజ్ఞానం సిద్ధించి ఈశ్వరదర్శనం లభిస్తుంది. ఈశ్వరదర్శనం వల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమౌతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలూ పటాపంచలౌతాయి. సంశయాలు తొలిగిపోగానే అశేషకర్మలూ నిశ్శేషమై నశిస్తాయి.